హేమలత న్యాయపోరాటం

1 May, 2019 10:28 IST|Sakshi
కుటుంబ సభ్యులతో హేమలత

ఎస్పీని కలిసిన బాధితురాలు

తన భర్తతో కలిసి ఉండేలా చూడాలని వేడుకోలు

అనంతపురం, తాడిమర్రి: ప్రేమించి..పెళ్లిచేసుకున్నోడే...నేను పోషించలేను...నిన్ను ఏలుకోలేనని నిర్దయగా చెప్పగా...అతన్ని నమ్మివెళ్లిన ఆ అమ్మాయి జీవితం సందిగ్ధంలో పడింది. కేవలం ‘కులం’ వేరు కావడంతోనే తన అత్తామామలు చేరదీయక అన్యాయమై పోయిన హేమలత దిక్కుతోచని స్థితిలో మంగళవారం ఎస్పీ అశోక్‌కుమార్‌ను కలిసి తన గోడు వెళ్లబోసుకుంది. తనకు న్యాయం చేయాలని వేడుకుంది.

పరిచయం..ప్రేమ...పెళ్లి
తాడిమర్రి మండలంలోని నార్శింపల్లి గ్రామానికి చెందిన ఎరికల సామాజిక వర్గానికి చెందిన సాకే ఈరప్ప, సాకే లింగమ్మ దంపతులది నిరుపేద కుటుంబం. వారికి వాణి, హేతలత ఇద్దరు అమ్మాయిలు సంతానం. కూలికెళితే గానీ పూట గడవని కుటుంబం..అయినా పిల్లలిద్దరినీ కష్టపడి చదివించారు. పెద్ద కుమార్తె వాణి డిగ్రీ (బీఎస్సీ) చదవగా.. చిన్న కుమార్తె హేమలత ధర్మవరంలోని శ్రీనివాస డిగ్రీ కళాశాలలో డిగ్రీ (బీకాం) చదివింది. అక్కాచెల్లెలు ఇద్దరు రోజు కళాశాలకు ధర్మవరం వెళ్లి, వస్తుండేవారు. ఈ క్రమంలో హేమలతకు తాడిమర్రి మండలం  పూలఓబయ్యపల్లి గ్రామానికి చెందిన పాళ్యం శివయ్యతో పరిచయం ఏర్పడి... అది ప్రేమగా మారి వివాహానికి దారి తీసింది.

పెద్దలు ఒప్పుకోరని....
ఇద్దరి కులాలు వేరు కావడంతో తమ వివాహానికి ఇరు కుటుంబాల పెద్దలు ఒప్పుకోరని భావించిన హేమలత, శివయ్య ఏప్రిల్‌ 21న ధర్మవరంలో డిగ్రీ ఫైనల్‌ ఇయర్‌ చివరి పరీక్ష రాసి తిరుపతికి వెళ్లారు. అక్కడే ఓ ఆలయంలో ఆదే రోజున వివాహం చేసుకున్నారు. సాయంత్రానికి రావాల్సిన కూతురు ఇంటికి రాకపోవడంతో హేమలత తల్లిదండ్రులు కళాశాల, బంధువుల గ్రామాల్లో విచారించారు. చివరకు కూతురు కనిపించలేదని తాడిమర్రి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో వారి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఇంతలో వధూవరులిద్దరూ పూలఓబయ్యపల్లిలోని వరుని ఇంటికి వెళ్లారు. ‘‘ఎరికల కులం అమ్మాయివి నీవు మా ఇంటిలోకి రాకూడదు’’ అని అత్తామామలు హేమలతను గెంటేశారు. కుమారునికి మాయమాటలు చెప్పి హేమలతపై మనసు లేకుండా చేశారు. పోలీసులు ఆర్డీఓ దగ్గరకు తీసుకెళ్లి కౌన్సిలింగ్‌ ఇచ్చి కాపురం పెట్టిస్తే నెల తిరక్కనే ‘‘నిన్ను పోషించలేను’’ అని వరుడు అడ్డం తిరిగాడు. దీంతో హేమలత తనకుటుంబీకులతో కలిసి న్యాయం పోరాటం చేస్తోంది. ఈక్రమంలోనే ఎస్పీ అశోక్‌కుమార్‌ను కలవగా...ఆయన ధర్మవరం డీఎస్పీ వెంకటరమణకు ఫోన్‌చేసి న్యాయం చేయాలని ఆదేశించారు.

న్యాయం జరిగే వరకూ పోరాటం
ప్రేమ, పెళ్లి అంటే ఏమిటో తెలియక ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఎరికల దానివి ఇంటిలోకి రాకూడదని మా అత్తామామలు అంటున్నారు. నా భర్త శివయ్య నిన్ను పోషించలేను, విడపోదామంటున్నాడు. ఒకసారి ఒకరితో తాళి కట్టించుకుని, జీవితం పంచుకుని విడిపోయి ఎలా జీవించను. న్యాయం జరిగే వరకూ పోరాడతా.–హేమలత, వధువు,నార్శింపల్లి, తాడిమర్రి
 
తప్పకుండాన్యాయం చేస్తాం  
హేమలతకు తప్పకుండా న్యాయం చేస్తాం. అమ్మాయి కుటుంబసభ్యులతో కలిసి వచ్చి మంగళవారం నన్ను కలిసింది. వారి సమస్య విన్నాను. వెంటనే ధర్మవరం డీఎస్పీకి ఆదేశాలు కూడా జారీ చేశా.  
– జీవీజీ అశోక్‌కుమార్, జిల్లా ఎస్పీ 

మరిన్ని వార్తలు