బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం

24 Aug, 2013 03:47 IST|Sakshi
తాడేపల్లి, న్యూస్‌లైన్: తాడేపల్లిలో జరిగిన నాలుగు ఏళ్ల బాలుడి కిడ్నాప్ ఉదంతం పోలీసులు రంగప్రవేశంతో సుఖాంతమైంది. వివరాల్లోకి వెళితే... పట్టణ పరిధిలోని కె.ఎల్.రావు కాలనీకి చెందిన పున్నయ్య తమ పిల్లలతోపాటుగా తమ్ముడి కుమారుడు రుత్విక్‌ను పెంచుకుంటున్నాడు. గురువారం సాయంత్రం 4 గంటలకు ఇంటి బయట రోడ్డుపై ఆడుకుంటుండగా గుర్తు తెలియని వ్యక్తి ద్విచక్రవాహనంపై బాలుడిని తీసుకెళ్లడం గమనించిన చుట్టుపక్కల వారు బాలుడు పెద్దమ్మ మరియమ్మకు తెలిపారు. ఆ సమయంలో భర్త ఊళ్లో లేకపోవడంతో స్థానికుల సహాయంతో పోలీసులను ఆశ్రయించింది.
 
 పకాశం బ్యారేజి వద్ద వున్న పోలీస్ అవుట్‌పోస్టులోని సీసీ కెమేరాలను పరిశీలించారు. సమాచారం లభించక మరియమ్మ తాడేపల్లి ఠాణాకు చేరుకుని ఫిర్యాదు చేసింది. బాలుడి అమ్మమ్మ తరపున బంధువులపై ఆమె అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. గురువారం రాత్రి తాడేపల్లి ఎస్‌ఐ చింతా రవిబాబు తన సిబ్బంది, మరియమ్మతో కలిసి బాలుడి అమ్మమ్మ మేరిలూసి ఉంటున్న కృష్ణా జిల్లా ఏ.కొండూరు మండలం రేపూడి గ్రామానికి చేరుకున్నారు. అక్కడ బాలుడు కనిపించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు విచారించగా బాలుడిని తన పెద్ద కూతురి భర్త నాగేశ్వరరావు అలియాస్ దావీదు తీసుకువచ్చినట్టు మేరిలూసీ తెలిపింది. 
 
 ఈ మేరకు మైలవరంలో నివాసం వుంటున్న నాగేశ్వరరావును పోలీసులు అదుపులోకి తీసుకుని తాడేపల్లి పోలీసుస్టేషన్‌కు తరలించారు. అనంతరం మంగళగిరి రూరల్ సీఐ టి.మురళీకృష్ణ ఆధ్వర్యంలో రుత్విక్‌ను  శుక్రవారం ఉదయం మరియమ్మకు అప్పగించారు. గతంలో రుత్విక్‌ను పెంచుకుంటున్నామని నాగేశ్వరరావు ప్రతిపాదించడంతో అందుకు పున్నయ్య, మరియమ్మలు అంగీకరించలేదు. అందువలన తను ఈ పని చేసినట్టు నాగేశ్వరరావు పోలీసులకు తెలియజేశాడు. తాడేపల్లి పోలీసులు 12 గంటల్లో నిందితుడిను నాగేశ్వరరావును పట్టుకోవడం విశేషం.
 
>
మరిన్ని వార్తలు