బోటు ప్రమాదం; మృతుల కుటుంబాలకు బీమా

23 Sep, 2019 20:48 IST|Sakshi

సాక్షి, రాజమహేంద్రవరం: దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిపోయిన లాంచీని వెలికి తీయడానికి అన్ని ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నయీమ్  హష్మి తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రమాదానికి గురైన బోటులో మొత్తం 77 మంది ప్రయాణించారని తెలిపారు. 26 మంది సురక్షితంగా బయటకు వచ్చారని,  36 మంది మృతదేహాలు లభ్యమయ్యాయని చెప్పారు. మరో 15 మృతదేహల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయన్నారు. లైఫ్ జాకెట్స్ వేసుకున్నారా లేదా తనిఖీలు చేసిన తరువాతే బోటు ప్రయాణానికి అనుమతిచ్చారని వెల్లడించారు. సహాయక చర్యలు ముగిసే వరకు దేవీపట్నంలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని స్పష్టం చేశారు.

బోటు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా బీమా అందిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పరిహారంతో దీనికి సంబంధం లేదన్నారు. డీజీపీ ఆదేశాల మేరకు ఇన్సూరెన్స్ కోసం ప్రత్యేకంగా రాజమండ్రిలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రత్యేకంగా హెల్ప్‌ డెస్క్‌ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. మృతుల బంధువులు నేరుగా ఇక్కడకు వచ్చి సంబంధిత పత్రాలు సమర్పించి బీమా డబ్బు పొందవచ్చన్నారు. న్సూరెన్స్ కంపెనీ సిబ్బంది, పోలీసు సిబ్బంది సహకరిస్తారని ఎస్పీ తెలిపారు.

బీమాకు సంబంధించిన సమాచారం కోసం ఈ నంబర్లలో సంప్రదించవచ్చు
రజనీకుమార్ సిఐ: 9440796395
న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధి ప్రకాష్: 9700001818
ల్యాండ్ లైన్ నెంబరు: 08854 254073

ఇన్సూరెన్స్  కోసం సమర్పించాల్సిన పత్రాలు
ఎఫ్‌ఐఆర్‌ కాపీ
మరణ ధ్రువీకరణ పత్రం
పోస్ట్‌మార్టమ్‌ నివేదిక
బ్యాంకు ఖాతా వివరాలు
వారసుల సర్టిఫికెట్‌

మరిన్ని వార్తలు