స్వయంపాలన న్యాయమైన డిమాండ్

28 Jan, 2014 04:03 IST|Sakshi
  •     పోలవరంతో ఆదివాసీలకు నష్టం
  •      దాన్ని అడ్డుకుని తీరుతాం...
  •      ఐదో షెడ్యూల్ ప్రాంతాలన్నీ జిల్లాగా ఉండాలి
  •      చట్టాల అమలులో ప్రభుత్వం విఫలం
  •      తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం
  •  
    హన్మకొండ సిటీ, న్యూస్‌లైన్ : స్వయంపాలన ఆదివాసీల న్యాయమైన డిమాండ్ అని తెలంగాణ జేఏసీ చైర్మన్, ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఆరో రాష్ట్ర మహాసభలు హన్మకొండలోని అంబేద్కర్ భవన్‌లో సోమవారం ప్రారంభమయ్యాయి.

    ముఖ్య అతిథిగా హాజరైన కోదండరాం మాట్లాడుతూ ఎన్నో పోరాటాల ఫలితంగా చట్టాలు వచ్చాయని, కానీ... అవి సక్రమంగా అమలు కావడం లేదన్నారు. ఆదివాసీల హక్కుల కోసం రాంజీ గోండు, కొమురం భీం పోరాటాలు చేశారని గుర్తు చేశారు. ఈ క్రమంలోనే 1980లో తుడుందెబ్బ ఆవిర్భవించిందన్నారు. అయితే చట్టాల అమలును గవర్నర్ పరిధిలోకి తీసుకొచ్చినప్పటికీ... వాటిని గుర్తించకపోవడంతో ఆదివాసీలకు ఇబ్బందులు తప్పడం లేదన్నారు.

    గిరిజనుల అభివృద్ధి కోసం ఐటీడీఏలు ఏర్పాటు చేసినా... పెద్దగా ఒరిగిందేమీ లేదన్నారు. వారే క్రమంగా చదువుకోవడం, కొందరు ఉద్యోగాలు సంపాదించడంతో గిరిజనుల్లో కొంత చైతన్యం వచ్చిందన్నారు. దో షెడ్యూల్ అమలుకు తుడుందెబ్బ కృషి చేస్తోందని, హక్కులను కాపాడుకోవడం కోసం పోరాటాలు చేస్తోందన్నారు. భూరియా కమిటీ నివేదికలు ఆశలు కల్పించిందని, దీంతో ఆదివాసీల జీవితాలు బాగుపడతాయని ఆశించినా.. భంగపాటే ఎదురైందని, పీసా చట్టం కూడా నత్తనడకన నడుస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.

    పాలనా యంత్రాంగానికి సమర్థత లేకపోవడంతో చట్టాలు పూర్తిస్థాయిలో అమలు కావడం లేదన్నారు. ఐదో షెడ్యూల్ పరిధిలోని గ్రామాలన్నీ ఒక జిల్లాగా ఏర్పడితే స్వయంపాలన సాధ్యమవుతుందన్నారు. గోదావరిపై పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంతో ఆదివాసీలు భారీగా నష్టపోతారన్నారు. ఈ నిర్మాణాన్ని అడ్డుకుని తీరుతామన్నారు. తెలంగాణ రాష్ర్టం ఏర్పాటయ్యాక ఆదివాసీల హక్కులను అమలు చేసుకుందామని పేర్కొన్నారు.

    రెండు రోజుల పాటు జరగనున్న సభల్లో కార్యాచరణ రూపొందించుకోవాలని, దీనికి తెలంగాణ జేఏసీ సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు. తొలుత సంఘం పతాకాన్ని తుడుందెబ్బ రాష్ర్ట అధ్యక్షుడు వట్టం ఉపేందర్ ఆవిష్కరించారు. సభలో తుడుందెబ్బ సలహాదారుడు పొడుగు శ్రీనాథ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమణాల లక్ష్మయ్య, తెలంగాణ జేఏసీ జిల్లా చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి, టీవీవీ రాష్ట్ర నాయకుడు, ప్రొఫెసర్ సీతారామారావు, ప్రొఫెసర్ ఈసం నారాయణ, డాక్టర్ గుంటి రవి, పొదెం కృష్ణప్రసాద్, మంకిడి బుచ్చయ్య, చిడం చంబు, అరుణ్‌కుమార్, సుమన్ పాల్గొన్నారు.
     

మరిన్ని వార్తలు