ఒడిశా నుంచి ఇసుక​ రవాణా; పట్టుకున్న పోలీసులు

14 Sep, 2019 14:20 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, విజయనగరం : ఒడిశాలోని కెరడ నుంచి విశాఖకు ఇసుకను అక్రమంగా తరలిస్తున్న 15 లారీలను రెవెన్యూ అధికారులతో కలిసి పార్వతీపురం ఏఎస్పీ డాక్టర్‌ సుమిత్‌ గరుడ పట్టుకున్నారు. పట్టుకున్న ఇసుక సుమారు 375 టన్నులుంది. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏఎస్పీ మాట్లాడుతూ..  పక్కా సమాచారం ఆధారంగా లారీలను పట్టుకొని, పాత తేదీలతో ఉన్న బిల్లులను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాల నిబంధనల ప్రకారం అంతర్రాష్ట్ర ఇసుక రవాణాకు అనుమతులు లేవని వెల్లడించారు. ప్రాథమిక దర్యాప్తులో ఇరు రాష్ట్రాల ఇసుక విధానానికి విరుద్ధంగా అక్రమ రవాణా జరుగుతుందని తేలిందన్నారు. పట్టుబడిన లారీలపై కేసులు నమోదు చేశామని, మరికొన్ని లారీలు సరిహద్దుల్లో నిలిచిపోవడం వల్ల వాటిని పట్టుకోవడం కుదర్లేదని స్పష్టం చేశారు. మరోవైపు పార్వతీపురం సబ్‌ కలెక్టర్‌ ఆధ్వర్యంలో కమిటీ వేశామని, సంబంధిత యజమానులు సరైన పత్రాలు ఉంటే వాటిని కమిటీకి అందజేయవచ్చని తెలియజేశారు.  

మరిన్ని వార్తలు