అక్రమాల నిగ్గుతేలేనా? 

30 Jun, 2019 10:50 IST|Sakshi
టీడీపీ నాయకుల క్వారీలో తయారవుతున్న కంకర

క్వారీలపై ప్రారంభమైన విచారణ  

గత ప్రభుత్వంలో ఎడాపెడా అనుమతులు 

అడ్డంగా దోచుకున్న టీడీపీ నాయకులు  

పెనుకొండ: పెనుకొండ నియోజకవర్గంలో క్వారీలపై అధికారులు దాడులు చేసి విచారణ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో అక్రమాలు ఏ మేరకు నిగ్గుతేలుతాయన్న అభిప్రాయం ప్రజల్లో నెలకొంది. పెనుకొండ ప్రాంతం క్వారీల ఏర్పాటుకు స్వర్గధామం. ఇక్కడ అధికారులు క్వారీ యజమానులకు సాగిలపడి పోటీపడి విచ్చలవిడిగా అనుమతులు ఇచ్చారు. పేదవాడికి ఒక ఎకరా పట్టా ఇవ్వడానికి మనసొప్పని అధికారులు క్వారీలకు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదుల ఎకరాలను క్వారీల యజమానులకు ధారాదత్తం చేశారు. అటు రెవెన్యూ అధికారులు భూ అనుమతులిస్తే ఇటు మైనింగ్‌ అధికారులు పోటీపడి అనుమతులు మంజూరు చేశారు.

సోమందేపల్లిలో పెద్దకొండ ప్రాంతంలో కొందరికి భూపట్టాలున్నా రెవెన్యూ అధికారులు వాటిని అప్పటికప్పుడు రద్దు చేస్తూ క్వారీలకు లీజుకు ఇవ్వడం వెనుక దాగి ఉన్న అవినీతిని సూచిస్తోంది. బాధితులు కాళ్లరిగేలా అధికారుల చుట్టూ తిరిగినా న్యాయం జరిగిన పాపానపోలేదు. పెనుకొండ ప్రాంతం టీడీపీకి కంచుకోట కావడంతో రెండున్నర దశాబ్దాలుగా క్వారీల దందా సాగుతోంది. పరిటాల కుటుంబం, మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి వారి అనుచరుల  కనుసన్నల్లో క్వారీలు ఏర్పాటయ్యాయి. అడిగితే బెదిరింపులు, అడ్డుకుంటే ఇబ్బందులు అన్నచందంగా క్వారీల దందా జరిగింది.  

నిబంధనలకు పాతర .. 

క్వారీల ఏర్పాటులో అధికారులు నిబంధనలకు  పూర్తీగా పాతరేశారు. చెరువు, మరువ, పొలం అన్న తేడా లేకుండా అనుమతిచ్చారు. సోమందేపల్లి, పాపిరెడ్డిపల్లి చెరువుల పక్కనే క్వారీలు, ఏకంగా చెరువులో రోడ్లు, ఇలా ప్రజా జీవితాలను అతలాకుతలం చేశారు. పాపిరెడ్డిపల్లి వద్ద వేలుపుకొండలో జరుగుతున్న బ్లాస్టింగ్‌ దెబ్బకు విద్యార్థులు హడలిపోతున్నా పట్టించుకున్న వారు లేరు. వాటిపై విచారణ చేసినా క్వారీల నిర్వాహకులకే ప్రభుత్వం వత్తాసు పలికింది. టీడీపీ నాయకుల రాజకీయ పెత్తనం ముందు ప్రజలు, రైతులు నిస్సహాయులయ్యారు. పనీ మాదే..గనీ మాదే.. ప్రభుత్వం విడుదల చేసే రూ.కోట్ల డబ్బు మాదే అన్న చందంగా టీడీపీ నాయకులు దోపిడీ సాగించారు.

 రోడ్డు తొలగించాలన్న జేసీ బదిలీ.. 

సోమందేపల్లి చెరువులో రోడ్డు వేయడం అక్రమమని, రోడ్డు తొలగించాలని అప్పటి జాయింట్‌ కలెక్టర్‌ రమామణి ఆదేశిస్తే ఆమెను  టీడీపీ నాయకులు రాజకీయ బలంతో రోజుల వ్యవధిలో జిల్లా నుంచి బదిలీ చేశారు. చెరువులో రోడ్డు వేయరాదని అడ్డుకుంటే మీ ఇష్టం వచ్చిన చోట చెప్పుకోండని పోలీసులను ఉసిగొలిపారు. ఎక్కడ చూసినా టీడీపీ నాయకులు లారీలు క్వారీల నుంచి నిబంధనలను ఉల్లంఘించి కంకర, కంకరపొడితో రయ్‌మని ప్రయాణిస్తుంటే జనం చూసి ఊరుకోవాల్సిందేకాని మాటమాట్లాడే అవకాశం లేకుండా పోయింది. ప్రజలకు రక్షణగా ఉండాల్సిన ప్రజాప్రతినిధే ప్రజలకు ఇబ్బందులు పెడుతుంటే జనం ఎంతో ఆవేదన చెందారు.  

అక్రమాలు బయట పడుతాయా?...  

టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన క్వారీల్లో రూ.కోట్ల అవినీతి దాగుందని ప్రజలు భావిస్తున్నారు. ప్రభుత్వం మారాక అవినీతి అక్రమాలపై పెద్ద ఎత్తున దృష్టి సారించడంతో క్వారీలలో జరుగుతున్న అక్రమాలను నిగ్గు తేల్చడానికి అధికారులు సిద్ధమయ్యారు. అసలు క్వారీ నిర్వాహకులు ఎలాంటి అనుమతులు పొందారు? ఎంత మేరకు తవ్వారు? ఎంత మేర రాయల్టీ చెల్లించాలి? క్వారీలు ఎలాంటి ప్రాంతంలో ఏర్పాటు చేశారు? ప్రజలు పడుతున్న భాధలేమిటి? నిబంధనలు ఎలా ఉన్నాయి? జరుగుతున్న భాగోతమేమిటి అన్న విషయాలపై మైనింగ్‌ అధికారులు పూర్తీ స్థాయిలో దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. అధికారులు దర్యాప్తులో ఎలాంటి పొరబాట్లకు తావిచ్చినా చర్యలు తప్పవన్న భావన ప్రజల్లో వినిపిస్తోంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిఘా ఉంచిందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. 

కియా నుంచి కొటక్‌ వరకు..  

కియా కార్ల పరిశ్రమ ఏర్పాటు నుంచి షిమాంకో కొటక్‌ పరిశ్రమతో పాటు ఇతర హాట్‌మిక్సింగ్‌ యూనిట్లకు టీడీపీ నాయకుల క్వారీల నుంచే లక్షల టన్నుల కంకర, కంకర పొడి తరలించి వ్యాపార లావాదేవీలు సాగించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారు సంపాదించిన ఆదాయం ఏ మేరకు ఉంటుందో లెక్కించలేరన్న భావన అటు అధికారులు, ఇటు ప్రజల్లో నెలకొంది. దీంతో పాటు ప్రజల అవసరాలకు, భారీ ఎత్తున నిర్మించిన భవనాలకు సైతం ఈ కంకర మిషన్ల నుంచే సరఫరా కావడంతో అవినీతి అక్రమాలకు హద్దే లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  

మరిన్ని వార్తలు