ఐసీడీఎస్‌లో ఏసీబీ తనిఖీలు

25 Dec, 2014 02:55 IST|Sakshi

క్రైం (కడప అర్బన్) :  జిల్లా కేంద్రంలోని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ కార్యాలయంలో బుధవారం అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ శంకర్‌రెడ్డి ఆధ్వర్యంలో సీఐలు పార్థసారథి రెడ్డి, చంద్రశేఖర్, సుధాకర్ రెడ్డి తమ సిబ్బందితో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ శంకర్‌రెడ్డి మాట్లాడుతూ ఐసీడీఎస్ జిల్లా ప్రాజెక్ట్ అధికారిణిగా లీలావతి 2011 డిసెంబర్ 7 నుంచి, ఈ ఏడాది నవంబర్ 27 వరకు పనిచేశారన్నారు.
 
 ఆమె హయాంలో అంగన్‌వాడీ వర్కర్ల నియామకంలోనూ, 30 మంది కంప్యూటర్ ఆపరేటర్ల నియామకంలోనూ, బదిలీలల్లోనూ లక్షలాది రూపాయలు లంచంగా వసూలు చేశారని, పోషకాహారం కొనుగోలులోనూ అవకతవకలు జరిగాయంటూ తమ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లిందన్నారు. వారి ఉత్తర్వుల మేరకు తనిఖీలు చేపట్టామన్నారు. అంగన్‌వాడీ వర్కర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, ఆహారం సరఫరా చేసిన ఏజెన్సీలను వరుసగా పిలిపించి విచారిస్తున్నామన్నారు. సంబంధిత రికార్డులను సీజ్ చేసి, నివేదికను తమ ఉన్నతాధికారులకు త్వరలో పంపిస్తామన్నారు.
 

మరిన్ని వార్తలు