భద్రతలేని బతుకులు..!

28 Apr, 2018 04:15 IST|Sakshi

ప్రైవేటు విద్యా సంస్థల్లో మేథో దోపిడీ పర్వం

పండుగలు, జాతీయ సెలవు రోజుల్లోనూ తప్పని విధులు

     12 నెలలకు బదులు పది నెలలే వేతనం

     నిండు గర్భిణులైనా, బాలింతలైనా సెలవుల్లేవు

     అడ్మిషన్లు, ఫీజుల వసూలు బాధ్యత టీచర్లదే

     ప్రభుత్వ నిబంధనలు పట్టని యాజమాన్యాలు

సాక్షి, అమరావతి: అక్కడ ఉద్యోగం వెట్టి కన్నా ఘోరం.. ఉద్యోగం దినదిన గండం.. ఇచ్చే అరకొర జీతాలు ఎప్పుడిస్తారో దేవుడికే ఎరుక.. మహిళల పరిస్థితి మరీ అధ్వానం.. లైంగిక వేధింపులు సరేసరి.. ప్రత్యేక పరిస్థితుల్లో సెలవులు ఉండవు. గర్భవతులకు, బాలింతలకు చట్టబద్ధంగా ఇవ్వాల్సిన సెలవుల మాటేలేదు.. ఎవరైనా ప్రశ్నిస్తే అంతే సంగతులు, ఇంటికి పంపేస్తారు. కొన్నిచోట్ల పోలీసులతో బెదిరింపులు.. ఇదీ రాష్ట్రంలోని అనేక ప్రైవేటు విద్యా సంస్థల్లోని బోధన, బోధనేతర సిబ్బంది అనుభవిస్తున్న ప్రత్యక్ష నరకం. చట్టంలో ఎన్ని నిబంధనలున్నా ఈ సంస్థలకు పట్టవు. చట్టాలు వారికి చుట్టాలు. ప్రభుత్వాధికారులు కూడా అంతే. చూసీచూడనట్లు పోతారు. ఫలితంగా సిబ్బంది దశాబ్దాల తరబడి దారుణమైన దోపిడీకి గురవుతున్నారు. లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న ఈ సంస్థలు సిబ్బందికి మాత్రం మొక్కుబడిగా జీతాలిచ్చి శ్రమదోపిడీ, మేథో దోపిడీకి పాల్పడుతున్నాయి. 

రాష్ట్రంలో ప్రైవేటు యాజమాన్యంలో 16,684 స్కూళ్లు, 3,300 ఇంటర్మీడియెట్‌ కాలేజీలు.. 1,400 డిగ్రీ కాలేజీలతోపాటు ఇంజనీరింగ్, పాలిటెక్నిక్, బీఈడీ, డీఈడీ, ఇలా పలు కోర్సులు నిర్వహించే ప్రైవేటు విద్యా సంస్థలూ అన్నీ కలిపి 3,500 వరకు ఉన్నాయి. వీటిలో దాదాపు 5.5 లక్షల నుంచి 6 లక్షల మంది వరకు బోధన, బోధనేతర సిబ్బంది పనిచేస్తున్నారు. అలాగే, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మొత్తం 61వేల పాఠశాలల్లో ప్రైవేటు స్కూళ్ల సంఖ్య తక్కువే. అలాగే, మొత్తం 72 లక్షల మంది విద్యార్థుల్లో దాదాపు 40లక్షల మంది ప్రైవేటు సంస్థల్లోనే చదువుతున్నారు.

ఇంటర్‌ కాలేజీల్లోని మొత్తం 9 లక్షల మంది విద్యార్థుల్లో 2–3 లక్షల మందే ప్రభుత్వ కాలేజీల్లో ఉండగా అంతా ప్రైవేటులోనే ఉన్నారు. ఇక డిగ్రీ కాలేజీల్లోనూ ఇదే పరిస్థితి. ఈ విద్యార్ధుల నుంచి కోట్లలో ఫీజులు వసూలుచేస్తున్న యాజమాన్యాలు తమ సిబ్బందికి చెల్లించే జీతాలు మాత్రం నామమాత్రం. ప్రైవేటు స్కూళ్లు, కాలేజీల్లో దాదాపుగా 5 లక్షల మందికి పైగా బోధన, బోధనేతర సిబ్బంది పనిచేస్తున్నట్లు అంచనా. వీరికి ఎక్కడా కనీస వేతన చట్టాన్ని అమలుచేస్తున్న దాఖలా లేదు. ఉ.8 నుంచి రాత్రి 8 వరకు వీరి పనివేళలు. వీరికి ఉద్యోగ భద్రత అనేదే లేదు. సిబ్బంది, విద్యార్థుల సంఖ్యల్లో దొంగలెక్కలు చూపిస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనలు అసలు పట్టించుకోరు.

టీచర్ల దయనీయ పరిస్థితులు
– బీఈడీ, ఎంఈడీ సహ పలు విద్యార్హతలున్న వారికి సైతం ఇక్కడ ఇచ్చేది 10 నుంచి 15 వేలు మాత్రమే. కొన్ని సంస్థల్లో 5 వేలకన్నా తక్కువ వేతనమే ఉంటోంది. ఏడాది అంటే ఈ యాజమాన్యాల దృష్టిలో కేవలం 10 నెలలు మాత్రమే. 
– రాష్ట్ర విద్యా పరిశోధనా శిక్షణ సంస్థ ద్వారా నిర్దేశించిన సిలబస్‌ కానీ, పాఠ్య ప్రణాళిక, క్యాలెండర్‌ కానీ వీటికి పట్టవు.
– ఏడాదిపాటు చెప్పాల్సిన సిలబస్‌ను 5 నెలల్లో ముగించి ఆ తర్వాత పలుచోట్ల టీచర్లను బయటకు పంపేస్తున్నారు. 
– స్కూల్లో పిల్లల్ని జాయిన్‌ చేయించడం, వారిని స్కూలుకు రప్పించడం టీచర్లదే బాధ్యత. విద్యార్థుల సంఖ్య తగ్గితే టీచర్లకు జీతాలుండవు. అనేకచోట్ల వేతనాలు రెండు మూడు నెలలకు ఒకసారి ఇస్తున్నారు.
– టీచర్ల నుంచి ముందుగా ఒరిజినల్‌ సర్టిఫికెట్లు, ప్రామిసరీ, నోటు, ఖాళీ చెక్కులు తీసుకుంటూ తరువాత వాటిని చూపించి బెదిరిస్తున్నారు. 
– ఒక రోజు సెలవు కావాలని అడిగినా.. అనారోగ్యం ఉన్నా సెలవులు ఇచ్చే పరిస్థితిలేదు. వేసవిలో ఆదివారాలు కూడా పనిచేయిస్తున్నారు. సెలవు పెడితే జీతం కట్టే.

మహిళల పరిస్థితి మరీ దారుణం
ప్రైవేట్‌ సంస్థల్లో మహిళా టీచర్ల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. చట్టబద్ధంగా ఉన్న మెటర్నీటీ లీవులు ఉండవు. నిండు గర్భంతో ఉన్నా రావలసిందే. లేదంటే ఉద్యోగం మానుకోవాలి. నడి వేసవి అయినా పిల్లల్ని చేర్పించడానికి వీధివీధి తిరగాలి. ఇందుకయ్యే ఖర్చులు టీచర్లే భరించుకోవాలి. కొన్ని సంస్థల్లో మహిళా సిబ్బందిపై లైంగిక వేధింపులూ జరుగుతున్నాయి. అవేవీ బయటకు రాకుండా యాజమాన్యాలు మేనేజ్‌ చేస్తున్నాయి. ఎవరైనా ప్రశ్నిస్తే పోలీసులతో బెదిరిస్తున్నారు.

ప్రభుత్వం అంటే లెక్కేలేదు
వేసవిలో ప్రభుత్వం ప్రకటించిన తేదీ నుంచి అన్ని స్కూళ్లు, కాలేజీలు తరగతులు నిర్వహించరాదు. కానీ, ప్రైవేటు విద్యాసంస్థలు వీటిని అస్సలు పట్టించుకోవు. 9వ తరగతి పిల్లలకు టెన్త్‌ పాఠాలు, 10 వారికి ఇంటర్‌ ఫస్టియర్, ఫస్టియర్‌ వాళ్లకు సెకండియర్, సెకండయర్‌ వాళ్లకు ఎంసెట్‌ తదితర కోచింగ్‌లు పెడుతున్నాయి. టీచర్లకు వేతనమే తప్ప ఇతర అదనపు ప్రోత్సాహకాలూ ఉండవు. ప్రభుత్వం నిర్ణయించిన పాఠ్య ప్రణాళికను, సిలబస్‌ను, క్యాలెండర్‌ను ఏమాత్రం గౌరవించవు. తమ సొంత సిలబస్‌ను, క్యాలెండర్‌ను అమలుచేస్తున్నాయి. పాఠ్యాంశాలకన్నా ఇతర కోచింగ్‌ అంశాలకు ప్రాధాన్యమిస్తూ చివర్లో పాఠ్యాంశాలను చెప్పిస్తున్నాయి. ఈ సంస్థల్లో విద్యార్థులే కాకుండా టీచర్లూ ఒత్తిళ్లకు గురవుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఆత్మహత్యలూ చేసుకుంటున్నారు. ప్రావిడెంటు ఫండ్‌ను టీచర్‌ కట్టిన దానికి సమానంగా సంస్థ భరించాలి. కానీ, రెండింటినీ టీచర్‌ జీతం నుంచే కట్‌ చేస్తున్నారు. వాటినీ సక్రమంగా జమచేయడం లేదు. కొన్నిసార్లు తప్పుçడు పేర్లతో జమచేస్తున్నారు. చివరకు ఆ ప్రావిడెంటు ఫండూ టీచర్ల చేతికి రావడంలేదు. గ్రాట్యుటీ వంటివి అసలే లేవు.

చట్టం ఏం చెబుతోందంటే...
– ప్రభుత్వ స్కూళ్లలోని సిబ్బందికి వర్తించే నియమావళినే ఇక్కడా పాటించాలి.
– ప్రభుత్వం నిర్దేశించిన పాఠ్య ప్రణళికను, పాఠ్యాంశాలను తప్పనిసరిగా అనుసరించాలి.   
– పీఎఫ్‌ వంటి ప్రభుత్వ నిబంధనలను వర్తింపజేస్తూ వాటిని ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి జమచేయాలి.
– ప్రభుత్వం నిర్దేశించిన సమయాలను కచ్చితంగా పాటించాలి.
– గవర్నింగ్‌ బాడీ నిర్ణయించిన మేరకు సిబ్బందికి జీతాలు చెల్లించాలి. 
– వసూలైన ఫీజుల్లో 5 శాతం మేనేజ్‌మెంటు ఉంచుకోవచ్చు. 15 శాతాన్ని స్కూలు నిర్వహణకు ఖర్చుచేయాలి. 15 శాతం స్కూలు అభివృద్ధి కార్యక్రమాలకు వెచ్చించాలి. 50 శాతం వేతనాలకు వినియోగించాలి. 15 శాతం మొత్తాన్ని సిబ్బంది గ్రాట్యుటీ, ప్రావిడెంటు ఫండ్, ఇన్సూరెన్సుల కింద మేనేజ్‌మెంటు వాటాగా చెల్లించాలి.
– ఉద్యోగుల్ని డిస్మిస్‌ చేయడం, తొలగించడం నిర్ణీత ప్రక్రియల్లో మాత్రమే చేపట్టాలి. 

మా బతుకులు దుర్భరం
ప్రైవేటు విద్యాసంస్థల్లో పనిచేస్తున్న బోదన, బోధనేతర సిబ్బంది జీవితాలు చాలా దుర్భరంగా ఉన్నాయి. కనీస వేతనాలు చెల్లించడంలేదు. ఉద్యోగ భద్రత అసలే లేదు. ఇక పీఎఫ్, ఈఎస్‌ఐ, గ్రూప్‌ ఇన్సూరెన్సు, గ్రాట్యుటీ వంటివీ లేవు. ప్రశ్నిస్తే నిర్దాక్షిణ్యంగా తొలగిస్తున్నాయి. పిల్లలను చేర్పించకపోతే స్కూలుకు రావద్దని చెబుతున్నారు. అర్థంతరంగా తొలగిస్తుండడంతో కుటుంబాలతో రోడ్డున పడాల్సి వస్తోంది. సొంత ఆస్తులు పెంచుకుంటున్నారు. వేసవిలోనే కాదు ఏ ఇతర సెలవులూ ఇవ్వడంలేదు. మా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. 
– డి. అంబేద్కర్, భరత్‌రెడ్డి.. రాష్ట్ర ప్రైవేట్‌ టీచర్లు, లెక్చరర్ల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు 

మరిన్ని వార్తలు