కౌడిపల్లి నుంచి ‘తెలంగాణ పల్లె ప్రగతి’

8 Feb, 2015 01:58 IST|Sakshi
కౌడిపల్లి నుంచి ‘తెలంగాణ పల్లె ప్రగతి’
  • రూ.10 లక్షలతో పైలాన్ ఏర్పాటు
  •  13న ఆవిష్కరించనున్న పంచాయతీరాజ్ మంత్రి కేటీఆర్
  • సాక్షి, హైదరాబాద్: సమీకృత గ్రామీణాభివృద్ధి లక్ష్యంగా చేపట్టిన‘తెలంగాణ పల్లె ప్రగతి’ కార్యక్రమాన్ని మెదక్ జిల్లా కౌడిపల్లి నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రూ.10 లక్షలతో కౌడిపల్లిలో ఏర్పాటు చేయనున్న‘ పల్లె ప్రగతి పైలాన్’ను 13న పంచాయతీరాజ్ మంత్రి కె.తారకరామారావు ఆవిష్కరించనున్నారు. ప్రపంచబ్యాంకు ఆర్థిక సాయంతో చేపట్టిన ఈ పథకం కింద తొమ్మిది జిల్లాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు గాను మొత్తం రూ.653 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ.203 కోట్లు కాగా, ప్రపంచ బ్యాంకు రుణం రూ.450 కోట్లు. ఈ పథకం అమలు కోసం 150 మండలాలను ఎంపిక చేశారు. ఈ మండలాల్లో 1,950 గ్రామాలు, 10,600 పునరావాస ప్రాంతాలున్నట్లు అధికారులు తెలిపారు.
     
    పల్లె ప్రగతి ఇలా...

    ఎంపిక చేసిన గ్రామాల్లో సుమారు 2.5 లక్షల ఉత్పత్తిదారుల సంఘాలను ఏర్పాటు చేసి వారికి అధునాతన వ్యవసాయ పద్ధతులు, మార్కెటింగ్ మెళకువల్లో శిక్షణ ఇప్పించనున్నారు. గ్రామాల్లో ప్రధానంగా ఆధారపడే పాడిపరిశ్రమ, గొర్రెలు, మేకల పెంపకంతో పాటు వరి, తృణధాన్యాల ఉత్పత్తి.. తదితర అంశాల్లో వారికి చేయూతనందించనున్నారు. రైతు సంఘాల ఉత్పత్తులను విక్రయించేందుకు కృషి మార్టులను ఏర్పాటు చేయనున్నారు. గిట్టుబాటు ధర లభించేలా, వారికి మార్కెటింగ్ సదుపాయాలను (రూరల్ అవుట్‌లెట్స్) కల్పిస్తారు. మానవ అభివృద్ధి సూచికలను పెంచే ప్రణాళికలో భాగంగా ఆయా గ్రామాల్లోని మహిళలకు సరైన పౌష్టికాహారం అందేలా చర్యలు చేపడతారు.
     
    గ్రామాల్లోనూ ‘వన్ స్టాప్ షాప్’

    గ్రామాల్లో ప్రజలకు వివిధ రకాల సేవలన్నీ ఒకేచోట లభించేలా సమగ్ర పౌర సేవా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. వెయ్యి గ్రామాల్లో ప్రత్యేక కియోస్క్‌లను ఏర్పాటు చేస్తారు. మీ సేవాకేంద్రాల్లో అదించే సాధారణ సేవలతో పాటు అదనంగా.. నగదు బదిలీ సేవలను, ఉపాధి హామీ చెల్లింపులను, పింఛన్లను కూడా వీటిద్వారా పొందవచ్చు. వివిధ ప్రభుత్వ విభాగాలకు ప్రజలు ఇచ్చే అర్జీలు, ఫిర్యాదులు కూడా ఈ కేంద్రాల్లోనే స్వీకరిస్తారు. మహిళా సాధికారతను పెంపొందించే దిశగా.. ఆయా కేంద్రాల నిర్వహణ బాధ్యతలను స్థానికంగా విద్యావంతులైన మహిళలకే అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

>
మరిన్ని వార్తలు