బోటు వెలికితీత నేడు కొలిక్కి!

21 Oct, 2019 04:33 IST|Sakshi

ప్రమాద స్థలిలో పైకి తేలిన మరో మృతదేహం

రంగంలోకి దిగిన విశాఖ మెరైన్‌ డైవర్లు

రంపచోడవరం/దేవీపట్నం/కాకినాడ రూరల్‌: దేవీపట్నం మండలం కచ్చులూరు మందం వద్ద గోదావరిలో మునిగిపోయిన రాయల్‌ వశిష్ట పున్నమి బోటును వెలికితీసే పనులు సోమవారం కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. విశాఖ నుంచి వచ్చిన మెరైన్‌ డైవర్లు ఆదివారం నదీ గర్భంలో చిక్కుకున్న బోటు వద్దకు పలుమార్లు వెళ్లి వచ్చారు. ఈ సందర్భంలో గుర్తు తెలియని మృతదేహం ఒకటి ప్రమాద ప్రాంతంలో పైకి తేలింది. నల్ల జీన్‌ ప్యాంట్, తెల్ల టీషర్ట్‌తో ఉన్న ఆ మృతదేహం ఎవరిదనేది గుర్తించాల్సి ఉంది.

ఇదిలావుంటే.. నదీ గర్భంలోకి వెళ్లిన మెరైన్‌ డైవర్లు నీటి అడుగున బోటు ఏ పరిస్థితిలో ఉంది, ఎంత లోతులో ఉందనే విషయాలను కనుగొని అధికారులకు, ధర్మాడి సత్యం బృందానికి వివరించారు. నీటి అడుగున 40 అడుగుల లోతులో బోటు ఉన్నట్లు గుర్తించారు. బోటు ముందు భాగం 35 అడుగుల లోతున నదీ ప్రవాహానికి అడ్డంగా ఉందని, వెనుక భాగం 70 అడుగుల లోతులో ఉందని మెరైన్‌ డైవర్స్‌ అంచనా వేశారు. బోటు ముందు భాగం కొంతమేర బురదలో కూరుకుపోయినట్లు గుర్తించారు. బోటు మునిగిన ప్రాంతమైన కచ్చులూరు మందం నుంచి దాదాపు వంద మీటర్ల దిగువకు కొట్టుకెళ్లిందని తెలిపారు.

బోటు వెలికితీత పనులు చేపట్టిన ప్రతిసారి కచ్చులూరు మందం వద్ద భారీగా వర్షం పడుతుండటంతో వెలికితీత పనులకు ఆటంకం కలుగుతోంది. నదీ గర్భంలోని బోటుకు ముందు భాగంలో ఐరన్‌ రోప్‌ చుట్టేందుకు ఆదివారం మెరైన్‌ డైవర్లు ప్రయత్నించగా.. వర్షం వల్ల ఆటంకం ఏర్పడింది. భారీగా వర్షం కురవడంతో సాయంత్రం 5 గంటలకు పనులను నిలిపివేశారు. తిరిగి సోమవారం పనులు ప్రారంభిస్తారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే.. సోమవారం బోటును వెలికితీసే పని పూర్తవుతుందని ధర్మాడి సత్యం బృందం, మెరైన్‌ డైవర్లు చెప్పారు.

బోటు వెలికితీతలో ప్రగతి
రాయల్‌ వశిష్ట పున్నమి బోటు వెలికితీతలో ప్రగతి కనిపిస్తోందని రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖల మంత్రి కురసాల కన్నబాబు చెప్పారు. కాకినాడ ఏపీఎస్పీలో విలేకరులతో ఆదివారం ఆయన మాట్లాడారు. గోదావరిలో వరద నీటి ఉధృతి ఎక్కువగా ఉండటం, భారీ సుడిగుండాల వల్ల బోటును బయటకు తీయడం సాధ్యం కాలేదని చెప్పారు. ధర్మాడి సత్యం బృందం 15 రోజులుగా దీనిని వెలికితీసేందుకు శ్రమిస్తోందన్నారు. ఎంత ఖర్చయినా బోటును వెలికితీయాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారన్నారు. ఇందుకోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. సత్యం బృందానికి బోటు ఆనవాళ్లు లభించాయని, విశాఖ నుంచి మెరైన్‌ డైవర్లను రప్పించి బోటుకు లంగర్లు అమర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. బోటును తప్పకుండా బయటకు తీస్తామన్నారు.

మరిన్ని వార్తలు