సిరిపురి ‘దేశం’లో.. సీఎం రచ్చ

9 May, 2018 12:12 IST|Sakshi

రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌పై వరద దూషణల పర్వం

రమేష్‌కు మద్దతుగా లింగారెడ్డి రంగప్రవేశం

ప్రొద్దుటూరు టీడీపీలో భగ్గుమన్న విభేదాలు

ప్రొద్దుటూరు : ప్రొద్దుటూరు నియోజకవర్గంలో అధికార పార్టీలో అంతర్గత కుమ్ములాటలు రచ్చ కెక్కాయి. ఇంతకాలం పరోక్షంగా సాగుతూ వచ్చిన కలహాలు ఇప్పుడు ప్రత్యక్ష పోరుకు రెడీ అన్నట్లు తయారయ్యాయి. రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌పై టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ఘాటుగా విమర్శనాస్త్రాలు సంధించడంతో పాటు.. తాను పార్టీలో ఉంటానో... లేదో తెలియదని అయితే జరుగుతున్న అన్యాయాన్ని చూస్తూ సహించబోనని   వరదరాజులరెడ్డి చెప్పడాన్ని బట్టిచూస్తే ఆయన పార్టీలో తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వరదరాజులరెడ్డిని పార్టీ ఇన్‌చార్జి పదవి నుంచి సస్పెండ్‌ చేయాలని కోరుతూ ముఖ్యమంత్రిని కలుస్తానని  మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి ప్రకటించారు. 

అసలు విషయం ఏమిటంటే .. మంగళవారం మున్సిపల్‌ చైర్మన్‌ చాంబర్‌లో వరదరాజులరెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి సీఎం రమేష్‌ను దూషించినదానికంటే కొద్ది నిమిషాల ముందు టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి మరో ప్రెస్‌మీట్‌కు హాజరయ్యారు. దీనిని బట్టి సీఎం రమేష్‌పై వరద చేసిన దూషణలు జిల్లా అధ్యక్షునికి తెలుసుననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తనకు టికెట్‌ రాదని తెలిసే వరద ఈ విమర్శలు చేశాడని లింగారెడ్డి అనడం గమనార్హం. తాజా పరిస్థితిని బట్టి చూస్తే జిల్లాలోని మిగతా నియోజకవర్గాలలాగే ప్రొద్దుటూరులో కూడా తెలుగు తమ్ముళ్ల మధ్య రాజకీయ విభేదాలు రచ్చకెక్కాయి.

 ప్రొద్దుటూరు నియోజకవర్గ రాజకీయాల్లో తలదూర్చుతున్న రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌ పోట్లదుర్తిలో ఎలా కాపురం చేస్తాడో చూస్తానని వరద చెప్పడం చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి గత పదేళ్లుగా సీఎం రమేష్‌ ప్రొద్దుటూరు రాజకీయాలను ప్రభావితం చేస్తున్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలను అడ్డుపెట్టుకుని ఇక్కడ తన వ్యూహాన్ని రచిస్తున్నారు. గతంలో రోడ్డుకు సంబంధించిన కాంట్రాక్టు టెండర్‌ విషయంలో వరద తనయుడు కొండారెడ్డి, సీఎం రమేష్‌ సోదరులు స్వయంగా పోటీ పడ్డారు. అప్పటి నుంచి ఇరువురి మధ్య విభేదాలు ఉన్నాయి. 

వరద కాలువకు పోటీ 
ప్రొద్దుటూరు పట్టణ ప్రజల తాగునీటి కోసం 2007లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుందూ–పెన్నా వరద కాలువను మంజూరు చేశారు. కాంట్రాక్టు పనులు దక్కించుకున్న వరదరాజులరెడ్డి అలైన్‌మెంట్‌ మార్చడంతో పనులు ఆగిపోయాయి. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో మళ్లీ టెండర్లు పిలవగా పనుల కోసం వరద తనయుడితోపాటు పోట్లదుర్తి సోదరులు పోటీ పడ్డారు. చివరికి వరద తనయుడు ఈ పనులు దక్కించుకుని ఇటీవల ప్రారంభించారు. మరో మారు అలైన్‌మెంట్‌ మార్చేందుకు యత్నిస్తున్నారు.

 రైతులు వ్యతిరేకిస్తున్నా పనులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కుందూ–పెన్నా వరద కాలువ నిర్మాణానికి సీఎం రమేష్‌ అడ్డుతగులుతున్నాడని కాంట్రాక్టర్‌గా ఉన్న వరదరాజులరెడ్డి విమర్శలు చేశారు. పైగా తన ప్రత్యర్థులను ఆర్థికంగా బలోపేతం చేస్తున్నాడని విమర్శించడం గమనార్హం. ఇటీవల మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ వీఎస్‌ ముక్తియార్‌ ఏర్పాటు చేసిన మైనారిటీల సభ వెనుక సీఎం రమేష్‌ వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే పరోక్షంగా వరద విమర్శలు చేశారు. 

వర్గాలుగా నేతలు
తొలి నుంచి టీడీపీలో ఉన్న లింగారెడ్డిని కాదని గత ఎన్నికల సందర్భంగా వరదరాజులరెడ్డికి పార్టీ అధిష్టానం టికెట్‌ కేటాయించింది. నాటి నుంచి నేటి వరకు నిత్యం ఇరువురి మధ్య విభేదాలు నెలకొన్నాయి. ఎవరి ఇళ్లలో వారు పార్టీ సమావేశాలు పెట్టుకోవడం, తమకు అనుకూలంగా చెప్పుకోవడం జరిగింది. లింగారెడ్డితోపాటు ముక్తియార్, ఈవీ సుధాకర్‌రెడ్డిలను సీఎం రమేష్‌ బలపరుస్తుండగా వరదరాజులరెడ్డికి మంత్రి ఆదినారాయణరెడ్డి, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి అండగా ఉన్నారు.

 పార్టీ కార్యకర్తల నుంచి ఇన్‌చార్జిల వరకు ఇరువురి నేతల మధ్య సఖ్యత లేదు. గత ఎన్నికల సందర్భంగా పార్టీ టికెట్‌ దక్కించుకున్న వరదరాజులరెడ్డి ఎన్నికలో ఓటమి పాలైన తర్వాత ఏడాదికి పార్టీ ఇన్‌చార్జి పదవిని కూడా దక్కించుకున్నారు. దీంతో లింగారెడ్డి తీవ్ర నిరుత్సాహానికి గురికాగా పార్టీ అధిష్టానం ఆయనకు పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌ పదవిని కట్టబెట్టింది. ఇటీవలే ఆ పదవీకాలం పూర్తి కాగా తనకు పార్టీ ఇన్‌చార్జి పదవి ఇవ్వాలని లింగారెడ్డి కోరుతున్నారు. పైగా వచ్చే ఎన్నికల్లో తనకే టికెట్‌ ఇస్తామని పార్టీ ముఖ్య నేతలు చెప్పినట్లు కార్యకర్తల సమావేశంలో ఆయన చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పార్టీలో రాజుకున్న పోరు ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాల్సిందే. 

>
మరిన్ని వార్తలు