క్షమాభిక్ష.. ఇదో కక్ష

26 Feb, 2019 09:18 IST|Sakshi
సెంట్రల్‌ జైలులో శిక్ష అనుభవిస్తూ అనారోగ్యంతో బాధపడుతున్న ఖైదీలు(ఫైల్‌)

నిరాశపరచిన జీవో

వృద్ధాప్యం, అనారోగ్యంతో బాధపడుతున్న ఖైదీలకు లభించని విముక్తి

వివక్ష చూపారంటూ పలువురు ఖైదీల ఆవేదన

రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలులో 57 మంది అర్హులు ఉండగా

కేవలం ఎనిమిది మందికే విడుదల అవకాశం

తూర్పుగోదావరి, రాజమహేంద్రవరం క్రైం: రాష్ట్ర ప్రభుత్వం జీవిత ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదిస్తూ విడుదల చేసిన జీఓ ఎంఎస్‌ నంబర్‌ 46 ఖైదీలకు నిరాశ మిగిల్చింది. రాష్ట్ర ప్రభుత్వం 2019 జనవరి 26న రిపబ్లిక్‌ డే సందర్భంగా ఖైదీల క్షమాభిక్ష ప్రసాదిస్తూ జీఓ విడుదల చేసింది. దీని ప్రకారం రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైల్‌ నుంచి 57 మంది ఖైదీలు అర్హులైన వారు ఉన్నారని జాబితా తయారు చేస్తూ అధికారులు ప్రభుత్వానికి పంపారు. ఎట్టకేలకు ప్రభుత్వం జీవిత ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదిస్తూ ఈనెల 25వ తేదీ సోమవారం జీఓ విడుదల చేసింది. అయితే రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైల్‌ నుంచి కేవలం ఎనిమిది మంది మాత్రమే విడుదల చేస్తూ పేర్లు ప్రకటించడంతో ఖైదీల్లో నిరాశ నెలకొంది. ఏళ్ల తరబడి జైలులో మగ్గుతూ వృద్ధాప్యంలోనైనా విడుదలై తమ వారితో కలసి శేష జీవితం గడపాలనుకునే ఖైదీల ఆశలపై సర్కారు నీళ్లుచల్లింది. 

గత ఏడాది ఇలా..
గత ఏడాది 2018లో రాష్ట్ర ప్రభుత్వం జీఎం ఎంఎస్‌ నంబర్‌ 8ను విడుదల చేసింది. దీని ప్రకారం రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలు నుంచి సుమారు 60 మంది వరకూ క్షమాభిక్షకు అర్హులైన ఖైదీల లిస్ట్‌ను రాష్ట్ర ప్రభుత్వానికి పంపారు. అయితే కేవలం రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలు నుంచి 18 మందికి మాత్రమే క్షమాభిక్ష ప్రసాదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. రాజమహేంద్రవరం మహిళా కేంద్ర కారాగారం నుంచి ఎనిమిది మంది క్షమాభిక్షకు అర్హులు ఉండగా ఒక్కరూ కూడా విడుదలకు నోచుకోలేదు.

ఈ ఏడాది ఎనిమిది మందిని మాత్రమే
ఈ ఏడాది 2019లో జీఓ నంబర్‌ 6ను ప్రభుత్వం విడుదల చేసింది. దీని ప్రకారం రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలులో ఏడేళ్లు శిక్షా కాలం పూర్తి చేసి మూడేళ్లు రెమిషన్‌తో కలిపి పదేళ్ల శిక్ష కాలం పూర్తి చేసిన వారు 57 మంది అర్హులు ఉన్నారు. అలాగే ఓల్డ్‌ ఏజ్‌ (వృద్ధాప్యం లో ఉన్న వారు) ఐదేళ్లు పూర్తి చేసి రెండేళ్లు రెమిషన్‌తో కలిపి మొత్తం ఏడేళ్ల శిక్షా కాలం పూర్తి చేసిన వారు ఒకరు ఉన్నారు. 498 ఏ కేసులో 14 ఏళ్లు శిక్షా కాలం పూర్తి చేసి ఆరేళ్ల రెమ్యూషన్‌తో కలిపి మొత్తం 20 ఏళ్ల శిక్షా కాలం పూర్తి చేసిన వారు ఒకరు ఉన్నారు. మొత్తం రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలు నుంచి 57 మంది అర్హులైన వారు ఉండగా కేవలం ప్రభుత్వం ఎనిమిది మందిని మాత్రమే విడుదల చేస్తూ జీఓ ఇచ్చింది.

క్షమాభిక్ష ఖైదీల సంఖ్యను తగ్గిస్తున్న ప్రభుత్వం
క్షమాభిక్ష పెట్టేందుకు టీడీపీ ప్రభుత్వం చొరవచూపడం లేదని ఖైదీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2016 జూలై 25న క్షమాభిక్ష ప్రసాదించినప్పుడు రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలు నుంచి 110 మంది ఖైదీలు క్షమాభిక్ష పై విడుదలయ్యారు. 2018 జూన్‌ 10వ తేదీన 66 మంది అర్హులైన వారి పేర్లు పంపించగా కేవలం 18 మందిని మాత్రమే విడుదల చేశారు. ఈ ఏడాది క్షమాభిక్ష కోసం అర్హులైన వారి పేర్లు 57 మంది పురుష ఖైదీలు, ఆరుగురు మహిళా ఖైదీల లిస్టు పంపితే కేవలం ఎనిమిది మందిని మాత్రమే విడుదల చేస్తూ ప్రభుత్వం జీఓ ఇచ్చింది. 498ఏలో శిక్ష పడిన ఖైదీలకు, ఉద్యోగుల హత్య కేసులో జైలుకు వచ్చిన ఖైదీలకు, అనారోగ్యంతో వృద్ధాప్యంలో ఉన్న ఖైదీలకు ప్రభుత్వం దయతో  క్షమాభిక్ష ప్రసాదించాలని ఖైదీలు కోరుతున్నారు.

కోర్టును ఆశ్రయించడమే వారు చేసిన తప్పు
రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైల్‌లో 2018లో అర్హులైన 22 మంది ఖైదీలు తాము క్షమాభిక్ష విడుదలకు అన్ని విధాలా అర్హులమని, అయితే ప్రభుత్వం జీవో వల్ల విడుదలకు నోచుకోలేదని కోర్టును ఆశ్రయించారు. కోర్టు వీరి పిటిషన్‌ను పరిశీలించి ఖైదీలను విడుదల చేయాలంటూ తీర్పు ఇచ్చింది. అయితే కోర్టు తీర్పును ప్రభుత్వం పట్టించుకోకుండా గత ఏడాది కోర్టును ఆశ్రయించిన 22 మంది ఖైదీలను ఈసారి కూడా ప్రభుత్వం విడుదల చేయలేదు.

>
మరిన్ని వార్తలు