-

బీటెక్ రవి వ్యవహారంలో ఆ బీజేపీ లీడర్‌కి ఏం పని?

27 Nov, 2023 14:15 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, కడప: రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీలో చేరిన టీడీపీ నేతలు సిగ్గు విడిచి ప్రవర్తిస్తున్నారు. విలువల్లేని రాజకీయాలు చేస్తూ నవ్వుల పాలవుతున్నారు. నవ్విపోదురుగాక...నాకేటి సిగ్గు అన్నట్లుగా కడప గల్లీలో టీడీపీ..ఢిల్లీలో బీజేపీ నేతగా చెలామణి అవుతున్నారు. రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌ వ్యవహరిస్తున్న ధోరణితో ఇటు టీడీపీ, అటు బీజేపీ నాయకులు సైతం విస్తుపోతున్నారు. స్వప్రయోజనాలే పరమావధిగా కొనసాగేవారికి సీఎం రమేష్‌ నిదర్శనంగా నిలుస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు.

బీటెక్‌ రవి వ్యవహారంలో..
పులివెందుల టీడీపీ నేత బీటెక్‌ రవిని ఓ కేసులో పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌లో పెట్టారు. ఇటీ వల పరామర్శించిన బీజేపీ ఎంపీ రమేష్‌నాయుడు బీటెక్‌ రవిని పోలీసులు కిడ్నాప్‌ చేశారని, మీడియా వల్లే బతికిపోయారని చెబుతూనే పోలీసులు హింసించారని కూడా ఆరోపించారు. ఈ విషయమై ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ స్పందిస్తూ బీటెక్‌ రవిని 7.30 గంటలకు అరెస్టు చేస్తే, లీగల్‌ ఫార్మా లిటీస్‌ పూర్తి చేసి 10.30 గంటలకు మేజిస్ట్రేట్‌ ఎదుట హాజరు పర్చామన్నారు. 24గంటల్లో హాజరు పెట్టాల్సి ఉండగా తక్షణ నిర్ణయం తీసుకున్నామని వివరిస్తూనే, పోలీసులపై తప్పుడు ఆరోపణలు తగవని..చట్టపరిధిలోనే చర్యలు చేపట్టినట్లు వివరించారు. అయితే ఇదే విషయమై శనివారం ఎంపీ సీఎం రమేష్‌ మాట్లాడుతూ ఎస్పీకి తీరు సరిగా లేదంటూ హితబోధ చేశారు. కాగా జిల్లాలో బీజేపీ నేతలను ఏనాడూ పెద్దగా పట్టించుకోని సీఎం రమేష్‌ టీడీపీ నేత బీటెక్‌ రవి పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపడాన్ని పలువురు ఆశ్చర్యచకితులవుతున్నారు.

టీడీపీకి కూడా తానే పెద్ద!
బీటెక్‌ రవిని పోలీసులు హింసించి ఉంటే మేజిస్ట్రేట్‌ ఎదుట వాంగ్మూలం ఇచ్చేవాడు కదా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు.అవకాశమొస్తే పోలీసులను వదిలిపెడతాడా అంటున్నారు. అయి తే ఎంపీ రమేష్‌ జిల్లాలో టీడీపీకి తాను మాత్రమే పెద్దదిక్కు అన్నటు చెప్పుకోవడానికే ఈ వ్యవహారాన్ని వివాదస్పదం చేసినట్లు విశ్లేషకులు అంటున్నా రు.పైగా ఎంపీ రమేష్‌ సోదరుడు సురేష్‌ ప్రొద్దుటూరు టీడీపీ టికెట్‌ ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లాలో టీడీపీ నేతను అరెస్టు చేస్తే, తా ను తప్ప మరెవ్వరూ ప్రొటెక్టు చేయలేకపోయారని చెప్పుకోవాలనే ఎంపీ ఇదంతా చేస్తున్నట్లు పరిశీలకులు వివరిస్తున్నారు.

ప్రొద్దుటూరు టికెట్‌ కోసం తీవ్రయత్నం
బీజేపీలో ఉంటూ ప్రొద్దుటూరు టీడీపీ టికెట్‌ కోసం ఎంపీ రమేష్‌ కుటుంబం ప్రయత్నిస్తోంది. టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా ఉంటున్న ఆయన సోదరుడు సురేష్‌ను ఈ మారు ప్రత్యక్ష ఎన్నికల్లో నిలపాలనే తపన మెండుగా ఉంది.అందుకు కారణం లేకపోలేదు. ఎంత డబ్బున్నా పోట్లదుర్తి నాయుళ్ల బలం పోట్లదుర్తికి ఎక్కువ.. ఎర్రగుంట్ల మండలానికి తక్కువ అనే విధంగా ఉంది. ఇదే విషయాన్ని అనేక పర్యాయాలు సీనియర్‌ నేత నంద్యాల వరదరాజులరెడ్డి లాంటి వారు ఎత్తిచూపారు. ఈమారు పోట్లదుర్తి నాయుళ్లకు ఉన్న డబ్బుతో ఆ మాట పోగోట్టుకోవాలనే తపన రమేష్‌నాయుడు కుటుంబంలో మెండుగా ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నా రు. ఆ మేరకే బీటెక్‌ రవి వ్యవహారంలో ఛీప్‌ ట్రిక్స్‌ ప్లే చేస్తున్నట్లు పరిశీలకులు చెబుతున్నారు. ఈ మొ త్తం వ్యవహారాన్ని పరిశీలిస్తున్న బీజేపీ సీనియర్‌ నేతలు సిద్ధాంతాలతో ముందుకొచ్చిన తమ పార్టీకి ఇదేం ఖర్మ అనుకుంటూ మధనపడుతున్నారు.

మరిన్ని వార్తలు