ఎంఏడీఏ ముసుగులో....

22 Apr, 2016 00:20 IST|Sakshi

పోర్టు అనుబంధ పరిశ్రమలకు   భూములు కావాలంటూ ప్రకటన
17 మంది డెప్యూటీ కలెక్టర్ల నియామకం
36,559 ఎకరాల భూ సమీకరణ లక్ష్యం
ఆరునూరైనా ఇవ్వబోమంటున్న రైతాంగం

 

సర్కారు భూదాహం రాజధాని గ్రామాల్లో తీరనట్లుంది. అందుకేనేమో  సీఆర్‌డీఏ పరిధి దాటి రైతుల భూములను లాక్కునేందుకు పావులు వేగంగా కదుపుతోంది. మచిలీపట్నం పోర్టు అనుబంధ పరిశ్రమల పేరిట 36,559 ఎకరాల భూమిని సమీకరించేందుకు సమాయత్తమైంది. ఇందులో భాగంగా మచిలీపట్నం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీని తెరపైకి తెచ్చి అందులో 28 గ్రామాలను విలీనం చేసింది. ఇప్పుడు భూమిని సమీక రించేందుకు ఉపక్రమించింది.

 

మచిలీపట్నం : జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో ప్రభుత్వం భూదందాకు తెరతీసింది. రైతులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, వారి అభిప్రాయాలను తెలుసుకోకుండా భూసమీకరణకు ఎత్తుగడ వేసింది. ఫిబ్రవరి ఒకటో తేదీన మచిలీపట్నం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (ఎంఏడీఏ)ను ఏర్పాటుచేస్తున్నట్లు ప్రకటించింది. మచిలీపట్నం మున్సిపాలిటీతోపాటు మరో 28 గ్రామాలను ఎంఏడీఏ పరిధిలో చేర్చి 1,05,306.34 ఎకరాల భూమి ఉన్నట్లు గుర్తించింది. ఇటీవల మంత్రి కొల్లు రవీంద్ర  మచిలీపట్నంలో పరిశ్రమల స్థాపన, పోర్టు నిర్మాణం కోసం భూ సమీకరణ చేస్తామని, పది రోజుల్లో  ఈ వ్యవహారం కొలిక్కి వస్తుందని చెప్పారు. ఈ నేపథ్యంలో ఎంఏడీఎలో భూసమీకరణ కోసం 15 మంది డెప్యూటీ కలెక్టర్లను నియమిస్తూ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ జేసీ శర్మ బుధవారం జీవో నంబరు 467 జారీచేశారు. గతంలోనే వసంతరాయుడు, ఎం.సమజలను డెప్యూటీ కలెక్టర్లను నియమించగా వారు ఎంఏడీఏ విధుల్లో చేరారు. ఈ పరిణామాలతో ప్రభుత్వం భూదందాకు తెరతీసిందని రైతులు చెబుతున్నారు.

 భూసమీకరణకు ప్రణాళిక ఇలా
ఎంఏడీఏ ఆధ్వర్యంలో 36,559 ఎకరాలు భూసమీకరణ చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. 1200 నుంచి 2 వేల ఎకరాలను ఒక యూనిట్‌గా పరిగణిస్తారు. 20 యూనిట్లను ఏర్పాటుచేసి ఒక్కో యూనిట్‌కు  డెప్యూటీ కలెక్టర్, తహసీల్దార్, ఇద్దరు డెప్యూటీ తహసీల్దార్‌లు, సర్వే ఇన్‌స్పెక్టర్, ఇద్దరు సర్వేయర్లు, ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లను నియమించనున్నారు.  పశ్చిమగోదావరి, విశాఖపట్నం, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, తూర్పుగోదావరి, అనంతపురం జిల్లాల నుంచి ఏడాదిపాటు డెప్యుటేషన్‌పై పనిచేసేందుకు తహశీల్దార్లను నియమించాలని రెవెన్యూ విభాగానికి లేఖ రాశారు.  సిబ్బంది. అధికారుల  నియామకం పూర్తయితే సంబంధిత గ్రామాల్లోని రైతులకు నోటీసులు జారీ చేసి భూసమీకరణ ప్రారంభించనున్నారు.



ఏకపక్ష నిర్ణయాలు
గత ఏడాది ఆగస్టు 31న పోర్టు, అనుబంధ పరిశ్రమల స్థాపన కోసం 30 వేల ఎకరాల భూమిని సేకరించేందుకు నోటిఫికేషన్‌ను ప్రభుత్వం హడావుడిగా జారీచేసింది. దీంతో రైతులు, ప్రజాసంఘాలు, ఆయా పార్టీల నాయకులు పెద్దఎత్తున ఉద్యమాలు చేశారు. తమ భూములు ఇచ్చేది లేదని ఆర్డీవో కార్యాలయంలో తమ అభ్యంతరాలను తెలియజేశారు. దీంతో భూసేకరణ అంశాన్ని పక్కన పెట్టిన ప్రభుత్వం, మచిలీపట్నం ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ఎంఏడీఏను ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించింది. భూసేకరణ కాదు భూసమీకరణ అనే నినాదాన్ని తెరపైకి తెచ్చింది. భూ సమీకరణకు నోటిఫికేషన్ జారీ చేయకుండా,  ఇక్కడ ఎలాంటి పరిశ్రమలు ఏర్పాటు చేస్తారో ప్రకటించకుండా, ఏ పరిశ్రమకు ఎంత భూమి అవసరమో తెలియజేయకుండా, రైతులు అభిప్రాయాలు తెలుసుకోకుండా ప్రభుత్వం తన చిత్తానుసారం వ్యవహరించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరికీ అన్యాయం జరగనివ్వబోమని పాలకులు చెబుతూనే తెరవెనుక మరో విధంగా కథ నడపడం రైతుల కంటిమీద కునుకులేకుండా చేస్తోంది.

 

రైతుల్ని వెంటాడుతున్న భయం
ఎంఏడీఏ పరిధిలో 36,559 ఎకరాల భూమిని భూసమీకరణ ప్రక్రియ ద్వారా తీసుకునే నిమిత్తం ఒకేసారి ఇంతమంది డెప్యూటీ కలెక్టర్లను ప్రభుత్వం నియమించడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందనే భయం రైతులను వెంటాడుతోంది. ఎంఏడీఏ కార్యాలయాన్ని మచిలీపట్నంలోని డీఆర్‌డీఏ కార్యాలయంలో ఏర్పాటు చేసేందుకు జేసీ, ఇతర అధికారులు ఇటీవల పరిశీలించారు. మున్సిపల్ పరిపాలన విభాగం ప్రిన్సిపల్ సెక్రటరీ, ఎంఏడీఏ చైర్మన్ కలికాల వలవన్ గతసోమవారం మచిలీపట్నంలో పర్యటించి  వివరాలు సేకరించారు. ఆయన పర్యటించి వెళ్లిన  రెండు రోజుల వ్యవధిలోనే డెప్యూటీ కలెక్టర్ల నియామకం జరగడం గమనార్హం. ప్రభుత్వం ఎంతమంది అధికారులను నియమించినా, తమకు జీవనాధారంగా ఉన్న భూములను వదులుకునేందుకు సిద్ధంగా లేమని రైతులు తెగేసి  చెబుతున్నారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వారు హెచ్చరిస్తున్నారు.

 

మరిన్ని వార్తలు