మానవత్వం మరణించింది

10 Aug, 2015 04:27 IST|Sakshi
మానవత్వం మరణించింది

ఆమెకు అమ్మానాన్నలు లేరు. కట్టుకున్న భర్త క డుపు చేతబట్టుకుని పరాయి దేశానికి వెళ్లాడు. ఇక ఆమెకు అమ్మా నాన్నలయినా.. అత్తమామలైనా తన మెట్టినింటివారే. ఇలాంటి పరిస్థితుల్లో తీవ్ర జ్వరంతో అపస్మారక స్థితిలో ఉన్న కోడలికి వైద్యం చేయించాలనే కనీస మానవత్వాన్ని కూడా అత్తమామలు మరిచి ఆమెను తీసుకెళ్లి ఊరి శివారులో వదిలేశారు. కొన ఊపిరితో ఉన్న ఆ యువతి కొద్ది గంటల్లోనే ప్రాణాలు వదిలింది.
 
 ఓబులవారిపల్లె:
ఓబులవారిపల్లె మండలం బొమ్మవరం గ్రామానికి చెందిన జగ్గరాజు నరసింహరాజు, సుబ్బలక్షుమ్మల ఏకైక  సంతానం మల్లీశ్వరి. ఆమెను రాయచోటి  మండలం గుంతరాచపల్లెకు చెందిన వెంకటరాజు, అనసూయమ్మల కుమారుడైన శంకర్‌రాజుకు ఇచ్చి రెండేళ్ల క్రితం వివాహం చేశారు. జీవనోపాధి కోసం శంకర్‌రాజు ఏడాది క్రితం కువైట్‌కు వెళ్లాడు. దీంతో అత్తామామల వద్ద ఉన్న మల్లీశ్వరికి  ఇటీవల జ్వరం సోకింది. అత్తామామలు నిర్లక్ష్యం చేయడంతో జ్వరం తీవ్రమై ఆమె అపస్మారక స్థితికి వెళ్లింది. దీంతో వారు శనివారం సాయంత్రం ఆమెను తీసుకెళ్లి ఆమె పుట్టిన ఊరైన బొమ్మవరం గ్రామ శివార్లలో వదిలేసి వెళ్లారు. గ్రామస్తులు ఆలస్యంగా గుర్తించి గ్రామంలో ఉన్న ఆమె బంధువులకు విషయం తెలిపారు. స్థానికుల సహకారంతో వారు ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లగా ఆదివారం ఉదయం మృతి చెందింది. ఆమె మరణం గ్రామస్తులను కలచివేసింది. కాగా, మల్లీశ్వరి తల్లిదండ్రులు కూడా ఏడాది క్రితం మృతి చెందారు.

మరిన్ని వార్తలు