కాపు రుణాలు తమ్ముళ్లకే...

24 Feb, 2016 03:38 IST|Sakshi
కాపు రుణాలు తమ్ముళ్లకే...

* లబ్ధిదారులకు మొండిచేయి
* టీడీపీ నేతల సిఫారసు లేఖలు
* జాబితాలో ఉన్న వారికే రుణాలు
* అడ్డదారిలో దరఖాస్తుల పరిశీలన


సాక్షి ప్రతినిధి, నెల్లూరు: అధికారపార్టీ నేతల పైరవీలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. వృద్ధులు, వికలాంగుల పింఛన్లు.. రేషన్‌కార్డులు.. వరద పరిహారం.. ఇలా గ్రామాల్లో పనులు కావాలంటే టీడీపీ నేతలు చెప్పిన వారికే ఇస్తున్నారు. అర్హతలు పక్కనపెట్టి వారి సిఫారసు లేఖలకే ప్రాధాన్యం ఇస్తుండటంపై లబ్ధిదారులు మండిపడుతున్నారు.

తాజాగా కాపుల పేరున మంజూరైన బ్యాంకు రుణాలు సైతం టీడీపీ నేతలు, అనుచరులు, కార్యకర్తలు పంచుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. తునిలో జరిగిన కాపు ఉద్యమంతో టీడీపీ ప్రభుత్వం ఆ సామాజికవర్గం నుంచి వ్యతిరేక రాకుండా ఉండేందుకు సబ్సిడీ రుణాలు ప్రకటించింది. జిల్లా మొత్తానికి 2,462 మంది కాపు, తెలగ, ఒంటరి, బలిజ సామాజికవర్గీయులకు సబ్సిడీ రుణాలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. రూ.లక్ష సబ్సిడీతో రూ.7కోట్లు వారికి ఇవ్వటానికి సర్కారు నిర్ణయించింది.

అయితే జిల్లావ్యాప్తంగా 12,508 మంది దరఖాస్తు చేసుకున్నారు. అలా వచ్చిన దరఖాస్తులను మంగళవారం పరిశీలించారు. అయితే ఆ రుణాలు కూడా నిజమైన లబ్ధిదారులకు ఇవ్వకుండా అడ్డదారిలో టీడీపీ నేతలే దండుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
 టీడీపీ నేతలు సిఫారసు లేఖలు : కాపుల పేరుతో మంజూరైన రుణాలు మొత్తాన్ని టీడీపీ నేతలు, కార్యకర్తలు అడ్డదారిలో మంజూరు చేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అందులోభాగంగా మంగళవారం జిల్లావ్యాప్తంగా ఉన్న టీడీపీ నేతలు వారి వారి అనుచరుల పేర్లతో కూడిన సిఫారసు లేఖలను అధికారులకు పంపినట్లు తెలిసింది.

అదేవిధంగా మంగళవారం దరఖాస్తు పరిశీలనలోనూ టీడీపీ నేతల అనుచరులవే ముందుగా చూసి పంపేశారు. ఉదయం నుంచి క్యూలైన్లో వేచి ఉన్నవారిని పక్కనపెట్టేశారు. దీంతో అనేకమంది లబ్ధిదారులు సాయంత్రం వరకు క్యూలైన్లో వేచి ఉండాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే దరఖాస్తుల పరిశీలనకు 21 బ్యాంకులు, 65 బ్రాంచ్‌లకు సంబంధించిన అధికారులు హాజరుకావాల్సి ఉంది. అయితే దరఖాస్తుల పరిశీలనలో కేవలం 25 మంది అధికారులు మాత్రమే కనిపించారు. మిగిలిన వారు హాజరుకాకపోవటంతో దరఖాస్తుదారులు గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది.
 
అనర్హులకే పెద్దపీట: కాపు రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో అనేకమంది అనర్హులే ఉన్నారు. ధనవంతులు అనేకమంది దరఖాస్తు పరిశీలనకు రావటం కనిపించింది. వారంతా టీడీపీ నేతలు, వారి బంధువులు, కార్యకర్తలు ఉన్నారు. అలావచ్చిన వారికే బ్యాంకర్లు కూడా పెద్దపీట వేశారని విమర్శలు వినిపిస్తున్నా యి. ప్రస్తుతం జరుగుతున్న తంతు చూస్తుంటే కాపు రుణాలు నిజమైన లబ్ధిదారులకు అందేలా కనిపించలేదని నెల్లూరుకు చెందిన రమణరావు ఆందోళన వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు