అద్దె ఇల్లు... బతికినంత వరకే...

7 Dec, 2017 08:23 IST|Sakshi

చనిపోతే శవం ఆస్పత్రి నుంచి శ్మశానానికే

ఇళ్లకు వద్దని తేల్చి చెబుతున్న యజమానులు

రోజురోజుకీ మంటగలుస్తున్న మానవత్వం

తల్లీదండ్రీ లేరు. ఉన్న ఒక్కగానొక్క అన్న రోడ్డు ప్రమాదంలో కన్నుమూశాడు. ఆస్పత్రి మార్చురీలో శవం. అద్దె ఇంటికి మృతదేహాన్ని తేవద్దని ఇంటి యజమాని షరతు. ఏం చేయాలో తెలియని అయోమయస్థితిలో చెల్లెలు బోరున విలపించింది. మంగళవారం తిరుపతిలో ఈ ఘటన చోటుచేసుకుంది.

సరిగ్గా రెండు వారాల కిందట నగరంలో పేరున్న ఓ జర్నలిస్టు భార్య అనారోగ్యంతో అకస్మాత్తుగా కన్నుమూసింది. అద్దె ఇంట్లోకి వద్దని ఆ ఇంటి యజమాని పట్టుబట్టారు. చేసేది లేక బయటే అంత్యక్రియలు జరిపారు.

సాక్షి ప్రతినిధి, తిరుపతి : పైన చెప్పినవి ఏ ఒక్కరి సమస్యో కాదు. నగరంలో అద్దెకుండే కుటుంబాలందరిదీ. బతికున్నంత వరకూ ఆప్యాయంగా కబుర్లు చెప్పే ఇళ్ల యజమానులు ప్రాణం పోయాక శవాలను దూరం పెడుతున్నారు. ఈ దురాచార సంస్కృతి తిరుపతిలో మళ్లీ వేళ్లూనుకుంటోంది. రాను రాను మంచితనం, మానవత్వం మాయమవుతున్నాయి.

అద్దె ఇళ్లలో 80 వేల కుటుంబాలు...
శరవేగంగా అభివృద్ధి చెందుతున్న తిరుపతి నగరంలో లక్షా పది వేలకు పైగా ఇళ్లున్నాయి. ఇందులో 80 వేలకు పైగా కుటుంబాలు అద్దెకుంటున్నాయి. పిల్లల చదువుల కోసమనో, వ్యాపారాల కోసమనో పల్లెల నుంచి నగరానికి వచ్చి స్థిరపడ్డ వారే ఎక్కువ. కడప, కర్నూలు, అనంతపురం, నెల్లూరు, గుంటూరు, తమళనాడు, బెంగళూర్‌ ప్రాంతాల నుంచి వచ్చి అద్దె ఇళ్లల్లో ఉండే పేద, మధ్య తరగతి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి.

చనిపోతే శవం బయటే...
అద్దెకుండే కుటుంబాల్లో కొంత మంది ఇంట్లోనే అనా రోగ్యంతో చనిపోతారు. మరికొంత మంది బయట రోడ్డు ప్రమాదాల్లో కన్ను మూస్తారు. ఇంకొంత మంది చికిత్స పొందుతూ ఆస్పత్రుల్లో చనిపోతుంటారు. ప్రాణం ఎక్కడ పోయినా పలువురు ఇళ్ల యజమానులు మాత్రం శవాన్ని ఇంట్లోకి రానివ్వడం లేదు. బయటి వ్యక్తుల ప్రాణం ఇంట్లో పోతే అరిష్టమని, ఇల్లు మూసేయాల్సి ఉంటుందన్న మూఢ నమ్మకాలను పెంచుకుంటున్నారు. బాగా చదువుకున్న వారు సైతం నాగరికతను మర్చిపోయి పాత తరం మనుషుల్లా ఆలోచిస్తున్నారు. మనిషి దూరమైన బాధతో కన్నీరు మున్నీరయ్యే కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పడం మరిచి మృతదేహాలను బయటే ఉంచాలని నిర్దయగా చెప్పడం ఎంత వరకూ న్యాయమో ఆలోచించడం లేదు. ఈ విషయంలో మార్పు రావాల్సి ఉంది.

చట్టాన్ని అతిక్రమించడమే...
ఇంటి యజమాని ప్రతి నెలా అద్దె వసూలు చేసుకుంటారు. అద్దెకుండే ఇంట్లో శుభ కార్యక్రమాలు, విందులు, వినోదాలుంటే తానూ పాల్గొంటాడు. అదే మనిషి కన్నుమూస్తే మాత్రం అటు వైపు చూడరు సరికదా...ఒక్కసారిగా భయం, సెంటిమెంట్‌ గుర్తొస్తుంది. ఇంట్లోకి మృతదేహం వద్దని చెప్పడమే కాకుండా వెంటనే ఇల్లు ఖాళీ చేయమని చెప్పే ఘనులూ ఉన్నారు. అయితే చట్టం దీన్ని ఒప్పుకోదు. జీవించడానికి ఎలాంటి స్వేచ్ఛను కల్పించారో, చనిపోయాక కూడా అదే స్వేచ్ఛను కల్పించాలని ఏపీ బిల్డింగ్‌ రెంట్‌ ఎవిక్షన్‌ కంట్రోల్‌ యాక్టు 1960 చెబుతోంది. ప్రతి నెలా అద్దె చెల్లిస్తున్న నేపథ్యంలో ఇంటి యజమానులు ఎలాంటి హక్కుల్ని కలిగి ఉంటారో, స్వేచ్ఛాయుత జీవనానికి సరిపడ హక్కుల్ని అద్దెదారులూ కలిగి ఉంటారన్నది విస్మరిస్తున్నారు.

ఇది చాలా అమానుషం ...
అద్దె ఇళ్ల యజమానులు అమానుషంగా ప్రవర్తించడం చాలా బాధాకరం. తిరుపతిలో ఈ తరహా ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. చాలా మంది యజమానులు సామాజిక బా ధ్యతను మర్చిపోతున్నారు. మానవీయ దృక్ఫథాన్ని మర్చిపోతున్నారు. మనుషుల్లో మార్పు రావాలి. గంగవరపు శ్రీదేవి, రచయిత్రి

మనుషులు మారాలి...
అద్దె ఇళ్లలో ఉండే వారు చనిపోతే ఇంటి యజమానులు శవాన్ని నిరాకరించడం దారుణం. బంధువు చనిపోయి బాధల్లో ఉన్నవారికి మరింత క్షోభను మిగిల్చే అంశమిది. మానవీయ దృక్పథంతో మనుషులు మారాలి. మంచితనాన్ని పది మందికీ పంచాలి. ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు మేధావులు, కళాకారులు, స్వచ్ఛంద సంస్థలు కృషి చేయాలి. నాగసూరి వేణుగోపాల్, ఆకాశవాణి డైరెక్టర్, తిరుపతి

మరిన్ని వార్తలు