పెరుగుతున్న సైబర్‌ వేధింపులు 

27 Apr, 2020 03:37 IST|Sakshi

సోషల్‌ మీడియాలో అసభ్య పోస్టులు, వ్యాఖ్యలు

సీఐడీ వాట్సాప్‌ హెల్ప్‌లైన్‌కు వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు

ఇప్పటివరకు 84 కేసులు నమోదు

సాక్షి, అమరావతి: లాక్‌డౌన్‌తో అందరూ ఇళ్లకే పరిమితమవడంతో దీన్నే అవకాశంగా తీసుకుంటున్న ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. సోషల్‌ మీడియాలో కొందరు సైబర్‌ వేధింపులకు పాల్పడుతున్నారు. వీటిని అరికట్టేందుకు కొత్తగా సీఐడీ ఏర్పాటు చేసిన వాట్సాప్‌ హెల్ప్‌లైన్‌కు విశేష స్పందన లభిస్తోంది.

సైబర్‌ వేధింపుల నిరోధానికి సీఐడీ వాట్సప్‌ నంబర్‌ 9071666667
► ఆకతాయిలు కరోనాపై భయాందోళనలు కలిగించే వదంతులను, తప్పుడు సమాచారాన్ని పెద్ద ఎత్తున సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చేస్తున్నారు.
► వ్యక్తులు, పార్టీలు, సంస్థలు, మతాలు, సంఘాలను కించపరిచేలా ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విట్టర్, హలో తదితర సామాజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్టులు పెడుతున్నవారు, వాటిని వైరల్‌ చేస్తున్నవారి ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు సీఐడీ వాట్సాప్‌ హెల్ప్‌లైన్‌ను ప్రవేశపెట్టింది.
► సైబర్‌ వేధింపుల నిరోధానికి సీఐడీ ప్రారంభించిన 90716 66667 హెల్ప్‌లైన్‌ వాట్సాప్‌ నంబర్‌కు మెసేజ్‌ ఇచ్చినా, మిస్డ్‌ కాల్‌ ఇచ్చినా వారికి నేరుగా పోలీసులే ఫోన్‌ చేసి వివరాలు సేకరిస్తారు.
► ఇందుకు సంబంధించి హెల్ప్‌లైన్‌లో ఫిర్యాదుదారుకు ఒక రిఫరెన్స్‌ నంబర్‌ ఇస్తున్నారు. ఆ నంబర్‌ ఆధారంగా తమ ఫిర్యాదు, కేసు ఏ స్థాయిలో ఉన్నాయో ఎప్పటికప్పుడు తెలుసుకునే సౌకర్యం కల్పించారు.
► గత వారం రోజుల్లో హెల్ప్‌లైన్‌కు 7,129 మెసేజ్‌లు, 1,040 కాల్స్‌ ఫిర్యాదులు వచ్చాయి.
► సీఐడీ ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ఫ్యాక్ట్‌ చెక్‌లో ఇప్పటివరకు 469 అంశాల్లో నిజాలు నిర్ధారించి ప్రజలకు సమాచారం అందించింది.

వాట్సాప్‌ హెల్ప్‌లైన్‌ కోసం సీఐడీలో ప్రత్యేక టీమ్‌
‘స్టే సేఫ్‌.. స్టే స్మార్ట్‌ మొబైల్‌ వాట్సాప్‌ హెల్ప్‌లైన్‌’ మంచి ఫలితాలు ఇస్తోంది. ఇందుకోసం ఏపీ సీఐడీ వింగ్‌లో 15 మంది ప్రత్యేక అధికారుల బృందం పనిచేస్తోంది. సైబర్‌ వేధింపులకు సంబంధించి ఇప్పటివరకు ఐపీసీ సెక్షన్లతోపాటు ఐటీ యాక్ట్‌ కింద 84 మందిపై కేసులు నమోదు చేశాం. మతపరమైన వాటితోపాటు ఇతర అనేక అంశాలపై రెచ్చగొట్టేలా ఉన్న 408 పోస్టింగ్‌లపై విచారణ చేస్తున్నాం.
–పీవీ సునీల్‌ కుమార్, సీఐడీ ఏడీజీ

మరిన్ని వార్తలు