ఇళ్ల నిర్మాణ స్కాంలపై విచారణ జరుపుతాం: వైఎస్‌ జగన్‌

24 Jun, 2019 16:40 IST|Sakshi

ప్రతి పేదవాడికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి

కలెక్టర్ల సమావేశంలో ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి,  అమరావతి: రాష్ట్రంలోని ప్రతి పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. గ్రామాల్లో ఎంత భూమి ఉందో అంచనా వేసి.. దానిలో  ప్రభుత్వ భూమిని గ్రామాల వారిగా లెక్కలు తీయండని సీఎం సూచించారు. ప్రభుత్వ భూమి లేని చోట ప్రైవేటు భూమి కొనుగోలు చేసి పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ చేయాలన్నారు. ఈ మేరకు సోమవారం నిర్వహించిన జిల్లా కలెక్టర్ల సదస్సులో ఆయన పలు కీలక ఆదేశాలను జారీ చేశారు. పట్టణ ప్రాంతాల్లో కూడా భూమి కొనుగోలు చేసి ఇళ్ల నిర్మాణం చేపట్టాలని చెప్పారు. పేదలకు అపార్టుమెంట్లు రూపంలో ఇచ్చేటప్పుడు దానిపై వాళ్ళకు పూర్తి హక్కు కల్పించాలన్నారు. 

గతంలో అర్బన్ హౌసింగ్‌ నిర్మాణంలో మొత్తం దోపిడీ చేశారని, వెయ్యి రూపాయలు దాటని వ్యయాన్ని 2 వేలకు పైగా పెంచేసి అవినీతికి పాల్పడ్డారని సీఎం వివరించారు. గతంలో జరిగిన పట్టణ ఇళ్ల నిర్మాణాల స్కాంపై విచారణ జరుపుతామన్నారు. అవినీతిని నిర్మూలించి ప్రభుత్వం పేదలకు ఉచితంగా ఇళ్ళు కేటాయిస్తుందని హామీ ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఇళ్ల పట్టాలు ఇస్తామన్నారు. కాగా పేదవారి సొంతింటి కలను సాకారం చేసేందుకు ఉగాది నాడు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చేపడతామని సీఎం వైఎస్‌ జగన్‌ ఇదివరకే స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

అర్హులందరికీ పెన్షన్లు... 
రాష్ట్రంలో అర్హులైన లబ్ధిదారులందరికీ పెన్షన్ ఇవ్వాలని సీఎం ఆదేశించారు. అనర్హులుంటే వారిని వెంటనే తొలగించాలని కలెక్టర్లతో సమావేశంలో వివరించారు. అభయ హస్తం పెన్షన్ వస్తోందని.. పెన్షన్ ఇవ్వకపోవడం సమంజసం కాదని అన్నారు. దీనిపై  సరైన  పరిష్కారం కనుగొనాలని కలెక్టర్లకు సూచించారు. 

ఉగాదికి ఇళ్ల స్థలాల పంపిణీ: సీఎం జగన్‌

>
మరిన్ని వార్తలు