నిలిచిన రూ.100 కోట్లు !

21 Apr, 2018 12:01 IST|Sakshi
జిల్లా ఖజానా కార్యాలయం

ట్రెజరీలో సీఎఫ్‌ఎంఎస్‌ విధానంతో తిప్పలు

20 రోజులుగా ఒక్క బిల్లుకూ కలగని మోక్షం

ఇప్పటి వరకు బిల్లులు పెట్టని డ్రాయింగ్‌ ఆఫీసర్లు

సిబ్బందిలో అవగాహన లోపం

రూ.100 కోట్ల వరకు ఆగిన బిల్లుల చెల్లింపు

జిల్లాలో ఖజానా కార్యాలయం నుంచి డ్రాయింగ్‌ ఆఫీసర్స్‌ ఖాతాల్లో పడాల్సిన దాదాపు రూ.100 కోట్ల బిల్లులు నిలిచిపోయాయి. ఏప్రిల్‌ నుంచి ట్రెజరీలో ప్రవేశపెట్టిన కంప్రెన్సీవ్‌ ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం (సీఎఫ్‌ఎంఎస్‌) వల్లే ఈ పరిస్థితి తలెత్తింది. ఫలితంగా పోలీస్, ఎక్సైజ్, కమర్షియల్‌ ట్యాక్స్, మెడికల్, న్యాయ విభాగం, ఎల్‌ఐసీతో పాటు వివిధ విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బందికి రావాల్సిన డబ్బులు నిలిచిపోయాయి. దీంతో వారు ఆందోళనలో పడ్డారు.

సాక్షి ప్రతినిధి, ఒంగోలు/ఒంగోలు టూటౌన్‌ : ప్రభుత్వం ట్రెజరీలో కొత్తగా ప్రవేశపెట్టిన సీఎఫ్‌ఎంఎస్‌ (సమగ్ర ఆర్థిక నిర్వహణ విధానం) సాంకేతిక సమస్యల (సాఫ్ట్‌వేర్‌ సమస్యలు) చిక్కు వీడలేదు. ప్రభుత్వం ఏప్రిల్‌ 1 నుంచి అమలు చేస్తున్న నూతన విధానంపై (సీఎఫ్‌ఎంఎస్‌)  సమగ్ర ఆర్థిక నిర్వహణ విధానంలోకి అనేక శాఖల ఉద్యోగుల్ని చేర్చడంలో సాఫ్ట్‌వేర్‌ సమస్యలు ఉండటంతో నూతన విధానం ముందుకు సాగడం లేదు. దీంతో జిల్లాలో వందలాది మంది ఉద్యోగులకు జీతాలు రాని పరిస్థితి నెలకొంది. కాంట్రాక్ట్‌ ఎంప్లాయీస్, ఎయిడెడ్‌ స్కూలు ఉపాధ్యాయులు, ఇంజినీరింగ్‌ శాఖల్లో పనిచేసే వర్క్‌ ఇన్‌స్పెక్టర్లు, అసిస్టెంట్‌ ఇంజినీర్లు, సైట్‌ ఇంజినీర్లు ఇలా చాలామంది  చిరుద్యోగులకు మూడు నెలలుగా జీతాలు రాని పరిస్థితి నెలకొంది.

వీరితో పాటు పంచాయతీల నిధులు, మండల పరిషత్‌ నిధులు, జిల్లా పరిషత్‌కు సంబంధించిన నిధులు, ఇతర అభివృద్ధి పథకాలకు నిధులు ఇలా అన్నీ వరుసగా బ్రేక్‌ అయ్యాయి. ఈ శాఖలకు సంబంధించిన పీడీ అకౌంట్‌ (పబ్లిక్‌ అకౌంట్‌ పోర్టల్‌)లోకి చెక్కుల పర్మిషన్‌ నిలిచిపోవడంతో నిధులు డ్రా చేసే పరిస్థితి లేకుండా పోయింది. చనిపోయిన ఉద్యోగులు, పెన్షనర్స్, ఎంప్లాయిస్‌కు సంబంధించిన మట్టి ఖర్చులు, పెన్షన్‌ బకాయిలు రాలేదు. మార్చి నెలలో జీతాల బిల్లులు సకాలంలో పెట్టుకోని ఉద్యోగులకు నేటికీ జీతాలు రాని స్థితి ఉంది. దాదాపు 182 ప్రభుత్వ శాఖల వరకు ఉండగా వాటిలో ఇప్పటి వరకు కేవలం 95 శాఖలకే ఆయా శాఖాధిపతుల నుంచి ఉద్యోగుల డేటా కన్ఫ్‌ర్మేషన్‌ చేయడం (సీఎఫ్‌ఎంఎస్‌ విధానంలో)కోసం అనుమతి లభించిందని ట్రెజరీ వర్గాలు తెలిపాయి. సీఎఫ్‌ఎంఎస్‌ విధానంపై డ్రాయింగ్‌ ఆఫీసర్లకు పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవడం, ఆయా శాఖల ఉన్నతాధికారుల నుంచి అనుమతులు రాకపోవడంతో ఇప్పటి వరకు ఏ బిల్లుకూ మోక్షం లభించడం లేదు. 

జిల్లాలో ఇదీ పరిస్థితి: 
జిల్లాలో మొత్తం 12 ఉపఖజానా కార్యాలయాలు ఉన్నాయి.  అద్దంకి, చీరాల, కంభం, దర్శి, గిద్దలూరు, కందుకూరు, కనిగిరి, మార్కాపురం, మార్టూరు, ఒంగోలు, పొదిలి, యర్రగొండపాలెంలో సబ్‌ ట్రెజరీలు ఉన్నాయి. మొత్తం 37,647 మంది ఉద్యోగులు, 21,398 మంది పెన్షనర్స్‌ ఉన్నారు. వీరు గాక ఇంకా కాంట్రాక్ట్‌ ఉద్యోగులు ఉన్నారు. వీరు ఖజానా శాఖ ద్వారా వేతనాలు, పెన్షన్లను ప్రతి నెలా పొందుతుంటారు. ప్రతి నెల రూ.250 కోట్ల నుంచి రూ.300 కోట్ల వరకు చెల్లింపులు జరుగుతుంటాయి.  సబ్‌ ట్రెజరీ కార్యాలయాలకు నిత్యం వందల సంఖ్యలో వివిధ రకాల బిల్లులు వస్తుంటాయి. ఆయా బిల్లులకు కేటాయించిన సమయంలో బిల్లులను ఆన్‌లైన్‌లో నమోదు చేసి బ్యాంకులకు ట్రెజరీ ఉద్యోగులు పంపించి,  జీతాలు విడుదల చేసి ఉద్యోగుల నుంచి వ్యతిరేకత రాకుండా చూసుకుంటుంది.  

నిలిచిన నిధులు 
ప్రస్తుతం ఏప్రిల్‌ నుంచి ప్రభుత్వం కొత్తగా అమలులోకి తీసుకువచ్చిన సమగ్ర ఆర్థిక నిర్వహణ విధానం (సీఎంఎఫ్‌ఎస్‌)పై జిల్లాలోని డ్రాయింగ్‌ అధికారులకు పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవడం, ఆయా శాఖల ఉన్నతాధికారులు (హెచ్‌వోడీలు) నుంచి చాలా శాఖలకు అనుమతులు రాకపోవడం, సాంకేతిక సమస్యలు ఇలా పలు కారణాల వల్ల జిల్లాలో  ఎంతో మంది ఉద్యోగులు, పెన్షనర్స్‌ 20 రోజులుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇతర అభివృద్ధి పథకాలకు సంబంధించిన నిధులు  కూడా నిలిచిపోయాయి. 

ట్రెజరీ చుట్టూ ప్రదక్షిణలు: 
నిత్యం ఎంతో మంది ఉద్యోగులు, అధికారులు ఇప్పటికీ జీతాలు రాక ట్రెజరీ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. దాదాపు రూ.100 కోట్లకు పైగా వివిధ రకాల నిధులు నిలిచిపోయినట్లు సమాచారం. ఏప్రిల్‌కు ముందు ట్రెజరీపై ఆంక్షలతో ఇబ్బందులు పడిన ఉద్యోగులు, ఇప్పుడు కొత్త విధానం అమలులో సాఫ్ట్‌వేర్‌ సమస్యలతో సీఎఫ్‌ఎంఎస్‌లోకి చేర్చక పోవడంతో జీతాలు పొందలేని పరిస్థితి నెలకొందని ట్రెజరీ వర్గాలు తెలిపాయి.  

రెండు నెలలుగా జీతాలు రావాలి
జిల్లాలో 240 ఎయిడెడ్‌ స్కూల్స్‌ ఉన్నాయి. 960 మంది పనిచేస్తున్నారు. రెండునెలలుగా జీతాలు రావాలి.  మార్చి నెల జీతం రాలేదు. ఏప్రెల్‌ నుంచి సీఎఫ్‌ఎంఎస్‌ విధానం వచ్చిన తరువాత ఈ నెల జీతం రాలేదు. ఇప్పటి వరకు కొత్త విధానంలోకి మా టీచర్స్‌ పేర్లు మారలేదు. దీంతో రెండు నెలల జీతాలు ఆగిపోయాయి. దీంతో ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ప్రభుత్వం సాంకేతిక సమస్యలు పరిష్కరించి త్వరితగతిన జీతాలు వచ్చేలా చర్యలు తీసుకోవాలి.
– ప్రభాకర్‌రెడ్డి,  ఏపీ టీచర్స్‌ గిల్డ్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి 

సాఫ్ట్‌వేర్‌ సమస్య వల్లనే కొంత జాప్యం
182 డిపార్ట్‌మెంట్స్‌ వరకు ఉన్నాయి. వీటిలో ఇప్పటి వరకు 95 డిపార్టుమెంట్స్‌కే హెచ్‌వోడీల నుంచి పర్మిషన్‌ వచ్చింది. మిగిలిన శాఖలకు ఆయా శాఖల హెచ్‌వోడీలు పర్మిషన్‌ ఇవ్వాలి. పర్మిషన్‌ వచ్చిన తరువాత పాస్‌వర్డ్‌ వస్తోంది. అప్పుడు ఆయా శాఖల ఉద్యోగుల డేటా సీఎప్‌ఎంఎస్‌ పద్ధతిలోకి మార్చాలి.  సాఫ్ట్‌వేర్‌ సమస్యలు ఉండటం వలన కొంత జాప్యం జరుగుతోంది. కొద్ది రోజులలో సమస్య పరిష్కరమవుతుంది. 
– నారాయణ, ట్రెజరీ ఉద్యోగి   

మరిన్ని వార్తలు