వైఎస్సార్సీపీ జోష్

13 Mar, 2014 03:03 IST|Sakshi
వైఎస్సార్ సీపీ జోష్

జిల్లాలోని తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలకు షాక్ తగిలింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగర్జన పేరిట నగరంలో బహిరంగ సభ నిర్వహించిన బుధవారంనాడే ఆ పార్టీని ఏళ్ల తరబడి వెన్నంటి ఉన్న నగరానికి చెందిన గుడివాడ కుటుంబం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేర డం గమనార్హం.

నగరానికి చెందిన టీడీపీ దివంగత నేత, మాజీ మంత్రి గుడివాడ గురునాథరావు భార్య గు డివాడ నాగమణి, కుమారుడు, 65వ వార్డు మాజీ కార్పొరేటర్ గుడివాడ అమర్‌నాథ్, గురునాథరావు సోదరుడు అప్పలరామయ్యతో కలిసి   కుటుంబమంతా హైదరాబాద్‌లో వైఎస్సార్ సీపీ అధినేత జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో జగన్‌ను సీఎం చేసేందుకు తమ శాయశక్తులా కృషి చేస్తామన్నారు. ఏళ్ల తరబడి టీడీపీకి సేవ చే సినా.. వెన్నుపోటుదారులు, స్వార్థపరులకు ఆశ్రయం కల్పించి, నమ్ముకున్నవారిని నట్టేట ముంచే సంస్కృతి చంద్రబాబునాయుడుదని, అందుకే ఆ పార్టీలో ఇమడలేకపోయామన్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి జిల్లా, నగరంలో కూడా కోలుకోలేని దెబ్బ తగిలింది.

.పశ్చిమ నియోజక వర్గం ఎమ్మెల్యే, వెల్ఫేర్ సంస్థల అధినేత మళ్ల విజయప్రసాద్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, మాడుగుల మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఆ పార్టీని వీడారు. బుధవారం హైదరాబాద్ వెళ్లి జగన్ సమక్షంలోనే వైఎస్సార్ సీపీలో చేరారు. రాష్ట్ర విభజనలో కాంగ్రెస్ పార్టీ వైఖరికి వ్యతిరేకంగానే ఆ పార్టీని వీడామని, సమైక్య రాష్ట్రం కోసం ఆది నుంచీ కృషి చేసిన ఏకైక వ్యక్తి వై.ఎస్.జగనేనని కొనియాడారు. సీట్లతో సంబంధం లేకుం డా జిల్లాలో పార్టీని విజయపథాన నడిపించి, జగన్‌ను సీఎం పీఠంపై కూర్చోబెడతామని ధీమా వ్యక్తం చేశారు. తాజా చేరికలతో ఇటు నగరం, అటు జిల్లాలో వైఎస్సా ర్ సీపీ శ్రేణుల్లో ఉత్సాహం మరింత ఉరకలేస్తోంది.

పార్టీలో చేరిన ఈ నేతలతోపాటు పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త కొణతాల రామకృష్ణ, జిల్లా అధ్యక్షుడు చొక్కాకుల వెంకటరావు, నియోజకవర్గ సమన్వయకర్తలు గండి బాబ్జీ, చెంగల వెంకట్రావు, పూడి మంగపతిరావు, బూడి ముత్యాలునాయుడు, ప్రగడ నాగేశ్వరరావు తదితరులున్నారు.
 
 

మరిన్ని వార్తలు