జాబితా సిద్ధం

26 Sep, 2015 04:45 IST|Sakshi

6,060 మందితో టీచర్ల సీనియార్టీ లిస్ట్
అభ్యంతరాలు స్వీకరణకు నేడు గడువు
వెలుగు చూస్తున్న అక్రమాలు

 
 అనంతపురం ఎడ్యుకేషన్ : ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించిన సీనియార్టీ జాబితా ఎట్టకేలకు తయారైంది. శుక్రవారం రాత్రి ఈ జాబితాను విద్యాశాఖ కమిషనర్ ప్రకటించారు. అన్ని కేడర్లకు సంబంధించి 6,060 మంది టీచర్లతో కూడిన సీనియార్టీ జాబితాను డీఈఓ వెబ్‌సైట్‌లో ఉంచారు. షెడ్యూలు ప్రకారమైతే శుక్ర, శనివారం అభ్యంతరాలు స్వీకరించాల్సి ఉంది. అయితే ఒకరోజు ఇప్పటికే ముగియడంతో శనివారం సాయంత్రం మాత్రమే అభ్యంతరాలు స్వీకరించనున్నారు. అభ్యంతరాలు ఎస్జీటీ కేడర్ అయితే మండల విద్యాశాఖ అధికారులు, స్కూల్ అసిస్టెంట్ కేడర్ అయితే  డిప్యూటీ డీఈఓలకు ఆధారాలతో సహా అందజేయాల్సి ఉంటుంది.

ఆయా ఎంఈఓ, డిప్యూటీ డీఈఓల పరిశీలన అనంతరం వాటిని పరిగ ణలోకి తీసుకుంటారు. అయితే ప్రాధాన్యత పాయింట్లు కేటాయింపుల్లో పలు అక్రమాలు చోటు చేసుకున్నట్లు తెలిసింది.  ఉపాధ్యాయులకు పాఠశాలలకు హాజరుశాతం, దాతల సహకారంతో పాఠశాలల అభివృద్ధి, స్థానికంగా ఉన్నట్లు ధ్రువీకరణ తదితర అంశాల్లో భారీగానే అక్రమాలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొందరు టీచర్లు అక్రమాలకు సంబంధించిన ఆధారాలను విద్యాశాఖ అధికారులకు అందజేశారు. సీనియార్టీ జాబితా పరిశీలిస్తే మరిన్ని అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆయా స్కూళ్లలో పని చేస్తున్న తోటి ఉపాధ్యాయులే కడుపు మండి అక్రమంగా పాయింట్లు వాడుకున్న టీచర్ల గురించి ఫిర్యాదులు చేస్తున్నట్లు తెలిసింది. దీనికితోడు కొందరు ఉపాధ్యాయ సంఘాల నాయకులు సైతం అక్రమాల వివరాలను సేకరిస్తున్నారు.

 ఊపిరి పీల్చుకున్న  విద్యాశాఖ సిబ్బంది
 ఎంఈఓలు, డిప్యూటీ డీఈఓలు ఆమోదం చేసిన దరఖాస్తులను ఆన్‌లైన్ కన్‌ఫర్మేషన్ చేసే ప్రక్రియ ముగియడంతో విద్యాశాఖ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. డీఈఓ కార్యాలయంలో మూ డు రోజులుగా రోజూ అర్ధరాత్రి దాకా కన్‌ఫర్మేషన్ చేశారు. డీఈఓ అంజయ్య, డిప్యూటీ డీఈఓ పగడాల లక్ష్మీనారాయణ పర్యవేక్షణలో సుమారు 15 మంది హెచ్‌ఎంలు, డీఈఓ కార్యాలయ సిబ్బంది ఈ ప్రక్రియలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు