వైద్యం.. దైన్యం

4 May, 2017 09:09 IST|Sakshi
వైద్యం.. దైన్యం

► ఐసీయూలో ఆస్పత్రులు
► జిల్లాలో ప్రభుత్వ వైద్యసేవలు అంతంతే..
►వైద్యవిధానపరిషత్‌ వార్షిక నివేదికలో వెల్లడైన వాస్తవాలు
► జిల్లాలో పది వైద్యశాలలకు మాత్రమే ‘ఏ’ గ్రేడ్‌
► మూడింటికి ‘బీ’.. మరో ఆరింటికి ‘సీ’ గ్రేడ్లు
► 50 పైగా భర్తీకినోచుకోని పోస్టులు

జిల్లాలోని ఆరోగ్యకేంద్రాల పనితీరు నానాటికీ తీసికట్టుగా మారుతోంది. వైద్యవిధాన పరిషత్‌ జిల్లాలోని ఆస్పత్రులపై ఇచ్చిన వార్షిక నివేదికలో ఈ విషయం బట్టబయలైంది. ఆయా ఆస్పత్రుల్లోని రోగుల సంఖ్య, శస్త్ర చికిత్సలు, ప్రసవాలు, ల్యాబ్‌ పరీక్షలు, ఈసీజీ లాంటి అంశాల ప్రాతిపదికగా రూపొందిం చిన రిపోర్ట్‌లో ఏకంగా ఆరు ఆస్పత్రులు సీగ్రేడ్‌లో ఉండడమే ఇందుకు నిదర్శనం.

చిత్తూరు (అర్బన్‌): పేదలకు వైద్యసేవలు అందించే ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లుతోంది. సకాలంలో వైద్యులు విధులకు రాకపోవడం.. పనిచేస్తున్న చోట నివాసముండకపోవడం లాంటి కారణాలతో రోగులు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. ఇవన్నీ ఎవరో చెప్పనవి కావు.. జిల్లాలోని వైద్య విధాన్‌ పరిషత్‌ (ఏపీవీవీపీ) ఆసుపత్రుల పనితీరును తెలిపే వార్షిక నివేదికలో వెలుగు చూసిన వాస్తవాలు.

ఒక జిల్లా ప్రభుత్వ ఆసుపత్రితో పాటు 12 సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఆరు ఏరియా ఆసుపత్రులున్నాయి. ఏటా ఏప్రిల్‌ 1 నుంచి మరుసటి ఏడాది మార్చి 31 వరకు ఈ ఆసుపత్రుల పనితీరు ఆధారంగా ప్రభుత్వంగ్రేడింగ్‌లను కేటాయిస్తుంది. ఈసారి ఏకంగా ఆరు ఆసుపత్రులు ‘సీ’ గ్రేడ్లకు పడిపోయాయి. ఆసుపత్రులకు వచ్చే రోగుల సంఖ్య, ఆపరేషన్లు, ప్రసవాలు, ల్యాబ్‌ పరీక్షలు, ఈసీజీ లాంటి పరీక్షలు ఆరోగ్య కేంద్రాల పనితీరుకు అద్దం పడుతున్నాయి.

గ్రేడ్లు ఇలా..
2016–17 ఆర్థిక సంవత్సరంలో చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రితో పాటు మదనపల్లె, శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రులు, పుంగనూరు, పీలేరు, వాయల్పాడు, వి.కోట, పుత్తూరు, కలికిరి సామాజిక ఆరోగ్య కేంద్రాలు ఏ గ్రేడ్‌ను సాధించాయి. గత ఏడాది ఏ గ్రేడ్‌ సాధించిన ఆసుపత్రులు 8 మాత్రమే. ఇక చిత్తూరు ఆసుపత్రిలో అవుట్‌ పేషెంట్ల లక్ష్యం 3.96 లక్షలు కాగా ఏకంగా 5 లక్షల మంది రోగులు రావడం, ప్రసవాల్లో 1800 లక్ష్యం ఉండగా 1411కు చేరుకోవడం, శస్త్ర చికిత్సల్లో సైతం 73 శాతం రాణించడం ‘ఏ’ గ్రేడ్‌ రావడానికి సహకరించాయి. మిగిలిన ఆసుపత్రులు సైతం వంద శాతానికి పైగా పనితీరును సాధించాయి.

అయితే కేటాయించిన లక్ష్యాలను చేరుకోలేక ఆరు ఆసుపత్రులు ‘సీ’గ్రేడ్‌కు పడిపోయాయి. ఇందులో సత్యవేడు, చిన్నగొట్టిగల్లు, సదుం, పి.కొత్తకోట, తంబళ్లపల్లె, బంగారుపాళెం సీహెచ్‌సీలు ఉన్నాయి. పి.కొత్తకోట, బంగారుపాళెం, సదుం సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో పరిస్థితి మరీ దారుణంగా తయారయ్యింది. ఈ మూ డింటికీ వరసగా 28, 30, 37 మార్కులు వచ్చాయి. ఒక్కో సీహెచ్‌సీలో ఏటా 180 శస్త్ర చికిత్సలు జరగాలని ఉంటే ఒక్క చోట కూడా ఆపరేషన్లు జరగలేదు. ఇక కుప్పం, పలమనేరు, నగరి ఏరియా ఆసుపత్రులు 87, 88, 84 మార్కులతో ‘బీ’ గ్రేడ్‌ సాధించాయి.

ఖాళీలు భర్తీ చేయరు..
గ్రేడింగ్‌లలో ఆసుపత్రుల్లో నెలకొన్న ఖాళీలు సైతం ప్రభావం చూపుతున్నాయి. ఏపీవీవీపీ ఆసుపత్రుల్లో ఏడు సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టులు, 15 అనస్తీషియన్‌ పోస్టులు, ఎనిమిది గైనకాలాజిస్టు పోస్టులు, 7 సివిల్‌ సర్జన్, 4 చిన్న పిల్లల వైద్య నిపుణులు, 6 ఈఎన్‌టీ పోస్టులు ఏళ్ల తరబడి భర్తీకి నోచుకోలేదు. దీనికితోడు ప్రసూతి సహాయకులు, ల్యాబ్‌ అసిస్టెంట్లు, డార్క్‌ రూమ్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఖాళీగా ఉండటం సైతం ప్రజల్ని ప్రభుత్వ ఆసుపత్రుల వైపు రానివ్వకుండా చేస్తోంది.

సంజాయిషీ కోరాం..
ఆసుపత్రుల్లో వైద్యుల పనితీరు మెరుగుపడాల్సి ఉంది. ఇటీవల నిర్వహించిన సమావేశంలో దీనిపై చర్చించాం. ‘సీ’గ్రేడ్‌లో ఉన్న ఆసుపత్రుల పర్యవేక్షకుల నుంచి సంజాయిషీ అడుగుతున్నాం. పనితీరు మెరుగుపడకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరిం చాం. త్వరలోనే ‘సీ’ గ్రేడ్‌లో ఉన్న వాటిని సరిచేస్తాం. పోస్టుల భర్తీకి ప్రభుత్వానికి నివేదించాం.   – డాక్టర్‌ పి.సరళమ్మ,జిల్లా ప్రభుత్వ వైద్యశాలల సేవల సమన్వయాధికారిణి

మరిన్ని వార్తలు