టీడీపీకి జ్యోతుల గుడ్‌ బై

17 Aug, 2017 14:40 IST|Sakshi
టీడీపీకి జ్యోతుల గుడ్‌ బై

జగ్గంపేట: తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. జగ్గంపేట నియోజకవర్గ నాయకుడు జ్యోతుల చంటిబాబు గురువారం టీడీపీ గుడ్‌ బై చెప్పారు. టీడీపీ సభ్యత్వానికి, ఏలేరు ప్రాజెక్టు కమిటీ చైర్మన్‌ పదవికి ఆయన రాజీనామా చేశారు. భవిష్యత్‌ కార్యాచరణ నిర్ణయించేందుకు తన మద్దతుదారులతో ఆయన మంతనాలు జరుపుతున్నారు.

టీడీపీలోకి జ్యోతుల నెహ్రు పునరాగమనంపై ఆయన అసంతృప్తిగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. వైఎస్సార్‌ సీపీ జెండాపై ఎమ్మెల్యేగా గెలిచి టీడీపీలో చేరిన జ్యోతుల నెహ్రు, ఆయన కుమారుడు జ్యోతుల నవీన్‌ పెత్తనం పెరగడంతో ఆయన పార్టీలో ఇమడలేకపోయారని వార్తలు వస్తున్నాయి. తన పట్ల పార్టీ అధినేత చంద్రబాబు అవలంభిస్తున్న వైఖరి, గత కొంతకాలంగా తనను పట్టించుకోకపోవడంతో ఆయన అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. తన తండ్రి చనిపోయినా టీడీపీ నేతలెవరూ కనీసం సానుభూతి తెలపకపోవడం ఆయనను ఆవేదనకు గురిచేసింది. పురుషోత్తంపట్నం ప్రాజెక్టు పనులను సీఎం ప్రారంభించిన సందర్భంగా నిర్వహించిన సభకు తనను ఆహ్వానించకపోవడంతో ఆయన కలత చెందినట్టు తెలుస్తోంది.

ఈ పరిణామాల నేపథ్యంలో తనకు తనకు ప్రాధాన్యత లేదన్న భావంతో టీడీపీకి చంటిబాబు రాజీనామా చేశారు. మరోవైపు కాపుల రిజర్వేషన్ల కోసం ఉద్యమిస్తున్న ముద్రగడ పద్మనాభం పట్ల చంద్రబాబు సర్కారు అవలంభిస్తున్న వైఖరికి నిరసనగా కాపు నేతలు టీడీపీని వీడుతున్నారన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. కాకినాడ కార్పొరేషన్‌ ఎన్నికల పోలింగ్‌ దగ్గరపడుతున్న సమయంలో తాజా పరిణామాలు అధికార పార్టీ నాయకులకు చెమటలు పట్టిస్తున్నాయి.