వరదలతో అపార నష్టం

19 Sep, 2019 08:52 IST|Sakshi

భారీ వర్షాలకు నీటమునిగిన పంటలు 

ఉద్యాన తోటలకూ తీవ్ర నష్టం 

దెబ్బతిన్న రహదారులు 

13,827 ఇళ్లలోకి వరదనీరు

ప్రభుత్వ ముందస్తు చర్యలతో తప్పిన ప్రాణ నష్టం

వర్ష నష్టాన్ని ప్రాథమిక అంచనా వేసిన అధికారులు 

సాక్షి, కర్నూలు:  నంద్యాల రెవెన్యూ డివిజన్‌లో ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. ప్రభుత్వ, ప్రజల ఆస్తులు ధ్వంసం కావడంతో రూ.వందల కోట్ల మేర నష్టం వాటిల్లింది. మొత్తం 17 మండలాల్లోని 95 గ్రామాల పరిధిలో ఆదివారం అర్ధరాత్రి నుంచి బుధవారం వరకు భారీ వర్షాలు కురిశాయి. ప్రభుత్వం తీసుకున్న ముందస్తు, అప్రమత్త చర్యల కారణంగా ఎక్కడా ప్రాణ నష్టం వాటిల్లలేదు. లోతట్టు ప్రాంతాలు, వంకలు, వాగులు, చెరువుల్లో చిక్కుకున్న ప్రజలను తక్షణమే కాపాడడంతో పాటు వారిని సహాయక శిబిరాల్లో ఉంచి తగిన సేవలు అందించడంలో అధికార యంత్రాంగం సఫలమైంది. భారీ వర్షాలతో జరిగిన నష్టాన్ని అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. ఈ మేరకు నివేదికను ప్రభుత్వానికి పంపారు.


నంద్యాల పట్టణంలో ముంపు ప్రాంతాలను పరిశీలిస్తున్నకలెక్టర్‌ వీరపాండియన్, ఎస్పీ ఫక్కీరప్ప తదితరులు 

భారీగా పంట నష్టం 
నంద్యాల డివిజన్‌లోని 15 మండలాల్లో 29,847 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. అత్యధికంగా వరి 16,228 హెక్టార్లలో,  పత్తి 5,195 హెక్టార్లలో దెబ్బతిన్నట్లు వ్యవసాయ యంత్రాంగం తేల్చింది. పంటలకు దాదాపు రూ.70 కోట్ల మేర నష్టం జరగ్గా.. పెట్టుబడి రాయితీ కింద రూ.41.44 కోట్లు విడుదల చేయాలని జిల్లా యంత్రాంగం ప్రతిపాదించింది. ఉద్యాన పంటలకు సంభవించిన నష్టం రూ.55.14 కోట్లు ఉండగా..ఇన్‌పుట్‌ సబ్సిడీ రూ.3.02 కోట్లు విడుదల చేయాలని ఉద్యానశాఖ ప్రతిపాదించింది. అలాగే రూ.5 లక్షల విలువ చేసే పశుసంపద మృత్యువాత పడింది.  నందిపల్లి, తమ్మడపల్లి, బుక్కాపురం, తిమ్మాపురం, మసీదుపురం, ఎర్రగుంట్ల, యూళ్లూరు, గోవిందపల్లె గ్రామాల్లో పశుగ్రాసం పూర్తిగా నీట మునిగి పనికిరాకుండా పోయింది. 


వరద నీటి నుంచి బయట పడిన మహానంది ఆలయం 

13,827 ఇళ్లలోకి వరద నీరు 
భారీ వర్షాలతో గ్రామాలు చెరువులను తలపించడంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. గోస్పాడు, నంద్యాల, మహానంది మండలాలతో పాటు మిగిలిన 14 మండలాల్లో దాదాపు 13,827 ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. ఇందులో 417 ఇళ్లు దెబ్బతిన్నాయి. 95 గ్రామాల్లో వరద నీరు చేరినా ఎక్కడా ప్రాణ నష్టం జరగకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. లోతట్టు ప్రాంతాలు, వంకలు, వాగులు, చెరువుల వద్దకు ప్రజలు వెళ్లకుండా ముందస్తు చర్యలు తీసుకోవడంతో  ప్రాణనష్టం తప్పింది. అలాగే అధికారులు సకాలంలో స్పందించి వరదలో చిక్కుకున్న 30 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

 
గోస్పాడు మండలం దీబగుంట్ల గ్రామాన్ని వీడని నీరు 

దెబ్బతిన్న రోడ్లు 
భారీ వర్షాలు, వరదల వల్ల నంద్యాల డివిజన్‌లోని 10 మండలాల్లో దాదాపు 59.13 కిలోమీటర్ల మేర పంచాయతీరాజ్‌ రోడ్లు దెబ్బతిన్నాయి. ఇదే శాఖ పరిధిలో 45 ప్రాంతాల్లో కల్వర్టులు సైతం దెబ్బతిన్నాయి. అలాగే జిల్లా వ్యాప్తంగా దాదాపు 638 కిలోమీటర్ల మేర ఆర్‌అండ్‌బీ రోడ్లకు నష్టం వాటిల్లింది. వీటి మరమ్మతులు, శాశ్వత నిర్మాణాల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయడంలో అధికారులు నిమగ్నమయ్యారు. 

మునిసిపాలిటీలకు భారీ నష్టం 
భారీ వర్షాలతో నంద్యాల, ఆళ్లగడ్డ మునిసిపాలిటీలకు భారీ నష్టం వాటిల్లింది. వాటి పరిధిలో మంచినీటి పైపులైన్లు, మురుగు కాల్వలు ధ్వంసం కావడంతో రూ.33.76 కోట్ల నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు. అలాగే నంద్యాల డివిజన్‌లో విద్యుత్‌ శాఖకు రూ.5 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా వేశారు.  152 విద్యుత్‌ స్తంభాలు, 25 ఎల్‌టీ లైన్లు, 500 సర్వీసులు దెబ్బతిన్నట్లు గుర్తించారు. అర్‌డబ్ల్యూఎస్‌ శాఖకు కూడా రూ.1.8 కోట్ల నష్టం వాటిల్లింది.


ఆలూరులో పొంగిపొర్లుతున్న వాగు  

సహాయక చర్యలు భేష్‌ 
భారీ వర్షాల బారిన పడిన ప్రజల కోసం ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలు పలువురి ప్రశంసలను అందుకున్నాయి. 45 క్యాంపులను ఏర్పాటు చేయడంతో పాటు 24,730 మంది ప్రజలకు మంచినీరు, ఆహారం, ఇతర సదుపాయాలను సమకూర్చింది. అక్కడక్కడ వరదలో చిక్కుకున్న ప్రజలను కాపాడేందుకు నాలుగు బోట్లు ఏర్పాటు చేశారు. 40 ఫైరింజన్లను నిత్యం అందుబాటులో ఉంచారు. సహాయక చర్యల కోసం రూ.45 కోట్లు ఖర్చు చేశారు. మరోవైపు 15 మెడికల్‌ క్యాంపులను నిర్వహించి.. రోగాల బారిన పడిన వారికి ఉచితంగా వైద్య పరీక్షలతోపాటు మందులను పంపిణీ చేశారు.

చదవండి : నీళ్లల్లో మహానంది 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మారు వేషంలో ధరలు తెలుసుకున్న జేసీ!

అందుకే ఢిల్లీ వెళ్లా : అంజాద్‌ బాషా

సిగ్గు అనిపించడం లేదా చంద్రబాబు?

2 వేల క్వారంటైన్ బెడ్లు సిద్ధం: మంత్రి బొత్స

ఢిల్లీ వెళ్లిన వారెవరు

సినిమా

కరోనా: నెటిజన్ల ట్రోల్స్‌పై స్పందించిన సోనాక్షి

హలో! ఇప్పుడే క్లారిటీకి రాకండి: పూజా హెగ్డే

కరోనా: మరో ప్రముఖ నటుడు మృతి 

అమలాపాల్‌ రెండో పెళ్లిపై స్పందించిన శ్రీరెడ్డి

ఇటలీలో మన గాయని

స్ఫూర్తి నింపేలా...