డిపోల ఎదుట కార్మికుల ఆందోళన

13 May, 2015 02:47 IST|Sakshi

అర్ధనగ్న ప్రదర్శనలు
ఏడో రోజుకు చేరిన ఆర్టీసీ సమ్మె

 
అనంతపురం రూరల్ : ఆర్టీసీ కార్మికులు పట్టువీడక నిరసనలతో ఆందోళనలు కొనసాగిస్తున్నారు. 43 శాతం వేతన ఫిట్‌మెంట్ మంజూరు చేసేదా కా సమ్మెను విరమించబోమని నినదిస్తున్నా రు. మంగళవారం జిల్లాలోని 12 డిపోల్లో   కార్మికులు ఆందోళనలు నిర్వహించారు.  అరకొర బస్సులు తిరుగుతుండగా ప్రయాణికులకు పాట్లు తప్పలేదు. గంటల తరబడి బస్టాండ్లలో పడిగాపులు కాస్తున్నారు. అనంతపురం డిపో ఎదుట  ఏఐటీయూసీ, సీఐటీయూ బైఠాయించి నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

తమ డిమాండ్ మేరకు ఫిట్‌మెంట్ ప్రకటించాల్సిందేనంటూ నినాదాలు చేశారు. కళ్యాణదుర్గంలో కార్మికులు అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన తెలిపారు. గుంతకల్లులో సీపీఎం, సీపీఐ నాయకులు మద్దతు తెలుపుతూ సీఎం చంద్రబాబు నాయుడుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  కదిరిలో కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించి, అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వంలోకి ఆర్టీసీని విలీనం చేయాలని డిమాండ్ చేశారు. ఉరవకొండలో కార్మికులు చేపడుతున్న సమ్మెకు ఉపాధ్యాయ సంఘాలు మద్దతు తెలిపాయి. తాడిపత్రి, ధర్మవరం, మడకశిర, రాయదుర్గం, తదితర డిపోల్లో సమ్మె కొనసాగింది. ఏడు రోజుల సమ్మె కారణంగా అనంతరం రీజియన్‌లో రూ.7 కోట్ల ఆదాయాన్ని సంస్థ కోల్పోయింది.

 సమ్మె ఎప్పుడు విరమిస్తారో..
 ఆర్టీసీ కార్మికులు ఎప్పుడు సమ్మె విరమిస్తారోనని వేచి చూస్తున్నారు. ప్రయాణ సౌకర్యాలు లేకపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు.  ఆర్టీసీ అధికారులు మంగళవారం 392 బస్సులు తిప్పారు.  ఏ బస్సు ఎప్పుడు వస్తుందో తెలియక ప్రయాణికులు ఉసూరుమంటున్నారు. ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తూ జేబులు ఖాళీ చేసుకుంటున్నారు. రాత్రి వేళల్లో బస్సు సర్వీసులు లేకపోవడంతో సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సినవారికి తిప్పలు తప్పడం లేదు. ఇదే అదనుగా ప్రైవేటు బస్సులవారు అధిక చార్జీలు వసూలు చేస్తున్నారని వారు వాపోతున్నారు. రేల్వే స్టేషన్ ప్రయాణికులతో కిటకిటలాడుతోంది.

మరిన్ని వార్తలు