ఎస్సీలంటే అంత చులకనా?

26 May, 2018 13:03 IST|Sakshi
సరోగసి బాధితురాల్ని పరామర్శిస్తున్న రాములు

దళిత మహిళ మోసపోయినా చలించరు..

సమస్యలతో వేగుతున్నా పట్టని రాష్ట్ర ప్రభుత్వం

వస్తున్నానని చెప్పినా జాడ లేని కలెక్టర్, సీపీ

ధ్వజమెత్తిన జాతీయ ఎస్సీ కమిషన్‌ సభ్యుడు రాములు

సరోగసి బాధితురాలు నాగలక్ష్మికి పరామర్శ

పాతపోస్టాఫీసు (విశాఖ దక్షిణం):  ఎస్సీల బాధల పట్ల రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదు.. వీరికి ఎటువంటి ప్రాధాన్యం ఇవ్వడం లేదు.. నేను వస్తున్నానని చెప్పినా జిల్లా కలెక్టర్, పోలీస్‌ కమిషనర్‌ రాకపోవడంలోనే పరిస్థితి అర్థం అవుతోంది.. అంటూ జాతీయ ఎస్సీ కమిషన్‌ సభ్యుడు కె.రాములు ధ్వజమెత్తారు. పద్మజా ఆసుపత్రిలో తనను మోసం చేసి గర్భంలో రెండు పిండాల్ని ప్రవేశపెట్టారంటూ నేతల నాగలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న ఆమెను రాములు శుక్రవారం పరామర్శించారు. దీనికి ముందు ఆసుపత్రి సూపరింటెండెంట్‌ కార్యాలయంలో మహిళా సంఘాలు, ప్రజా సంఘాల నుంచి వివరాలు సేకరించి, బాధితురాలి ఆరోగ్య పరిస్థితిని ఆరా తీశారు. అనంతరం బాధితురాల్ని పరామర్శించి విలేకరులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేద, దళిత మహిళను మోసం చేయడం అన్యాయమన్నారు.

ఇప్పటికే ముగ్గురు బిడ్డలకు తల్లి అయిన బాధితురాలు నాగలక్ష్మి తిరిగి ఎలా గర్భం ధరించేందుకు ఒప్పుకుంటుందని ప్రశ్నించారు. ఉష అనే అమ్మాయి వీరి ఆర్థిక పరిస్థితిని ఆసరాగా చేసుకుని పద్మశ్రీ ఆసుపత్రి ఎండీ పద్మశ్రీతో కుమ్మక్కై నాగలక్ష్మిని మోసం చేశారనన్నారు. నాగలక్ష్మికి ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే ఆమె గర్భంలో రెండు పిండాల్ని ప్రవేశపెట్టడం అన్యాయమన్నారు. ఇటువంటి ద్రోహానికి పాల్పడిన వైద్యురాలు పద్మశ్రీపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్‌ ప్రకారం కేసు నమోదు చేస్తామన్నారు. బాధితురాలకి ప్రభుత్వం నష్టపరిహారంగా రూ.8 లక్షలు, ఇంట్లో ఒకరికి ఉద్యోగం, ప్రభుత్వ గృహం మంజూరు చేయడంతోపాటు ఆమె సంతానం అయిన ముగ్గురికి సాంఘిక శాఖ ద్వారా ఉచిత విద్య అందించాలని డిమాండ్‌ చేశారు. ఐదుగురు సభ్యులతో కూడిన విచారణ కమిటీ వేయాలని, 24 గంటల్లో పూర్తి స్థాయి సమాచారం అందించాలని అధికారులను ఆదేశించారు.

ఐదుగురు సభ్యులతో విచారణ కమిటీ ఏర్పాటు
జాతీయ ఎస్సీ కమిషన్‌ సభ్యుడు రాములు ఆదేశానికి స్పందించిన కేజీహెచ్‌ సూపరింటెండెంట్‌ ఐదుగురు సభ్యులతో కూడిన విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. ఆంధ్ర వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పి.వి.సుధాకర్, కేజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ జి.అర్జున, జిల్లా వైద్య,ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ ఆర్‌.రమేష్, కృష్ణా ఆసుపత్రి ప్రసూతి వైద్య నిపుణులు డాక్టర్‌ జి.ఎ.రామరాజు, ప్రభుత్వ విక్టోరియా (ఘోషా) ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ డి.హేమలతాదేవి కమిటీలో సభ్యులుగా ఉంటారు.

నా అనుమతి లేకుండా పిండాల్ని ప్రవేశపెట్టారు
భర్తగా నా అనుమతి లేకుండా నా భార్య నాగలక్ష్మి గర్భంలో ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్‌ పద్మశ్రీ రెండు పిండాలను ప్రవేశపెట్టారు. ఎటువంటి అనుమతులు లేకుండా ఇలా చేయడం అన్యాయం. ఇటీవల కుటుంబంలో వచ్చిన కలహాల వల్ల నేను నా స్వంత ఊరు రాజాం వెళ్లి ఉంటున్నాను తప్ప నా భార్యను వదిలేయలేదు. మా ఆర్థిక స్థితి బాగులేకపోవడంతో నా భార్యను మోసం చేసి ఇలా చేసారు. ఇప్పటికే ముగ్గురు పిల్లలు ఉన్న నా కుటుంబం తిరిగి మరొ ఇద్దరిని (తండ్రి ఎవరో తెలియని) ఎలా పెంచగలను. నా కుటుంబానికి తగిన న్యాయం చేయాలి.-నేతల ఆదినారాయణ, బాధితురాలు నాగలక్ష్మి భర్త

మరిన్ని వార్తలు