కృష్ణపట్నంలో ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేయాలి

13 Oct, 2014 02:54 IST|Sakshi
కృష్ణపట్నంలో ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేయాలి

సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి
 
 ముత్తుకూరు: సముద్రంలో చేపల వేటపై ఆధారపడి జీవనం సాగించే మత్స్యకారులు అధికంగా ఉన్న కృష్ణపట్నంలో ఫిషింగ్ హార్బర్ నిర్మించాలని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధనరెడ్డి డిమాండ్ చేశారు. ముత్తుకూరులోని పాతదళితవాడను స్థానిక వైఎస్సార్‌సీపీ నేతలు దత్తత తీసుకుని అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని ఆదివారం కాకాణి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడారు. రాజకీయ కారణాల వల్ల ఫిషింగ్‌హార్భర్ జువ్వలదిన్నెకు తరలిపోయినప్పటికీ కృష్ణపట్నంలో మాత్రం ఒక ఫిషింగ్ హార్భర్ ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రాజెక్టుల వల్ల ముత్తుకూరు అభివృద్ధి చెందినట్టు చాలా మంది అంటున్నారని, కానీ ఆశించిన మేరకు అభివృద్ధి చెందలేదన్నారు. పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తే అభివృద్ధికి సార్థకత ఏర్పడుతుందన్నారు. అందుకు యువకుల్లో నైపుణ్యం పెంచాల్సిన బాధ్యత కూడా పరిశ్రమల యజమానులదేనన్నారు. పేదల ఇంట్లో మరుగుదొడ్డి నిర్మాణానికి రూ.12 వేలు కేటాయిస్తే సరిపోదన్నారు. కనీసం రూ.15 వేలు ఇస్తేనే సాధ్యమవుతుందన్నారు. ఎమ్మెల్యేల కోటా కింద రూ.50 లక్షలు ఇవ్వడం మానేశారన్నారు. పాతదళితవాడలో మురుగుకాలువలు, పక్కాగృహాలు, వీధిలైట్లు, నివేశన స్థలాలు తదితర మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామన్నారు.

 మొక్కలు పెంచితే బహుమతులు
  వైఎస్సార్‌సీపీ దత్తత తీసుకొన్న పాతదళితవాడలో మొక్కలు సక్రమంగా పెంపకం చేసే వారికి ఏటా రూ.5, రూ.3, రూ.2 వేలు చొప్పున మూడేళ్లపాటు బహుమతులు అందజేస్తామని స్థానిక నేత కాకుటూరు లక్ష్మణరెడ్డి తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే కాకాణి మొక్కలు నాటారు. వివిధ సమస్యలపై స్థానికుల నుంచి అర్జీలు స్వీకరించారు. జెడ్పీటీసీ సభ్యుడు నెల్లూరు శివప్రసాద్, వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ మెట్టా విష్ణువర్ధనరెడ్డి, ఎంపీపీ తేట్ల వెంకటసుబ్బమ్మ, మండల ఉపాధ్యక్షుడు మురాల వెంకటేశ్వర్లు, ఎంపీటీసీ సభ్యులు ప్రసాద్‌శర్మ, సుగుణ, సునీత, నాయకులు ఈదూరు శ్రీనివాసులురెడ్డి, తంబిప్రసాద్, బైనారామయ్య పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు