అప్పుడు రాజమౌళి..ఇప్పుడు దగ్గుబాటి

17 Aug, 2018 02:50 IST|Sakshi

     రాజధానిలో మీడియా సిటీ నిర్మాణంపై సినీ ప్రముఖుడు డి.సురేష్‌బాబుతో చర్చలు

     సీఆర్‌డీఏ భేటీకి ఆహ్వానం  

సాక్షి, అమరావతి: రాజధాని డిజైన్లకోసం ఇంతకుముందు సినీ దర్శకుడు రాజమౌళితో సంప్రదింపులు జరిపిన సీఎం చంద్రబాబునాయుడు తాజాగా రాజధానిలో ప్రతిపాదించిన మీడియా సిటీ నిర్మాణానికి సంబంధించి మరో సినీ ప్రముఖుడు దగ్గుబాటి సురేష్‌బాబుతో చర్చలు జరిపారు. సీఆర్‌డీఏ సమీక్షా సమావేశానికి  ఆయన్ను ఆహ్వానించి సలహాలు తీసుకున్నారు. గురువారం సచివాలయంలో జరిగిన సీఆర్‌డీఏ సమీక్ష సమావేశంలో మీడియా సిటీ నిర్మాణం, రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధి గురించి చంద్రబాబు.. సురేష్‌బాబుతో చర్చించారు. మీడియా సిటీలో 25 ఎకరాల్లో మూవీ స్టూడియో ఏర్పాటు ప్రతిపాదన గురించి సీఆర్‌డీఏ అధికారులు వివరించగా.. హైదరాబాద్‌లో కేంద్రీకృతమైన తెలుగు సినీ పరిశ్రమను రాష్ట్రంలో ఎలా అభివృద్ధి చేయాలనేదానిపై సురేష్‌బాబు సూచనలు ఇచ్చారు. సినీ, టీవీ పరిశ్రమ హైదరాబాద్‌కే పరిమితమైందని, ఏపీలోని స్థానిక నైపుణ్యతను, కళాకారులు, సాంకేతిక నిపుణులను వినియోగించుకుంటే మరో ఏడాదిన్నరలో పరిశ్రమను ఇక్కడ అభివృద్ధి చేయవచ్చని పేర్కొన్నారు. సీఎం మాట్లాడుతూ మీడియా సిటీ నిర్మాణం సృజన, కంటెంట్‌పైనే ఆధారపడబోతోందని చెప్పారు. రాజధానిలో తొమ్మిది నగరాల నిర్మాణానికి సంబంధించి తొమ్మిది కమిటీలను ఏర్పాటు చేసి వాటి అభివృద్ధికి సలహాలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

బీఎల్‌ఎఫ్‌కు రెండు దీవులు: కృష్ణా నదిలో ఉన్న ఏడు దీవుల్లో ముఖ్యమైన రెండింటిని యూఈఏకి చెందిన బిజినెస్‌ లీడర్స్‌ ఫోరమ్‌ (బీఎల్‌ఎఫ్‌)కు ఇవ్వాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రాష్ట్రప్రభుత్వం తరఫున సీఆర్‌డీఏ.. బీఎల్‌ఎఫ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందంలో భాగంగా రెండు దీవుల్లో సుమారు 500 ఎకరాల్లో గోల్ఫ్‌ కోర్స్, కన్వెన్షన్‌ సెంటర్, హోటల్‌ కాంప్లెక్స్, రిసార్ట్‌ విల్లాల ఏర్పాటుకు బీఎల్‌ఎఫ్‌ చైర్మన్‌ రామ్‌ బుక్సాని ప్రతిపాదనలిచ్చారు. సీఆర్‌డీఏ పరిధిలోని దీవుల అభివృద్ధి, సుందరీకరణ ప్రాజెక్టులు, నగరాల అభివృద్ధిలో జాప్యం లేకుండా పనులు వేగవంతం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రకాశం బ్యారేజ్‌ పరిసరాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని సూచించారు. సమావేశంలో మున్సిపల్‌ మంత్రి నారాయణ, సీఆర్‌డీఏ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్, ఏడీసీ చైర్‌పర్సన్‌ లక్ష్మీ పార్థసారథి తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు