‘గుజరాత్‌ నుంచి బ్యూటాయిల్‌ ఆల్కహాల్‌ తెప్పిస్తున్నాం’

7 May, 2020 14:31 IST|Sakshi

సాక్షి, అమరావతి : విశాఖపట్నం జిల్లాలోని ఎల్‌జీ పాలిమర్స్‌ పరిశ్రమలో చోటుచేసుకున్న గ్యాస్‌ లీకేజీ ప్రస్తుతం అదుపులో ఉందని పరిశ్రమల  శాఖ స్పెషల్‌ సీఎస్‌ కరికాల వలవన్‌ తెలిపారు. గురువారం సచివాలయంలో ఆయన మాట్లాడుతూ.. అందరూ నిద్రపోతుండగా ఈ దుర్ఘటన జరిగిందని చెప్పారు. విషవాయువుతో సమీప గ్రామ ప్రజలు అస్వస్థతకు గురయ్యారని.. సమాచారం అందిన వెంటనే చర్యలు చేపట్టినట్టు వెల్లడించారు. ఇళ్లల్లో ఉన్నవారిని డోర్‌లు పగలగొట్టి బయటకు తీసుకువచ్చామని వివరించారు. గతంలో ఇలాంటి ఘటన ఎప్పుడూ జరగలేదని గుర్తుచేశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తున్నట్టు చెప్పారు. (చదవండి : విశాఖ ఎల్‌జీ పాలిమర్స్‌లో భారీ ప్రమాదం)

గుజరాత్‌ నుంచి విమానంలో బ్యూటాయిల్‌ ఆల్కహాల్‌ తెప్పిస్తున్నామని ఆయన చెప్పారు. ఇందుకోసం గుజరాత్‌ పరిశ్రమల శాఖ అధికారులతో సంప్రదిస్తున్నామని తెలిపారు. ఈ ప్రమాదానికి పరిశ్రమ యాజమాన్యం బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. రక్షణ చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పరిశ్రమ యాజమాన్యంపైనే ఉంటుందని స్పషం చేశారు. (చదవండి : గ్యాస్‌ లీక్‌ బాధితులను పరామర్శించిన సీఎం జగన్‌)

మరిన్ని వార్తలు