వరుణ్‌ మృతికి హోంమంత్రే బాధ్యత వహించాలి

9 Oct, 2018 13:28 IST|Sakshi
ఎమ్మెల్యే ఆనందరావును నిలదీస్తున్న ప్రజా సంఘాల ప్రతినిధులు

పెంపుడు కుక్క వల్ల జరిగిన మృతిపై ప్రజా సంఘాల నిరసన

ఆర్డీవో కార్యాలయం ముట్టడి

తూర్పుగోదావరి, అమలాపురం టౌన్‌: అమలాపురంలో పెంపుడు కుక్క తరమడం వల్ల భయంతో కాలువలో పడి మృతి చెందిన నెల్లి వరుణ్‌కుమార్‌ మృతికి రాష్ట్ర హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్పే బాధ్యత వహించాలని ప్రజా సంఘాలు డిమాండ్‌ చేశాయి. అంతే కాకుండా అందుకు కారణమైన చినరాజప్ప సోదరుడు జగ్గయ్యనాయుడు భార్యపై హత్యాయత్నం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని డిమాండ్‌ చేస్తూ పలు ప్రజా సంఘాలు అమలాపురంలో ఆర్డీవో కార్యాలయాన్ని సోమవారం ఉదయం ముట్టడించాయి. వరుణ్‌ మృతిపై న్యాయ పోరాట వేదిక పేరుతో ఆ ఆందోళన జరిగింది. దళిత, విద్యార్థి, యువజన సంఘాలతో పాటు పలు ప్రజా సంఘాల ప్రతినిధులు ఈ నిరసనలో పాల్గొన్నారు. ఆర్డీవో కార్యాలయాన్ని ముట్టడించి ధర్నా కూడా నిర్వహించారు. ఈ ఘటనపై హోం మంత్రి రాజప్ప ఎంత మాత్రం స్పందించకుండా కనీసం బాధిత కుటుంబాన్ని పరామర్శించకపోవడం దారుణమని దళిత బహుజన మహిళా శక్తి జాతీయ కన్వీనర్‌ కొంకి రాజామణి అన్నారు. వరుణ్‌ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని సీపీఎం డివిజన్‌ కార్యదర్శి కారెం వెంకటేశ్వరరావు డిమాండ్‌ చేశారు. వరుణ్‌ మృతికి కారణమైన పెంపుడు కుక్కను స్వాధీనం చేసుకోవాలని పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్‌.తిరుపతిరావు పేర్కొన్నారు.

ఎమ్మెల్యేను నిలదీసిన ఆందోళనకారులు
ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా జరుగుతున్న సమయంలో ఆ కార్యాలయానికి ఓ పని మీద వచ్చిన స్థానిక ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ఆందోళనకారుల వద్దకు వచ్చి మాట్లాడారు. ఈ ఘటనపై తనకు ఎవరూ వినతి పత్రం ఇవ్వలేదని ఎమ్మెల్యే అనడంతో ఆందోళనకారులు అభ్యంతరం చెప్పారు. అదేమిటి సార్‌... మీ ఇంటికి సమీపంలోనే...మీ కాలనీలో ఈ ఘోరం జరిగినా మీరు స్పందించే తీరు ఇదా...? అంటూ నిలదీశారు. అనంతరం ఎమ్మెల్యే ఆందోళనకారుల డిమాండ్లను అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ ధర్నా, ముట్టడి కార్యక్రమాల్లో జిల్లా సీపీఎం కార్యదర్శి కేఎస్‌ శ్రీనివాస్, వీసీకే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్, పౌరహక్కుల సంఘం జిల్లా కార్యదర్శి అమలదాసు బాబూరావు, ఐద్వా నాయకురాలు కుడుపూడి రాఘవమ్మ, రైతు కూలీ సంఘం రాష్ట్ర  ఉపాధ్యక్షుడు మచ్చా నాగయ్య, పీడీఎం జిల్లా కన్వీనర్‌ దీపాటి శివప్రసాద్, సీఎస్‌సీ జిల్లా అధ్యక్షుడు జిల్లెళ్ల మనోహరం పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు