రూ.30కోట్ల నిర్లక్ష్యం

9 May, 2015 04:52 IST|Sakshi
రూ.30కోట్ల నిర్లక్ష్యం

- పేరుకుపోతున్న కేసులు
- పట్టించుకోని అధికారులు
- వెంటాడుతున్న ఆర్థిక సంక్షోభం
విజయవాడ సెంట్రల్ :
అధికారుల అలసత్వం,పాలకుల నిర్లక్ష్యం కారణంగా నగరపాలక సంస్థలో కేసుల పెండింగ్ జాబితా పెరిగిపోతోంది. 1994 నుంచి ఇప్పటి వరకు 1,049 కేసులు పెండిగ్‌లో ఉన్నాయి. వీటి ద్వారా రూ.30కోట్ల 37 లక్షల, 68 వేల 534 ఆదాయం రావాల్సి ఉందంటే ఔరా అనిపించవచ్చేమో కానీ ఇది నిజం అని లీగల్‌సెల్ రికార్డులు చెబుతున్నాయి. ఎస్టేట్స్, ప్రజారోగ్యం, రెవెన్యూ విభాగాల్లోనే కేసుల పెండింగ్ సంఖ్య ఎక్కువగా ఉంది. లీగల్‌సెల్ పనితీరుపై పర్యవేక్షణ కొరవడిందనే విమర్శలు ఉన్నాయి.

కుదరని రాజీ
ఎస్టేట్స్ విభాగంలో వస్త్రలత అద్దెలకు సంబంధించి బకాయిలు భారీగా ఉన్నాయి. దీనిపై ఇటీవలే కమిషనర్ జి.వీరపాండియన్ అసోసియేషన్ ప్రతినిధులతో చర్చలు నిర్వహించారు. తాము చెల్లించాల్సిన మొత్తానికి సంబంధించి వడ్డీని పూర్తిగా తొలగించాల్సిందిగా వారు డిమాండ్ చేశారు. మినహాయింపు కొంతమేరకే ఇవ్వగలమని కమిషనర్ తేల్చిచెప్పారు. చర్చలదశలోనే ప్రతిష్టంభన నెలకొంది. గతంలో ఎంపీ కేశినేని నాని, మేయర్ కోనేరు శ్రీధర్ నిర్వహించిన చర్చలు సఫలం కాలేదు.

ప్రజారోగ్యశాఖలో యూజర్ చార్జీలు, డీఅండ్‌ఓ ట్రేడ్స్‌పై కేసులు నడుస్తున్నాయి. ట్రేడ్ లెసైన్స్‌ల వివాదానికి సంబంధించి నగరపాలక సంస్థలోని అన్ని పార్టీల ఫ్లోర్‌లీడర్లతో కమిటీని ఏర్పాటు చేశారు. ఇంత వరకు ఎలాంటి సమావేశం నిర్వహించిన దాఖలాల్లేవు. నగరపాలక సంస్థ ఆర్థిక సంక్షోభం దృష్ట్యా పాలకులు, అధికారులు దృష్టిసారిస్తే రూ.30 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉంది.
 

మరిన్ని వార్తలు