జనతా కర్ఫ్యూ: పెట్రోల్‌ బంక్‌లు బంద్‌

21 Mar, 2020 18:26 IST|Sakshi

సాక్షి, అమరావతి: ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు జనతా కర్ఫ్యూకి ఏపీ ఫెడరేషన్‌ ఆఫ్‌ పెట్రోలియం ట్రేడర్స్‌ (ఏపీఎఫ్‌పీటీ) మద్దతు ప్రకటించింది. కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడం కోసం ఆదివారం ఉదయం 7.00 నుంచి రాత్రి 9.00 గంటల వరకు దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ విధించనున్నారు. ఆ రోజు ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా 3 వేల పెట్రోల్‌ బంకులను మూసి వేస్తూ సిబ్బందికి సెలవులు ప్రకటించినట్లు ఏపీఎఫ్‌పీటీ అధ్యక్షుడు రావి గోపాలకృష్ణ తెలిపారు. ప్రభుత్వ వాహనాలు, అంబులెన్స్‌ల కోసం ప్రతి పెట్రోల్‌ బంక్‌లో ఒకరిద్దరు సిబ్బందిని ఉంచుతున్నట్లు చెప్పారు.  

ఏప్రిల్‌ 5 వరకు ఎల్‌ఎల్‌ఆర్‌ పరీక్షలు రద్దు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా రవాణా శాఖ ఏప్రిల్‌ 5వ తేదీ వరకు లెర్నింగ్‌ లైసెన్సు పరీక్షలను రద్దు చేసింది. ఈ మేరకు ఆ శాఖ కమిషనర్‌ పీఎస్సార్‌ ఆంజనేయులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్‌ 5 తర్వాత అప్పటి పరిస్థితిని బట్టి రద్దు నిర్ణయాన్ని పొడిగించాలా? లేదా? అన్నది పరిశీలిస్తామన్నారు. కార్యాలయాలకు వచ్చే సందర్శకుల సంఖ్య తగ్గించేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఉద్యోగులు జ్వరం, జలుబు, దగ్గు వంటి లక్షణాలతో బాధపడుతుంటే సెలవు తీసుకుని చికిత్స కోసం వెళ్లాలని స్పష్టం చేశారు.

31 వరకు ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీ బంద్‌
విజయవాడ (హెల్త్‌ యూనివర్సిటీ): రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న కోవిడ్‌–19 నివారణ చర్యల్లో భాగంగా డాక్టర్‌ ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీకి ఈనెల 31వ తేదీ వరకు సెలవులు ప్రకటించారు. అన్ని విభాగాల కార్యకలాపాలు రద్దు చేశామని యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ కె.శంకర్‌ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. అత్యవసర పరిస్థితిలో ఉద్యోగులు ఎప్పుడంటే అప్పుడు యూనివర్సిటీకి అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీలోని ఏపీ మెడికల్‌ కౌన్సిల్‌కు సెలవులు ప్రకటించే విషయంలో శుక్రవారం వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. విదేశాల్లో ఎంబీబీఎస్‌ చదివిన విద్యార్థులు రిజిస్ట్రేషన్, సమాచారం కోసం వస్తుండడంతో మెడికల్‌ కౌన్సిల్‌ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.   

ఇంటర్మీడియెట్‌ మూల్యాంకనం వాయిదా
సాక్షి, అమరావతి: కోవిడ్‌–19 వైరస్‌ నేపథ్యంలో ఇంటర్మీడియెట్‌ పరీక్షల మూల్యాంకన ప్రక్రియను వాయిదా వేస్తున్నట్లు ఆ బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 21 నుంచి 31వ తేదీ వరకు సెలవులు ప్రకటించారు. స్పాట్‌ వాల్యుయేషన్‌ తేదీలను తరువాత వెల్లడిస్తామన్నారు.

శారదాపీఠం తాత్కాలికంగా మూసివేత
పెందుర్తి: కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా విశాఖ జిల్లా చినముషిరివాడలోని శ్రీ శారదా పీఠాన్ని తాత్కాలికంగా మూసివేస్తు న్నట్లు ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీ ఓ ప్రకటనలో తెలిపారు. పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ ఆదేశాల మేరకు వివిధ  రాష్ట్రాల్లోని పీఠ పాలిత ఆలయాలు, ఆశ్రమాల్లో సర్వదర్శనాలు నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు.   

మరిన్ని వార్తలు