యువకులపై కత్తులతో దాడి

16 Nov, 2018 12:21 IST|Sakshi
వినోద్‌ నుంచిఘటన ఎలా జరిగిందనే విషయంపై విచారిస్తున్న డీఎస్పీ, సీఐ

ఇద్దరికి గాయాలు ఒకరిపరిస్థితి విషమం

కర్నూలు , నంద్యాల: పట్టణంలో రౌడీమూకలు రెచ్చిపోతున్నాయి. రైల్వే స్టేషన్‌ వద్ద రెండు గ్రూపులు గొడవ పడి కొట్టుకున్నఘటన మరువకముందే మరో రెండు గ్రూపులు గురువారం ఘర్షణకు దిగి ఒకరిపై ఒకరు కత్తులతో దాడి చేసుకున్నారు. ఈ దాడిలో బైటిపేటకు చెందిన ఆటోడ్రైవర్‌ రాజు, వినోద్‌లు గాయపడ్డారు. రాజు పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నంద్యాల త్రీటౌన్‌ సీఐ సుదర్శన్‌ప్రసాద్‌ తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి..పట్టణంలోని ఆర్‌జీఎం కాలేజీలో చదువుతున్న వార్డు కౌన్సిలర్‌ కుమారుడిని పట్టణంలోని రైతుబజార్‌ వద్ద దేవనగర్‌కు చెందిన కొందరు యువకులు కొడుతుండగా బైటిపేటకుచెందిన రవిరాజ్‌ అనే వ్యక్తి   విడిపించే ప్రయత్నం చేశారు.  విడిపించడానికి వచ్చిన రవిరాజును సైతం చితకబాదారు. దీంతో రవిరాజ్‌కు చెందిన బంధువులు ఎందుకు కొట్టారని బైటిపేటకు చెందిన యువకులను ప్రశ్నించడంతో మాట్లాడుకుందాం రమ్మని నౌమాన్‌నగర్‌లోని ఏవీ సుబ్బారెడ్డి అపార్టుమెంట్‌ వద్దకు పిలిపించారు.

దీంతో రెండు వర్గాలకు చెందిన యువకులు మాటకు మాటకు వచ్చి ఘర్షణకు దిగారు.  ఈ ఘర్షణలో బైటిపేటకు చెందిన రాజు, వినోద్‌లను దేవనగర్‌కు చెందిన ఖాజా, అనిల్‌తో పాటు మరో కొంత మంది బైటిపేటకు చెందిన రాజు, వినోద్‌లను పిడిబాకులతో పొడిచారు. ఈ ఘటనలో రాజుకు తీవ్ర రక్తస్రావమైంది.  దీంతో ఇరువర్గాలు ఎక్కడి వారి అక్కడ చెల్లా చెదురు అయ్యారు. వెంటనే గాయపడిన వారిని నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించగా రవి పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూలుకు తరలించారు. ఈ దాడులు చేసుకున్న వారిలో రౌడీషీటర్లు, యువకులు, విద్యార్థులు ఉన్నారు. విషయం తెలుసుకున్న నంద్యాల డీఎస్పీ గోపాలకృష్ణ, టూటౌన్‌ సీఐ సుదర్శన్‌ప్రసాద్‌ వెంటనే నంద్యాల ప్రభుత్వాసుపత్రికి చేరుకొని పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ గోపాలకృష్ణ మాట్లాడుతూ.. అల్లర్లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, జరిగిన ఘర్షణపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షిస్తామన్నారు. 

మరిన్ని వార్తలు