ఇదేమి శిద్దాంతం

22 Aug, 2015 04:07 IST|Sakshi
ఇదేమి శిద్దాంతం

♦ రంగంలోకి స్టూడెంట్ స్పెషల్స్
♦ బస్సు మిస్సయితే చేతికి భారమే
♦ ప్రయోగాత్మకంగా జిల్లాలో ఐదు సర్వీసులు
♦ అద్దంకిలో ఒకటి ప్రారంభం, మరో మూడు డిపోల్లో సిద్ధం
♦ స్టడీ అవర్స్ ఉన్నా..అదనపు క్లాసులు జరిగినా విద్యార్థులకు చేతి చమురే
 
 ఒంగోలు : తగ్గుతున్న ఆదాయాన్ని పెంచుకునే క్రమంలో ఆర్టీసీ అధికారులు స్టూడెంట్ స్పెషల్’ పేరుతో విద్యార్థులపై అదనపు భారం మోపడానికి తెరదీశారు. విద్యార్థులకు మరిన్ని సేవలు అందిస్తున్నామని ఆర్టీసీ చెబుతూ చాపకింద నీరులా జేబుకు చిల్లుపెడుతున్నారు. ఇప్పటికే అద్దంకి డిపోలో ఒక బస్సు ప్రారంభం కాగా మరో మూడు డిపోలను రోడ్డుపైకి తేవడానికి కసరత్తు చేస్తున్నారు. సాక్షాత్తు రాష్ట్ర రవాణాశాఖా మంత్రి శిద్దా రాఘవరావు సొంత జిల్లాలోనే స్టూడెంట్స్‌కు సెగ ప్రారంభించారు.

 ఇదీ పరిస్థితి...
 అక్రమ రవాణాను అరికట్టేందుకు ఆర్టీసీ సర్వే నిర్వహించింది. ప్రయివేటు వాహనాల్లో తిరుగుతున్న రూట్లను గుర్తించారు. కందుకూరు నుంచి విజయవాడకు, కనిగిరి నుంచి విజయవాడకు ఎక్కువుగా తిరుగుతున్నట్టుగా నిర్థరించారు. ఇక నిత్యం హైదరాబాదుకు స్టేజీ క్యారియర్లుగా నడుపుతున్న సర్వీసులు లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి. వీటిని నిరోధించాల్సింది ఆదాయం పెంచుకోవల్సిందిపోయి ఉరిమి,ఉరిమి మంగళంపై పడ్డట్టు విద్యార్థులపై వీరి కన్ను పడింది.రద్దీ సమయాలలో ‘పల్లె వెలుగు’ బస్సులలో విద్యార్థులు ఎక్కడం వల్లే ప్రయాణికులు బస్సులు ఎక్కలేక ఇతర వాహనాలను ఆశ్రయిస్తున్నారని, ఈ కారణంగానే  ఆక్యుపెన్సీ రేషియో కూడా పడిపోతుందంటూ ఆర్టీసీ అధికారులు లెక్కల చిట్టా విప్పారు. వీటికి పరిష్కారం విద్యార్థుల కోసం ‘స్టూడెంట్స్ స్పెషల్ బస్సులను’ తెరపైకి తెచ్చారు.

 ఇబ్బందులేమిటి...
 ఇప్పటివరకు ఆర్టీసీ బస్సులలో విద్యార్థి ఉదయం బస్సు ఎక్కి కళాశాల లేదా స్కూలుకు  వెళితే సాయత్రం 8 గంటలలోపు తిరిగి ఇంటికి చేరుకునేందుకు దృష్టి సారించేవాడు. అందుకు కారణాలు అనేకం. విద్యార్థికి 35 కిలోమీటర్ల వరకు రాయితీ బస్సు పాసు  (ఊరక ఇచ్చేది కాదు...ప్రభుత్వం ఈ మొత్తాన్ని ఆర్టీసీకి తిరిగి చెల్లిస్తుంది) సౌకర్యం ఉంది. దీంతో సంబంధిత విద్యార్థి ఏ సమయంలోనైనా కళాశాలకు వెళ్లేవాడు, తిరిగి వచ్చేవాడు. కళాశాలలో చదివే విద్యార్థి ఆ చదువుతో పాటు దీనికి అనుబంధంగా ఉండే కోర్సులు, కంప్యూటర్లు, ట్యూషన్లు, అదనపు కోర్సులు చేయడానికి పట్టణాల్లోనే రెండు, మూడు గంటలు ఉండిపోతారు.

తరువాత ఏ బస్సు దొరికితే ఆ బస్సుకు ఇళ్లకు చేరుకుంటారు. అలాగే ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు కూడా కళాశాల సమయానికి ముందు పలు శిక్షణలు పొందుతుంటారు. వీరందరికీ స్టూడెంట్ స్పెషల్ బస్సులు అశనిపాతంగా తయారయ్యాయి.  కాలేజీలు, పాఠశాలలు ఒక్కోసారి మధ్యాహ్నానికే శెలవు ఇవ్వడం లేదా క్లాసులు జరగక విద్యార్థులు ముందుగానే ఇళ్లకు వెళ్లాల్సిన సాయంత్రం స్టూడెంట్ స్పెషల్ వచ్చేవరకూ వేచి ఉండాల్సిందే.  ఇక సాధారణంగా పాఠశాలలు వదిలే సమయం సాయంత్రం 4.45 గంటలు. పాఠశాల వదలగానే పీఈటీలు పిల్లలను ఆడించేందుకు గ్రౌండులోకి పిలుస్తుంటారు. క్రీడాకారులైన పిల్లలు సాధారణ విద్యార్థులకన్నా ఒక గంట అదనంగా సమయం తీసుకొని ఇంటికి బయల్థేరడం సహజం.  గతంలోలా పల్లెవెలుగు బస్సును ఎక్కనివ్వరు. మరి వీరి సమస్యలు ఎలా గట్టెక్కుతాయని విద్యార్థులు వాపోతున్నారు.
 
 అనుమానాలను నివృత్తిచేసిన తరువాతే బస్సులను ఏర్పాటు చేయాలి
 స్టూడెంట్ స్పెషల్ బస్సుల పట్ల విద్యార్థులకు చాలా అనుమానాలు ఉన్నాయి. అనుమానాలను ఆర్టీసీ అధికారులు బహిర్గతం చేయాలి. అంతే తప్ప ఏకపక్షంగా బస్సులను ఏర్పాటుచేసి విద్యార్థులను ఇబ్బందులు పెట్టాలనుకుంటే మాత్రం సహించం.
 -ఏఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు, అశోక్
 
 ప్రత్యేక బస్సులను ఆహ్వానిస్తాం...కానీ:
 స్టూడెంట్స్ కోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయడాన్ని ఆహ్వానిస్తాం. అయితే ఆ పేరుతో ఇతర బస్సులలో విద్యార్థులను ఎక్కనీయమంటే మాత్రం ఊపేక్షించం. ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థికి చాలా సమయం పడుతుంది. నిత్యం లైబ్రరీలల్లో ఉంటూ విద్యార్థులు విద్యపై ఆసక్తిచూపే వారు చాలామందే ఉంటున్నారు. అటువంటి విద్యార్థులు అందరనీ ఒకే సమయంలో ఇంటికి చేరాలంటే కుదరదు. ఇతర సమయాల్లోను విద్యార్థులను పల్లెవెలుగు బస్సులలో ఎక్కనివ్వాలి.
 -ఎస్‌ఎఫ్‌ఐ మాజీ జిల్లా అధ్యక్షుడు వెంకట్రావు
 
 పల్లెవెలుగుల్లో అనుమతించకపోతే పోరాటమే
 విద్యార్థులను తాము ఏర్పాటుచేసిన స్టూడెంట్ స్పెషల్ బస్సులలో మాత్రమే అనుమతిస్తామంటే సహించం. నేడు కంప్యూటర్ క్లాసులకు విద్యార్థులు అత్యధికంగా వెళుతున్నారు. వారంతా తిరిగి తమ ప్రాంతాలకు చేరుకోవాలంటే ఆలస్యమవుతుంది.  పల్లెవెలుగుల్లో విద్యార్థులను ఎక్కనీయకుండా చేస్తే మాత్రం ఉద్యమమే శరణ్యం.  
 -పీడీఎస్‌యు రాష్ట్రకార్యదర్శి మల్లిఖార్జున్
 
  ముమ్మాటికీ విద్యార్థి వ్యతిరేక చర్యే
 ముమ్మాటికీ ఇది విద్యార్థి వ్యతిరేక చర్యే. ఒక రూట్లో తిరిగే విద్యా సంస్థలన్నింటినీ ఒకేసారి మూసివేయడం జరగదు. సిలబస్ కాకపోతే ప్రత్యేక క్లాసులు, సాధారణ విద్యార్థుల కోసం నిర్వహించే అదనపు బోధనా తరగతులు, విద్యార్థుల్లో ఉత్తీర్ణతాశాతం పెంచేందుకు చేపట్టే స్టడీ అవర్స్, కంప్యూటర్ క్లాసులుంటాయి. మేము బస్సులు వేశాం...కాబట్టి అవే బస్సులలో విద్యార్థులు ఎక్కాలి...మిగితా పల్లె వెలుగులలో ఎక్కనీయకుండా ఆర్టీసీ అధికారులు దృషి ్ట సారించడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఫీజు రీయింబర్స్‌మెంట్ మొదలు ప్రభుత్వం విద్యార్థి వ్యతిరేక చర్యలకు పాల్పడుతోంది. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది ఎదురైనా ఆందోళన ఉధృతం చేస్తాం
 -వైఎస్సార్ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు సూరె మణికంఠారెడ్డి
 
 జిల్లా వ్యాప్తంగా 20 బస్సులు
 మొత్తం 20 బస్సులను జిల్లావ్యాప్తంగా ఉన్న 8 డిపోల ద్వారా నడపాలని ఆర్టీసీ ప్రకాశం రీజియన్ నిర్ణయించింది. అయితే ప్రస్తుతానికి ఐదు సర్వీసులను సిద్ధ చేసింది. వాటిలో అద్దంకి డిపో పరిధిలో ఇప్పటికే ఒక బస్సు నడుస్తోంది. ఆ బస్సులో ట్రిప్పుకు 80 నుంచి 90 మంది విద్యార్థులు ఎక్కుతున్నట్లు అంచనా. అద్దంకి-ఉప్పలపాడు, అద్దంకి- ధర్మవరం మార్గాలలో నడుపుతున్నారు. ఒకే బస్సు నడవడం వల్ల ఒక రూట్లో ముందుగా బస్సు బయల్థేరుతుంది. రెండో మార్గంలో ఆలస్యంగా బయల్థేరుతుంది.  మార్కాపురం పరిధిలో మార్కాపురం-మిట్టమీదిపల్లికి ఒకటి నడుస్తుంది. కందుకూరు డిపో పరిధిలో ఒకటి సిద్ధం చేశారు. ప్రయోగాత్మకంగా బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ అధికారులు పేర్కొంటున్నా... జిల్లా వ్యాప్తంగా మేజర్ రూట్లన్నింటిలో ఈ విధానాన్ని ఏర్పాటుచేసి చివరకు భారం పిల్లలపై వేయనున్నట్టు తెలుస్తోంది.
 
 విద్యార్థి సంఘాలతో చర్చలేవీ...
 ఈ విషయంపై నిర్ణయం తీసుకునే క్రమంలో విద్యార్థులకు ఎదురయ్యే సమస్యలపై కనీసం ఆర్టీసీ అధికారులు ఒక సదస్సు నిర్వహించి విద్యార్థుల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోవడంగానీ, కనీసం విద్యార్థి సంఘాల నాయకులను ఆహ్వానించి చర్చించడం గానీ చేయకుండానే ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం పట్ల పలు విమర్శలు వినిపిస్తున్నాయి. రద్దీ మార్గాలలో మరో అదనపు బస్సును ఏర్పాటుచేస్తే సమస్య ఉండదని విద్యార్థివర్గాలు పేర్కొంటున్నాయి.

మరిన్ని వార్తలు