ఉన్నతాధి(బే)కారి చేష్టలు..

5 Jul, 2019 09:34 IST|Sakshi

సాక్షి, నెల్లూరు : నెల్లూరు ఇరిగేషన్‌ కార్యాలయంలో పనిచేసే ఉన్నతాధికారి వేధింపులతో ఉద్యోగినులు ఆందోళన చెందుతున్నారు. ఆ అధికారి క్యాబిన్‌లోకి వెళ్లాలంటే మహిళలు జంకుతున్నారు. ఇరిగేషన్‌శాఖ అధికారిగా ఆయన రెండేళ్ల క్రితం బదిలీపై వచ్చారు. ఆయన బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఏడాదిపాటు తన కార్యాలయంలో పనిచేసే మహిళలను చూపులతో విసిగించేవాడు. వారిని సూటిపోటి మాటలతో ఇబ్బంది పెట్టేవాడు. ఆయన ఉన్నతాధికారి కావడంతో మహిళలు బయటకు చెప్పుకోలేక సతమతమవుతున్నారు. అవసరం లేకున్నా మహిళలను క్యాబిన్‌లోకి పిలిపించడం, హాయ్‌ మేడమ్‌.. మీ చీర బాగుంది.. మీకు డ్రస్‌ బాగాలేదు.. మీరు చీర కడితేనే చాలా బాగుంటారు.. అంటూ విసిగించేవాడు. ఉన్నతాధికారి కావడంతో ఎదురు చెబితే ఎక్కడ టార్గెట్‌ చేస్తాడోనని మహిళలు బయటకు చెప్పుకోలేక లోలోన కుమిలిపోతున్నారు.

అధికారి చేష్టలకు..
ఇరిగేషన్‌ కార్యాలయంలో సదరు విభాగంలో ఇద్దరు, ఫీల్డ్‌లో ఇద్దరు, మిగిలిన విభాగాల్లో మరో ముగ్గురు మహిళలు పనిచేస్తున్నారు. అందులో కొందరు మహిళలు ఉన్నతాధికారి వికృత చేష్టలకు ఇబ్బందిపడిన ఘటనలు అనేకం ఉన్నాయి. ఫీల్డ్‌లో ఉన్న ఓ మహిళా అధికారి అధికారి వేధింపులు తట్టుకోలేక సెలవుపై వెళ్లినట్లు తెలుస్తోంది. అర్ధరాత్రులు మహిళలకు ఫోన్లు చేయడం, వివిధ రకాలుగా మేసేజ్‌లు పెడుతూ వారికి నరకం చూపిస్తున్నాడు. నన్ను ఒక్కసారి గమనిస్తే పదోన్నతులు, ఇక్రిమెంట్లు ఇప్పిస్తానంటూ ప్రలోభాలకు గురిచేస్తున్నాడు.

మరోవైపు తన కార్యాలయాన్నే ఉన్నతాధికారి బార్‌గా మార్చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. తన క్యాబిన్‌లోనే మద్యం సేవిస్తున్నట్లుగా కొందరు ఉద్యోగులు చెబుతున్నారు. రాత్రివేళలో అర్ధరాత్రి వరకు ఉంటూ అక్కడే ఓ చిరుద్యోగి ద్వారా మద్యం తెప్పించుకొని ఎంజాయ్‌ చేస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి. గత టీడీపీ హయాంలో జిల్లాకు చెందిన మాజీ మంత్రితో ఆయనకు సాన్నిహిత్యం ఉండడంతో ఆ అధికారిపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చినా కూడా కనీస విచారణకు కూడా జరగని పరిస్థితి నెలకొంది. 
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు