చిరు తప్పిదం.. భారీ మూల్యం

8 Jun, 2015 08:43 IST|Sakshi
చిరు తప్పిదం.. భారీ మూల్యం

సాక్షి, హైదరాబాద్: టీచర్ పోస్టుల నియామకాలకు సంబంధించి నిర్వహించిన డీఎస్సీ-2014 పరీక్షల్లో ఓఎమ్మార్ షీట్లలో దొర్లిన పొరపాట్లు అభ్యర్థుల కొంపముంచాయి. బబ్లింగ్ (గడులు నింపడం) చేయడంలో సరైన జాగ్రత్తలు తీసుకోని కారణంగా అనేక మందికి మార్కులు తారుమారయ్యాయి. ఫైనల్ ‘కీ’లోని సమాధానాల ఆప్షన్లను పరిశీలించుకొని అంచనా వేసుకున్న మార్కులకు ఫలితాల వెల్లడిలో వచ్చిన మార్కులకు మధ్య వ్యత్యాసం ఉండడంతో అభ్యర్థులు గగ్గోలుపెడుతున్నారు.

ఓఎమ్మార్ షీట్లలో సమాధానాల ఆప్షన్లను నింపడంలో అభ్యర్థులు సరైన జాగ్రత్తలు తీసుకోకుండా చేసిన చిన్న చిన్న తప్పిదాల వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందన్న విశ్లేషణను అధికారులు వినిపిస్తున్నారు. ఓఎమ్మార్ షీట్లలోని ఆప్షన్ల గడులను గతంలో పెన్సిల్‌తో నింపే పద్ధతి ఉండగా వాటిని స్కానింగ్ యంత్రాలు సరిగా గుర్తించలేకపోవడంతో ఇబ్బందిగా మారింది. దీంతో పెన్సిల్‌కు బదులు పెన్నుతో నింపే విధానాన్ని ప్రవేశ పెట్టారు. నిర్ణీత ప్రశ్నకు సమాధానంగా గుర్తించిన ఆప్షన్‌కు ఇచ్చిన గడిలోపల మాత్రమే పూర్తిగా నింపాల్సి ఉంటుంది. అప్పుడే స్కానింగ్ యంత్రం దాన్ని మూల్యాంకనం చేస్తుందని అధికారులు పేర్కొన్నారు.

గడిని దాటి బయటకు వస్తే స్కానింగ్ యంత్రం దాన్ని స్వీకరించదు. ఇతర ఏ గుర్తులు పెట్టినా, గడుల బయట వేరే మార్కింగ్‌లు చేసినా స్కానింగ్ కాదు. ఈ విషయాలను స్పష్టంగా వివరిస్తూ ఓఎమ్మార్ షీటు వెనుక, అలాగే అభ్యర్థులకు ఇచ్చిన బుక్‌లెట్‌లోనూ పొందుపరిచామని, వాటిని అభ్యర్థులు పూర్తిగా పాటించాల్సి ఉందన్నారు. ఇవేవీ చూసుకోకుండా కొంతమంది గడులను ఇష్టానుసారంగా నింపేశారని చెబుతున్నారు. 50వేలకు పైగా ఓఎమ్మార్ పత్రాల్లో ఇలాంటి తప్పులు దొర్లాయని అధికారులు గుర్తించారు.

సిరీస్‌ను గుర్తుపెట్టని అభ్యర్థులు
దాదాపు 2వేల మంది అభ్యర్థులు ఓఎమ్మార్ షీట్లలో తాము ఏ సిరీస్ ప్రశ్నపత్రానికి సమాధానాలు గుర్తిస్తున్నారో తెలియచేసే గడులను పూరించకుండా వదిలేశారు. ఇలాంటి వాటిని తిరిగి పరిశీలింపచేసి ఏ కేంద్రంలో ఏ టేబుల్‌కు ఆ ఓఎమ్మార్ పత్రం వెళ్లింది? అక్కడ ఏ సిరీస్ ప్రశ్నపత్రం ఇచ్చిందీ పరిశీలించి ఆమేరకు మళ్లీ స్కానింగ్ చేయాల్సి వచ్చిందని అధికారులు పేర్కొంటున్నారు.

ఎక్కువమంది ఓ గడిని దాటి రెండో గడిని తాకేలా మార్కు చేశారు. వాటిని స్కానింగ్ యంత్రాలు స్కాన్ చే సి ఉండకపోవచ్చని వివరిస్తున్నారు. అభ్యర్థులు చేసిన పొరపాట్ల కారణంగా ఓఎమ్మార్ షీట్లను స్కానింగ్ యంత్రాలు మూల్యాంకనం చే యకపోవడానికి విద్యాశాఖ బాధ్యత వహించబోదని స్పష్టం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు