ప్రకాశం సిగలో మరో మణిహారం..

8 Mar, 2019 10:42 IST|Sakshi
ఒంగోలులోని కేంద్రీయ విద్యాలయం

సాక్షి, కందుకూరు: ప్రకాశం జిల్లా సిగలో కేంద్రీయ విద్యాలయం మరో మణిహారంగా నిలవనుంది. కందుకూరు పట్టణంలో కేంద్రీయ విద్యాలయం ప్రారంభానికి ఎట్టకేలకు అనుమతులు వచ్చాయి. ఈ మేరకు న్యూఢిల్లీలోని కేంద్రీయ విద్యాలయాల అడిషనల్‌ కమిషనర్‌ నుంచి జిల్లా కలెక్టర్‌కు ఉత్తర్వులు అందాయి. ఇప్పటికే జిల్లా కేంద్రంలో ఒక కేంద్రీయ విద్యాలయం ఉండగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి కందుకూరులో విద్యాలయం ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.  
ఆసియాలోనే అతి పెద్ద రెండో రెవెన్యూ డివిజన్‌ కందుకూరుకు కేంద్రీయ విద్యాలయం మంజూరైంది. దీని కోసం రెండేళ్ల క్రితమే నెల్లూరు పార్లమెంట్‌ సభ్యుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి పక్కా ప్రణాళికలు రూపొందించిన విషయం తెలిసిందే. ఎంపీ చొరవతో స్థానిక బాలురు ఉన్నత పాఠశాల ఆవరణలోని మాగుంట సుబ్బరామరెడ్డి జూనియర్‌ కాలేజీలో తాత్కాలికంగా కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ఎంపీ స్వయంగా అదనపు తరగతి గదులు నిర్మించడంతో పాటు విద్యాలయం ప్రారంభానికి అవసరమైన అన్ని మౌలిక వసతులను కల్పించారు.

ఈ క్రమంలో ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్రీయ విద్యాలయాల అధికారులు పలుమార్లు తాత్కాలిక భవనాలు, తరగతి గదులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. గతేడాదే కేంద్రీయ విద్యాలయం ప్రారంభం అవుతుందని అంతా భావించారు. పలు సాంకేతిక కారణాలతో కేంద్రం నుంచి అనుమతులు రాకపోవడంతో వాయిదా పడుతూ వచ్చింది. ఈ క్రమంలో కందుకూరుకు కేంద్రీయ విద్యాలయం మంజూరు చేస్తూ కేంద్ర మానవ వనరుల శాఖ అనుమతి ఇచ్చింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌కు ఉత్తర్వులు రావడంతో వచ్చే విద్యా సంవత్సరం నుంచి కేంద్రీయ విద్యాలయం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కందుకూరు పట్టణంలో మరో ప్రతిష్టాత్మక విద్యా సంస్థ ఏర్పాటుకు లైన్‌ క్లియరైంది. 

నాణ్యమైన విద్యకు ప్రామాణికం 
అత్యుత్తమ విద్యాబోధనకు కేంద్రీయ విద్యాలయాలు నిలయాలుగా ఉంటున్నాయి. పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ విద్యాలయాల్లో సీబీఎస్‌సీ సిలబస్‌తో పూర్తిగా ఇంగ్లిష్‌ మీడియంలో విద్యాబోధన సాగుతుంది. ఫస్టుక్లాస్‌ నుంచి 5వ తరగతి వరకు ప్రస్తుతం క్లాసులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత అదనపు తరగతులు పెంచుకుంటూ ఉంటారు. ఇలా ఇంటర్‌ వరకు కేంద్రీయ విద్యాలయాల్లో బోధన చేస్తారు. కందుకూరు ప్రాంతంలో గ్రామీణ విద్యార్థులకు అత్యుత్తమ విద్యా సంస్థ అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం విద్యాలయం మంజూరైనా బోధన, బోధనేత సిబ్బంది నియామకం జరగాల్సి ఉంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

శాశ్వత భవనాలు టీఆర్‌ఆర్‌ కాలేజీ గ్రౌండ్‌లో.. 
ప్రస్తుతం కేంద్రీయ విద్యాలయ ఏర్పాటుకు మాగుంట సుబ్బరామిరెడ్డి జూనియర్‌ కాలేజీలో తాత్కాలిక భవనాలు, తరగతి గదులు ఏర్పాటు చేసినా శాశ్వత భవనాలు మాత్రం స్థానిక టీఆర్‌ఆర్‌ కాలేజీ గ్రౌండ్‌లో నిర్మించనున్నారు. ఇప్పటికే కేంద్రీయ విద్యాలయ అధికారులు ఆ స్థలాలను పరిశీలించి వెళ్లారు. రెవన్యూ అధికారులు సైతం టీఆర్‌ఆర్‌ కాలేజీ ఆవరణలో స్థలాన్ని సరిహద్దులు నిర్ణయించి కేంద్రీయ విద్యాలయాలకు అందించారు. 
 

మరిన్ని వార్తలు