నిప్పుల వాన

13 Jun, 2014 02:53 IST|Sakshi
నిప్పుల వాన

 జిల్లాలో గురువారం నిప్పుల వాన కురిసింది. వడగాడ్పులు 13 మంది ఉసురు తీశాయి. ఉదయం నుంచే సూరీడు చండ ప్రచండంగా మండిపడటంతో జనం అల్లాడిపోయారు. ఉద్ధృతంగా వీచిన వడగాడ్పులను తట్టుకోలేక విల విల్లాడారు. పట్టణాలు.. పల్లెలు అన్న తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లోని రోడ్లూ నిర్మానుష్యంగా మారాయి. కూలి పనులకు వెళ్లలేక బడుగు జీవులు ఇబ్బంది పడ్డారు. వేళాపాళా లేని విద్యుత్ కోతలతో ప్రజలు నానా అవస్థలు పడ్డారు. వృద్ధులు, చిన్నారులు, రోగుల పరిస్థితి దయనీయంగా మారింది.
 
 శ్రీకాకుళం/ శ్రీకాకుళం అగ్రికల్చర్ : వారం, పది రోజు లుగా మండిపడుతున్న భానుడు గురువారం ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చాడు. జిల్లా ప్రజలను బెంబేలెత్తించాడు. అగ్నికి ఆజ్యం పోసినట్టు వడగాడ్పులు తోడవటంతో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో 13 మంది పిట్టల్లా రాలిపోయారు. మృతుల్లో 12 మంది బడుగు జీవులే. జీవన భృతి కోసం పనులకెళ్లి ఎండ వేడి, వడగాడ్పులను తట్టుకోలేక అసువులు బాశారు. సాధారణంగా మే నెలలో ఎండ వేడి, వడగాడ్పులు తీవ్రంగా ఉంటాయి. ఈ ఏడాది జూన్ రెండో వారంలో ఇంత దారుణ పరిస్థితి నెలకొనటం అందరినీ కలవరపరుస్తోంది. రుతుపవనాలు వచ్చేస్తున్నాయని ఓ పక్క వార్తలొస్తున్నా.. సూరీడు విరుచుకుపడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇదే వాతావరణం కొనసాగితే ఖరీఫ్ పంటల పరిస్థితి ఏమవుతుందోనని అన్నదాతలు భయపడుతున్నారు.
 
 పెరిగిన ఉష్ణోగ్రతలు.. అల్లాడిన జనం
 నైర వ్యవసాయ కళాశాలలో నమోదైన వివరాల ప్రకారం.. మంగళవారం 39.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవగా బుధవారం 41 డిగ్రీలకు చేరింది. గురువారం ఏకంగా 41.5 డిగ్రీలుగా నమోదైంది. ఎండ తీవ్రత, వడగాల్పులను తట్టుకోలేక వృద్ధులు, చిన్నారులు, రోగులు అల్లాడిపోయారు. రాత్రి ఉష్ణోగ్రతలు కూడా తీవ్రంగా ఉంటున్నాయి. మూడు రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీలుగా నమోదవటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. పగలు, రాత్రి అనే తేడా లేకుండా వేడి కొనసాగుతుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. దీనికితోడు వేళాపాళా లేని విద్యుత్ కోతలు నరకాన్ని చూపుతున్నాయి. ప్రజలు వీధుల్లోకి వెళ్లలేక, ఇళ్లల్లో ఉండలేక అవస్థలు పడుతున్నారు.
 
 విద్యార్థులు, ఉపాధ్యాయుల పాట్లు
 గురువారం పాఠశాలలు తిరిగి తెరుచుకోవడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు పడ్డారు. ఎండ వేడిని వారు భరించలేకపోయారు. వేసవి సెలవులను మరో వారం రోజుల పాటు పొడిగించాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేశాయి. లేని పక్షంలో కనీసం ఒంటి పూట బడులు నిర్వహించాలని కోరాయి. దీనిపై ఉన్నతాధికారులు స్పందిం చకపోవటం ఆందోళన కలిగిస్తోంది.
 
 బడుగు జీవులకు ఉపాధి కరువు
 రెక్కాడితే గానీ డొక్కాడని భవన నిర్మాణ కార్మికులు, రోజువారీ పనివారు ఎండ వేడిమిని తట్టులేకపోతున్నారు. గేదెలు, ఆవులు, ఇతర మూగ జీవాలు కూడా అవస్థలు పడుతున్నాయి. పరిస్థితి ఇంత భయానకంగా ఉంటే అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఉపాధి హామీ పనులను యధాతథంగా జరిపిస్తున్నారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.         
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా