కృపారాణి ఇల్లు ముట్టడికి యత్నం

8 Dec, 2013 03:35 IST|Sakshi
టెక్కలి, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజనకు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలపడానికి నిరసనగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు శనివారం టెక్కలిలోని కేంద్రమంత్రి కిల్లి కృపారాణి ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేశారు. దీంతో 12 మంది టీడీపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. ముందుగా మాజీ ఎమ్మెల్యే కె.అచ్చెన్నాయుడు, కె.రామ్మోహన్‌నాయుడుల ఆధ్వర్యంలో బంద్ చేపట్టారు. స్థానిక ఆర్టీసి డిపో ఎదురుగా బైఠాయించి బస్సులను నిలిపివేశారు. రోడ్డుకు అడ్డంగా మంటలు వేసి నిరసన తెలిపారు.
 
 కేంద్రమంత్రి ఫ్లెక్సీలను మంటల్లో వేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం పట్టణంలో ద్విచక్రవాహనాలతో ర్యాలీ నిర్వహించారు. మంత్రి ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించిన అచ్చెన్నాయుడు, రామ్మోహన్‌నాయుడుతో పాటు మరో 10 మందిని పోలీసులు అరెస్టు చేశారు. దీనికి నిరసనగా కార్యకర్తలంతా పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. కేంద్ర మంత్రులు దిగ్విజయ్‌సింగ్, చిరంజీవి, పనబాక లక్ష్మీ, కృపారాణి, బొత్స సత్యనారాయణ, పల్లంరాజు, సోనియాగాంధీ తదితర దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఎల్.ఎల్.నాయుడు, హనుమంతు రామకృష్ణ, చాపరా గణపతి, పి.అజయ్‌కుమార్, శేషు, కాళీ, రాము, బి.తవిటయ్య తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు