దారి దోపిడీ ముఠా అరెస్టు

15 Jun, 2014 02:53 IST|Sakshi

హనుమాన్‌జంక్షన్ : బాపులపాడు మండలం ఆరుగొలను వద్ద ఎంఎన్‌కే రహాదారిపై ఐదు రోజుల క్రితం బీభత్సం సృష్టించి, ఆ ప్రాంత ప్రజలను భయాందోళనలకు గురిచేసిన  దారి దోపిడీ ముఠా సభ్యులను హనుమాన్‌జంక్షన్ పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో శనివారం దోపిడీముఠా అరెస్ట్ వివరాలను సీఐ వై.వి.రమణ వెల్లడించారు.

రోడ్డుపై వెళుతున్న వాహనాలను అడ్డగించి చోరీలకు పాల్పడడం, డబ్బులు ఇవ్వకపోతే వాహనచోదకులను ఇనుప రాడ్లతో విచక్షణారహితంగా చితకబాదటం, బ్లేడులతో శరీరాన్ని పైశాచికంగా కోయడం ఈ ముఠా నైజమని తెలిపారు. 9వ తేదీ అర్ధరాత్రి ఆరుగొలను వద్ద మాటు చేసి నాలుగు లారీలకు అడ్డుకుని దోపిడీకి  పాల్పడ్డారని చెప్పారు.

ఓ లారీ అద్దాలను పగులకొట్టి డబ్బులు ఇవ్వాలని డ్రైవర్, క్లీనర్లను బెదిరించారని, ముగ్గురు వ్యక్తులను తీవ్రంగా గాయపరిచారని సీఐ వివరించారు. లోకల్ లారీలు కావడంతో డ్రైవర్ల దగ్గర వాస్తవానికి పెద్దగా డబ్బు లేకపోవటంతో ప్యూహం బెడిసికొట్టిందనే ఆక్కసుతో వారిని క్రూరంగా కొట్టారని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి హనుమాన్‌జంక్షన్ పోలీసులకు రెండు ఫిర్యాదులు అందటంతో కేసులు నమోదు చేసి, దర్యాప్తు వేగవంతం చేశామన్నారు.

శనివారం నిందితులను రంగయ్యప్పారావు పేట రోడ్డు సమీపంలో పోలీసులు అరెస్టు చేశారని  వివరించారు. ఈ దోపిడీ ముఠా ప్రధాన నాయకుడు తలారి మల్లయ్య అలియాస్ ఏసుతో పాటు ముఠా సభ్యులు అన్నవరపు సాంబశివరావు అలియాస్ శివ, గోరిపర్తి అరవింద్‌కుమార్‌ను అరె స్టు చేశామని తెలిపారు. బాపులపాడు మండలం రంగన్నగూడెంకు చెందిన ఏసు కొంతకాలంగా గుడివాడలో నివాసముంటున్నాడు.

అక్కడే అడపాదడపా దొంగతనాలకు పాల్పడే శివ, అరవింద్‌తో పరిచయం ఏర్పడటంతో ముగ్గురూ కలిసి ఓ ముఠాగా ఏర్పడ్డారని సీఐ వై.వి.రమణ తెలిపారు. హనుమాన్‌జంక్షన్, వీరవల్లి, గుడివాడ పోలీస్ట్ స్టేషన్ పరిధిలో పలుచోట్ల వీరు దారిదోపిడీలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైందని చెప్పారు. ఆయా పోలీస్ స్టేషన్లలో ఈ ముఠాపై మొత్తం తొమ్మిది దోపిడీ కేసులు నమోదై ఉన్నట్లు సీఐ తెలిపారు. ఆరుగొలను ఘటనలో లోకల్ లారీలు కావడంతో స్వల్ప మొత్తంలోనే నగదు దోపిడీ జరిగిందని, నిందితుల నుంచి రూ.1620 స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.. ముగ్గురు నిందితులను అరెస్టుచేసి నూజివీడు కోర్టులో హజరుపర్చనున్నట్లు పేర్కొన్నారు.
 
గతమంతా నేరాలమయమే...
 
ముగ్గురు నిందితులు పాతికేళ్లలోపు వయస్సు వాళ్లే, ఐనా నేరాలు మాత్రం చాంతాడంత ఉన్నాయి. తొలుత అర్ధరాత్రి వేళ్లల్లో రోడ్డు  పక్కన ఆపి ఉన్న లారీల్లో డ్రైవర్లను బెదిరించి దోపిడీలకు పాల్పడిన ముఠా సభ్యులు క్రమంగా రూటు మార్చారు. కొంతకాలంగా దారి దోపిడీలు చేస్తూ పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు.  7వ తేదీన గుడివాడ బైపాస్ రోడ్డులో చోటు చేసుకున్న దారి దోపిడీ  ఈ ముఠా ఘనతేనని పోలీసుల విచారణలో తేలింది.

రెండు వాహనాలను అడ్డగించి దాదాపు రూ.18 వేలు అపహరించారు. దీంతో పాటు 2011లో బొమ్ములూరు సమీపంలోని సంవేద ఎలైట్ వద్ద ఆపి ఉన్న లారీలో డ్రైవర్‌ను బెదిరించి రూ.6500, వీరవల్లి శివారులోని ఓ హోటల్ వద్ద రోడ్డు  పక్కన నిలిపి ఉంచిన లారీలో డ్రైవర్ నుంచి రూ. 18 వేలు దొంగిలించారు. 2013లో బొమ్ములూరు శివారులోని హోటల్ వద్ద ఆపిన లారీలోకి చోరబడి నిద్రిస్తున్న డ్రైవర్ జేబు కోసి రూ.13 వేలు అపహరించారు.

అంతేకాక శివ, అరవింద్  గుడివాడ పోలీస్‌స్టేషన్ పరిధిలోనూ, ఏసు వీరవల్లి, హనుమాన్‌జంక్షన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోనూ గతంలో పలు కేసుల్లో నిందితులుగా ఉన్న పాత నేరస్తులే.కాగా చాకచక్యంగా నిందితులను పట్టుకున్న హనుమాన్‌జంక్షన్ ఎస్‌ఐలు నాగేంద్రకుమార్, ప్రభాకరరావు, కానిస్టేబుల్ హరిబాబు, ఇతర సిబ్బందిని సీఐ అభినందించారు.
 

మరిన్ని వార్తలు