ఆఫీస్‌ స్పేస్‌ డిమాండ్‌ అంతంతే

21 Nov, 2023 06:03 IST|Sakshi

అంతర్జాతీయ మందగమనం ప్రభావం

వచ్చే ఆర్థిక సంవత్సరంలో వృద్ధి

క్రిసిల్‌ రేటింగ్స్‌ నివేదిక వెల్లడి

ముంబై: వాణిజ్య కార్యాలయ స్థలాల లీజు (ఆఫీస్‌ స్పేస్‌) మార్కెట్లో డిమాండ్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్తబ్దుగా ఉండొచ్చని క్రిసిల్‌ రేటింగ్స్‌ అంచనా వేసింది. 32–34 మిలియన్‌ చదరపు అడుగుల ఆఫీస్‌ స్పేస్‌ లీజు నమోదు కావచ్చని పేర్కొంది. అదే సమయంలో, దేశీయంగా వాణిజ్య రియల్టీ మార్కెట్‌లో ఉన్న సహజ బలాలు, ఉద్యోగులు తిరిగి కార్యాలయానికి వచ్చి పని చేస్తుండడం అన్నవి మధ్య కాలానికి భారత్‌లో ఆఫీస్‌ స్పేస్‌ లీజు డిమాండ్‌ను పెంచుతాయని తెలిపింది.

దేశీ ఆఫీస్‌ స్పేస్‌ మార్కెట్లో ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీలు 42–45 శాతం వాటాతో అగ్రగామిగా ఉన్న విషయాన్ని ఈ నివేదిక గుర్తు చేసింది. బహుళజాతి సంస్థలకు చెందిన అంతర్జాతీయ సామర్థ్య కేంద్రాలు (జీసీసీ) సైతం గడిచిన కొన్ని సంవత్సరాల్లో కిరాయిదారులకు కీలక విభాగంగా మారినట్టు తెలిపింది. మొత్తం ఆఫీస్‌ స్పేస్‌ లీజు మార్కెట్లో జీసీసీల వాటా మూడింట ఒక వంతుగా ఉన్నట్టు పేర్కొంది.

‘‘ఆఫీస్‌ స్పేస్‌ నికర లీజు పరిమాణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండు అంశాల వల్ల ప్రభావితమవుతుంది. ఐటీ, ఐటీఈఎస్‌ కంపెనీల్లో నికర ఉద్యోగుల నియామకాలు నిలిచాయి. ఆదాయం తగ్గి, లాభదాయకతపై ఒత్తిళ్ల నెలకొన్నాయి. ఈ రంగం వ్యయ నియంత్రణలపై దృష్టి సారించొచ్చు. యూఎస్, యూరప్‌లో స్థూల ఆర్థిక సవాళ్ల నేపథ్యంలో జీసీసీలు దేశీయంగా పెద్ద స్థాయి లీజింగ్‌ ప్రణాళికలను వాయిదా వేయవచ్చు’’అని క్రిసిల్‌ రేటింగ్స్‌ డైరెక్టర్‌ గౌతమ్‌ షాహి వివరించారు.

దేశీయంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్‌ సరీ్వసులు, ఇన్సూరెన్స్, కల్సలి్టంగ్, ఇంజనీరింగ్, ఫార్మా, ఈ కామర్స్‌ విభాగాలు ఆఫీస్‌ స్పేస్‌ మార్కెట్లో మిగిలిన వాటా ఆక్రయమిస్తాయని చెబుతూ.. వీటి నుంచి డిమాండ్‌ కారణంగా 2023–24లో 32–34 మిలియన్‌ చదరపు అడుగుల లీజ్‌ నమోదు కావచ్చని క్రిసిల్‌ రేటింగ్స్‌ పేర్కొంది.  

ఉద్యోగుల రాక అనుకూలం..
కంపెనీల యాజమాన్యాలు ఉద్యోగులు తిరిగి కార్యాలయాలకు వచ్చి పని చేయాలని కోరుతుండడం ఆఫీస్‌ స్పేస్‌ లీజు మార్కెట్‌కు ప్రేరణగా క్రిసిల్‌ రేటింగ్స్‌ అభిప్రాయపడింది. ఇప్పటి వరకు ఇంటి నుంచే పనికి వీలు కల్పించిన కంపెనీలు, ఇప్పుడు వారంలో ఎక్కువ రోజులు కార్యాలయాలకు రావాలని కోరుతుండడాన్ని ప్రస్తావించింది. గత ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగులు కార్యాలయాలకు రాక 40 శాతంగా ఉంటే, అది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 65–70 శాతానికి చేరుతుందని వివరించింది.

సమీప కాలంలో సమస్యలు నెలకొన్నప్పటికీ వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆఫీస్‌ స్పేస్‌ లీజు మార్కెట్‌ 10–12 శాతం వృద్ధితో 36–38 మిలియన్‌ చదరపు అడుగులకు చేరుకుంటుందని క్రిసిల్‌ రేటింగ్స్‌ అసోసియేట్‌ డేరెక్టర్‌ సైనా కత్వాల తెలిపారు. మధ్య కాలానికి వృద్ధి ఇదే స్థాయిలో ఉంటుందన్నారు.

తక్కువ వ్యయాల పరంగా ఉన్న అనుకూలత, నైపుణ్య మానవ వనరుల లభ్యత నేపథ్యంలో జీసీసీలు ఆఫీస్‌ స్పేస్‌ లీజు మార్క్‌ను ముందుండి నడిపిస్తాయని క్రిసిల్‌ రేటింగ్స్‌ పేర్కొంది. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా, ముంబై ఎంఎంఆర్‌లో గ్రేడ్‌–ఏ ఆఫీస్‌ స్పేస్‌ 2023 మార్చి నాటికి 705 మిలియన్‌ చదరపు అడుగులుగా ఉన్నట్టు తెలిపింది. ఆసియాలోని ప్రముఖ పట్టణాలతో పోలిస్తే భారత్‌లోని పట్టణాల్లోనే సగటు ఆఫీస్‌ స్పేస్‌ లీజు ధర తక్కువగా ఉన్నట్టు వెల్లడించింది. 

మరిన్ని వార్తలు