దేవుడికే శఠగోపం..!

21 Apr, 2017 10:39 IST|Sakshi

► రాజధానిలో ఆలయ భూముల ఆక్రమణ
► అబ్బురాజుపాలెంలో వెలుగుచూసిన బాగోతం
► రూ.15 కోట్లు విలువచేసే భూమి ఆక్రమణ
► దేవాదాయ ఉద్యోగే సూత్రధారి
► విచారణ ప్రారంభించిన అధికారులు

సాక్షి, అమరావతి బ్యూరో: రాజధానిలో దేవుని మాన్యం భూములను సైతం అక్రమార్కులు విడిచిపెట్టలేదు. తుళ్లూరు మండలం అబ్బురాజుపాలెంలోని సోమేశ్వరస్వామి మాన్యం భూములే అందుకు నిదర్శనం. ఈ ఆలయానికి చెందిన సుమారు రూ.15 కోట్ల విలువైన భూములను దేవాదాయ శాఖ ఉద్యోగే అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. దీనిపై ప్రస్తుతం అధికారులు విచారణ చేస్తున్నారు.

రాష్ట్ర రాజధానిగా అమరావతిని ప్రకటించడంతో 29 గ్రామాల పరిధిలోని భూములతో పాటు విజయవాడ, గుంటూరు నగరాల్లో స్థలాలకు డిమాండ్‌ బాగా పెరిగింది. ఈ క్రమంలో ప్రభుత్వ, ప్రైవేటు భూములతో పాటు గ్రామ కంఠాలను గుట్టుచప్పుడు కాకుండా రికార్డులు తారుమారు చేసి సొంతం చేసుకున్న సంఘటనలు అనేకం వెలుగు చూశాయి.

ఇదీ సోమేశ్వరస్వామి ఆలయం భూమి కబ్జా కథ
అబ్బురాజుపాలెంలోని సోమేశ్వరస్వామి ఆలయానికి సర్వే నంబర్‌ 96లో 7.12 ఎకరాల మాన్యం భూమి ఉంది. ఈ భూమిని మాదిరాజు సూర్యనారాయణ ఆలయానికి బహుమతిగా ఇచ్చారు. అందులో 80 సెంట్ల విస్తీర్ణంలో ఆలయం ఉంది. కొంత భూమిలో గ్రామస్తులు కొందరు నివాసాలు ఏర్పాటు చేసుకుని ఉన్నారు. మిగిలిన భూమి 1,258, 896, 780, 330 గజాల్లో బిట్లు బిట్లుగా ఉంది. ఇందులో శ్మశానానికి వదిలిన స్థలం కూడా ఉంది.

అయితే 2014, డిసెంబర్‌ 8 వరకు ఖాళీగా ఉన్న ఈ స్థలంపై రాజధాని ప్రకటన తర్వాత అక్రమార్కుల కన్నుపడింది. అనుకున్నదే తడువుగా రెవెన్యూ అధికారుల సహకారంతో అక్రమార్కులు రంగంలోకి దిగారు. ముందుగా రేకుల షెడ్లు ఏర్పాటు చేసి వాటిని అద్దెలకు ఇచ్చారు. తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సృష్టించి అమరావతి సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో 2015లో కొంత, 2016లో మరికొంత భూమిని రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు.

ఆక్రమణకు పాల్పడింది ఆ శాఖ అధికారే..
సోమేశ్వరస్వామి ఆలయం భూమిని ఆక్రమించుకుని రిజిస్ట్రేషన్‌ చేయించుకుంది దేవాదాయ శాఖలో పనిచేస్తూ పూజారిగా విధులు నిర్వహిస్తున్న వ్యక్తే కావడం విశేషం. డాక్యుమెంట్‌ నంబర్లు 367, 5404, 5225/2015ను పరిశీలిస్తే... ఆయన తొలుత సర్వే నంబరు 96లో 896 గజాలను తన తల్లి పేరున రిజిస్టర్‌ చేయించి, ఆ తర్వాత దానిని రద్దు చేయించారు. తిరిగి 326 గజాలను రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నట్లు తెలుస్తోంది. అదే సర్వే నంబర్‌లో కొంత భూమిని శ్మశానానికి కేటాయించారు.

ఆ భూమిని కూడా 2016లో రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. ఆక్రమణకు గురైన భూమి విలువ ప్రస్తుత మార్కెట్‌ ధర ప్రకారం రూ.15 కోట్లకు పైగా ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. దేవాలయ భూమి ఆక్రమణకు గురవడంపై స్థానికులు కొందరు ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన ప్రభుత్వ అధికారులు గురువారం అబ్బురాజుపాలెంలో పర్యటించి విచారణ చేపట్టారు. సోమేశ్వరాలయానికి సంబంధించిన భూములు, ఆక్రమణకు పాల్పడినవారితో పాటు గతంలో బహుమతిగా ఇచ్చిన వారి వివరాలను కూడా అడిగి తెలుసుకున్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు