జిల్లాల్లో హెల్త్‌కేర్‌ క్యాంపులు

29 Mar, 2020 04:21 IST|Sakshi
శ్రీకాకుళం వైఎస్సార్‌ కళ్యాణ మండపంలో బయట నుంచి వచ్చిన వాళ్ల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వసతులు

ఇతర జిల్లాల వారి కోసం ఏర్పాటు

కల్యాణ మండపాలు, కమ్యూనిటీ హాళ్లలో వసతి, భోజన సౌకర్యాలు

సాక్షి, అమరావతి: కోవిడ్‌ వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి రాష్ట్రంలో అంతర్‌ జిల్లాల మధ్య రాకపోకలను ప్రభుత్వం నిలిపేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇతర జిల్లాల్లో ఉండిపోయిన వేరే జిల్లాల వారికి కల్యాణ మండపాలు, కమ్యూనిటీ హాళ్లు, ఖాళీగా ఉన్న ప్రభుత్వ భవనాల్లో హెల్త్‌కేర్‌ క్యాంపులు (క్వారంటైన్‌) నిర్వహించాలని ఆయా జిల్లాల కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. అంతేకాకుండా వారికి మెరుగైన వసతి, నాణ్యమైన భోజనం, నీటి సరఫరా అందించాలని సూచించింది. ఆయా క్యాంపుల్లో సౌకర్యాల కల్పనలో ఏమైనా లోటుపాట్లు ఉంటే వాటిని సరిచేయడానికి.. ఆయా జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి తగిన ఏర్పాట్లు చేయడానికి రాష్ట్ర స్థాయిలో నోడల్‌ ఆఫీసర్‌గా వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌ పీయూష్‌ కుమార్‌ను నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) నీలం సాహ్ని శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. హెల్త్‌కేర్‌ క్యాంపుల్లోని ప్రజలతో మాట్లాడి ఎప్పటికప్పుడు వారికి అన్ని వసతులు సమకూర్చేలా చర్యలు తీసుకోవడంతోపాటు ప్రతిరోజూ నివేదికను సీఎస్‌తోపాటు సీఎం కార్యాలయానికి పంపాలని పేర్కొన్నారు. 

ఇతర రాష్ట్రాల సరిహద్దుల్లోని ఆంధ్రుల కోసం నోడల్‌ అధికారిగా సతీశ్‌ చంద్ర
లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల సరిహద్దుల్లో నిలిచిపోయిన ఆంధ్రుల బాగోగులను చూసేందుకు నోడల్‌ ఆఫీసర్‌గా ఉన్నత విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీశ్‌ చంద్రను రాష్ట్ర ప్రభుత్వం నియమిం చింది. ఈ మేరకు సీఎస్‌ నీలం సాహ్ని శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. పొరుగు రాష్ట్రాల సరిహద్దుల్లో నిలిచిపోయిన రాష్ట్ర ప్రజల కోసం అక్కడే హెల్త్‌కేర్‌ క్యాంపులు (క్వారంటైన్స్‌) ఏర్పాటు చేసి వారికి భోజనం, మంచి నీరు, వసతి, పారిశుధ్య సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని పేర్కొ న్నారు. కర్ణాటకలోని కోలార్‌ జిల్లా, ఉత్తరప్ర దేశ్‌లోని వారణాసి జిల్లాల్లో రాష్ట్రానికి చెందిన వారు నిలిచిపోయారని ప్రభుత్వం గుర్తించిం ది. దీంతో ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

మరిన్ని వార్తలు