కడుపులో కత్తెర మరచినందుకు భారీ జరిమానా

23 Feb, 2019 07:58 IST|Sakshi

హెచ్చార్సీ ఆదేశాల మేరకు బాధితుడికి చెల్లించిన రాష్ట్ర ప్రభుత్వం

సాక్షి, అమరావతి: ఆపరేషన్‌ సమయంలో కడుపులో కత్తెర పెట్టి అలాగే మరచిపోయినందుకు గాను జాతీయ మానవహక్కుల కమిషన్‌ ఏపీ ప్రభుత్వానికి రూ.3 లక్షల జరిమానా విధించింది. బాధితుడికి రూ.3 లక్షలు చెల్లిస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. నెల్లూరు జిల్లా కొత్తకలువకు చెందిన పి.చలపతికి కొద్ది నెలల క్రితం నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఆపరేషన్‌ జరిగింది. డాక్టర్లు ఆపరేషన్‌ చేసిన తర్వాత కడుపులోనే కత్తెర మరచి కుట్లు వేశారు. ఆ తర్వాత కొద్ది రోజులకే తీవ్రంగా కడుపునొప్పి వచ్చి అతను మళ్లీ ఆస్పత్రికి వెళ్లాడు. వైద్యపరీక్షలు నిర్వహించగా కడపులో కత్తెర ఉన్నట్టు గుర్తించి తిరిగి ఆపరేషన్‌ చేసి తీశారు. దీనిపై బాధితుడు   హెచ్చార్సీని ఆశ్రయించాడు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తనకు అన్యాయం జరిగిందని, తనకు పరిహారం వచ్చేలా చూడాలని విన్నవించారు. దీనికి స్పందించిన హెచ్చార్సీ... బాధితుడికి రూ.3 లక్షలు చెల్లించాల్సిందిగా ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. మానవ హక్కుల కమిషన్‌ ఆదేశాల మేరకు బాధితుడికి రూ.3 లక్షలు మంజూరు చేస్తూ శుక్రవారం వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ పూనం మాలకొండయ్య ఉత్తర్వులు జారీచేశారు.

మరిన్ని వార్తలు