అగ్ని పరీక్ష

16 May, 2018 13:40 IST|Sakshi

సచివాలయం బయట నిలువ నీడ కరవు

వసతుల లేమితో ఫిర్యాదు దారుల అవస్థలు

సాక్షి, అమరావతి బ్యూరో : నిత్యం రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి వివిధ పనులపై వందలాది మంది వెలగపూడిలోని సచివాలయానికి వస్తుంటారు. తమ సమస్యలను ఉన్నతాధికారులు, మంత్రులు, సీఎం దృష్టికి తీసుకెళ్లేందుకు ఎంతో ఆశతో సదూర ప్రాంతాల నుంచి తరలివస్తారు. కానీ వారంతా గేటు బయటే పడిగాపులు కాయాల్సి వస్తోంది. కొద్ది మందిని మాత్రమే సచివాలయంలోనికి అనుమతిస్తున్నారు. మిగిలిన వారందరికీ గంటల తరబడి నిరీక్షణ తప్పడం లేదు. వందల కిలోమీటర్లు ప్రయాణించి వచ్చిన వారికి సచివాలయంలో కనీస సౌకర్యాలు లేక అల్లాడిపోతున్నారు.

ఫిర్యాదుదారులు వేచి ఉండడానికి ప్రత్యేక గదులు ఏర్పాటు చేయాల్సి ఉన్నా... రాష్ట్ర ప్రభుత్వం ఆ మేరకు చర్యలు చేపట్టడంలో విఫలమైంది. దీంతో వారంతా ఎండలోనే ఎండుతూ... అధికారులు ఎప్పుడు కనికరిస్తారో తెలియక వేచి చూడాల్సిన పరిస్థితి దాపురించింది. 45 డిగ్రీల ఎండలో వేచి చూడలేక అక్కడున్న కొద్దిపాటి చెట్ల కిందే కూర్చుంటున్నారు. తాగేందుకు గుక్కెడు నీరు కూడా దొరక్కపోవడంతో వృద్ధులు, చంటిబిడ్డల తల్లులు, సీఎం రిలీఫ్‌ ఫండ్‌ కోసం అనారోగ్యంతో బాధపడుతూ వచ్చే వారు అనుభవిస్తున్న బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి.

పేరు గొప్పు.. ఊరు దిబ్బ..
అంతర్జాతీయిస్థాయి నిపుణులతో, కేవలం ఏడాదిలోనే సచివాలయాన్ని నిర్మించామని సీఎం చంద్రబాబు, మంత్రులు గొప్పలు చెప్పుకోవడం తప్పితే వాస్తవంగా ఆ పరిస్థితులు ఎక్కడా కనిపించడం లేదు.
 వందల కోట్ల రూపాయలు ఖర్చుచేసినా ఫలితం శూన్యం. గతేడాది, ఈ ఏడాదిలో పది రోజుల కిందట కురిసిన ఓ మోస్తరు వర్షానికే ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చాంబర్‌ తడిసి ముద్దయిన విషయం తెలిసిందే. వందల కోట్లు వెచ్చించి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సచివాలయంలోనే సౌకర్యాలు లేకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఒక వేళ ఒకటి, రెండుకు వెళ్లాల్సి వస్తే ఇంక వారి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.

మంచి నీళ్లు లేవు
నేను చిత్తూరు జిల్లా నుంచి వచ్చా. రాత్రంతా ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చే సరికి అలసిపోయా. జీఎన్‌ఎం నర్సింగ్‌ కోర్స్‌ పూర్తి చేశా. ప్రభుత్వాస్పత్రుల్లో కాంట్రాక్ట్‌ పద్ధతిలో మమ్మల్ని తీసుకునేలా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు అర్జీ ఇవ్వడానికి వచ్చాం. ఉదయం నుంచి వేచి చూస్తే ఇద్దరిని మాత్రమే లోనికి పంపించారు. మిగిలిన ఎనిమిది మంది లోపలికి వెళ్లిన వారి కోసం ఎండలోనే వేచి చూస్తున్నాం. ఇక్కడ తాగడానికి కనీసం మంచి నీరు కూడా లేవు.– జయంతి, నర్సింగ్‌ విద్యార్థిని, చిత్తూరు

రెండు రోజులుగా వేచి ఉన్నాను
మాది అనంతపురం జిల్లా తాడిమర్రి మండలం. మా జిల్లాలో వక్ఫ్‌ భూముల సమస్యల గురించి ఉన్నతాధికారులకు విన్నవించుకునేందుకు సచివాలయానికి వస్తే రెండు రోజులుగా లోనికి పంపించడం లేదు. అధికారులను బతిమాలితే ఒక్కరిని మాత్రమే అనుమతించారు. రోజంతా ఎండలోనే నిల్చొని ఉంటున్నాం. కనీసం కూర్చోవడానికి చోటు కూడా లేదు. – షేక్‌ మీరన్‌ సాహెబ్,తాడిమర్రి, అనంతపురం

మరిన్ని వార్తలు