రాజధాని భూముల అక్రమాలపై సిట్ దర్యాప్తు

5 Jun, 2020 09:37 IST|Sakshi

గ్రామకంఠం భూములనూ వదలని టీడీపీ నేతలు

టీడీపీ నేతల అక్రమాలకు కొమ్ముకాసిన అధికారుల పాత్రపై విచారణ

సాక్షి, విజయవాడ: రాజధాని భూముల అక్రమాల దర్యాప్తులో సిట్‌ దూకుడు పెంచింది. టీడీపీ హయాంలో ల్యాండ్ పూలింగ్ లో ఇంఛార్జ్‌లుగా పని చేసిన డిప్యూటీ కలెక్టర్లపై విచారణ చేపట్టింది. ఇప్పటికే డిప్యూటీ కలెక్టర్ మాధురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించారు. అవసరమయితే మరికొంత మందిని అదుపులోకి తీసుకుని సిట్‌ విచారించే అవకాశముందని సమాచారం. భూములు ఇచ్చేందుకు రైతులను ఒప్పించిన వారికి నజరానాగా అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేసినట్టు సిట్‌ గుర్తించింది. (డిప్యూటీ కలెక్టర్‌ మాధురి అరెస్ట్)‌

ప్రభుత్వ భూములు, కుంటలను రిజిస్ట్రేషన్లు చేసినట్టు సిట్‌ బృందం గుర్తించింది. మిగులు భూములు, అటవీ భూములు రిజిస్ట్రేషన్‌ చేసినట్లు ఆధారాలు సేకరించారు. 150 ఎకరాల భూ దందా జరిగినట్లు నిర్ధారణ అయ్యింది. డిప్యూటీ కలెక్టర్‌తో పాటు, రెవెన్యూ అధికారులు, సిబ్బంది నిర్వాకాలపై సిట్‌ అధికారులు దృష్టి పెట్టారు. గ్రామ కంఠం భూములను కూడా టీడీపీ నేతలు వదలలేదని దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం. టీడీపీ నేతల అక్రమాలకు కొమ్ము కాసిన అధికారుల పాత్రపై సిట్‌ విచారణ చేపట్టింది. దీంతో అవినీతి అధికారుల గుండెల్లో దడ మొదలైంది.

మరిన్ని వార్తలు