తడిసి ముద్దయిన ఉత్తర తెలంగాణ

19 Jul, 2013 18:48 IST|Sakshi
తడిసి ముద్దయిన ఉత్తర తెలంగాణ

ఉత్తర తెలంగాణ జిల్లాలు తడిసి ముద్దయ్యాయి. ప్రధానంగా కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. జనజీవనం స్తంభించింది. కరీంనగర్ జిల్లా మహాదేవ్‌పూర్‌, మహాముత్తారం మండలాల్లో భారీ వర్షం కురిసింది. జలదిగ్బంధంలో 14 గ్రామాలు చిక్కుకోవడంతో బాధిత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కూంబింగ్‌కు వెళ్లిన పోలీసులు కూడా వరదల్లో చిక్కుకున్నారు.

ఇలా వరదల్లో చిక్కుకున్న ప్రజలు, పోలీసులను రక్షించేందుకు ప్రత్యేక హెలికాప్టర్ ఏర్పాటు చేశారు. మరోవైపు బెజ్జెంకి మండలం ఈదుల వాగులో ఓ కారు కొట్టుకుపోయింది. ముగ్గురు వ్యక్తులు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఎల్లారెడ్డిపేట మండలం అగ్రహారం చెరువు నిండి ఇళ్లలోకి నీరు రావడంతో చెరువుకు గ్రామస్తులు గండికొట్టారు. ఎల్లారెడ్డిపేట మండలం ఈర్నిపల్లి, చిట్టివాగు పొంగిపొర్లడంతో 11 గ్రామాలకు రాకపోకలు బందయ్యాయి. ముస్తాబాద్ మండలంలో 33 ఇళ్లు నేలకూలాయి.

నిజామాబాద్‌ జిల్లాలోనూ భారీ వర్షం కురిసింది. నిజాంసాగర్‌ ప్రాజెక్ట్‌కు భారీగా వరద నీరు చేరుకుంది. లోతట్టు ప్రాంతాలు, రోడ్లు జలమయం అయ్యాయి. గాంధారీ-బాన్సువాడ రోడ్డుపై ముదెల్లి వాగు పొంగుతోంది. రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. కళ్యాణి వాగు పొంగి ఎల్లారెడ్డి, తిమ్మారెడ్డి, రత్నాపూర్‌లకు రాకపోకలు ఆగిపోయాయి. కామారెడ్డి మండలం దేవునిపల్లిలో భారీ వర్షానికి ఓ ఇల్లు కూలిపోయింది. నిజాంసాగర్‌ ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 1405 అడుగులు కాగా, ఇప్పటికే అది 1383.92 అడుగులకు చేరుకుంది. అధికారులు అనుక్షణం అప్రమత్తంగా ఉండి లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.

భారీ వర్షాలతో వరంగల్‌ జిల్లా వణుకుతోంది. పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఏటూరునాగారం మండలంలోని ఆళ్లవారిఘనపురం ముంపుకు గురవడంతో గిరిజనులు సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. రామన్నగూడెం వద్ద గోదావరి నీటి మట్టం11 మీటర్లకు చేరుకుంది. దీంతో అధికారులు 3వ ప్రమాద సూచిక ఎగురవేశారు.

ఏటూరు నాగారం రామన్నగూడెం వద్ద గోదావరి ప్రవాహ ఉధృతి ఆందోళకర స్థాయిలో ఉంది. చిల్పూరు వద్ద మోరంచ వాగు పొంగడంతో పరకాల, భూపాలపల్లి, తాళేశ్వరం, హన్మకొండలకు రాకపోకలు నిలిచిపోయ్యాయి. కాశీబుగ్గలో ఇల్లు కూలి భాస్కర్ అనే వ్యక్తి మృతి చెందాడు. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్ కిషన్ ఆదేశించారు.

ఆదిలాబాద్‌ జిల్లాలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా హాజిపూర్‌లో 16.5, లక్సెట్టిపేటలో 15.5 సెం.మీ.ల వర్షపాతం నమోదైంది.

మరిన్ని వార్తలు