ప్రియుడి ఇంటి ముందు యువతి మౌనదీక్ష

7 Feb, 2020 13:08 IST|Sakshi
దంతుపల్లిలో ప్రియుడి ఇంటిముందు మౌనదీక్షకు దిగిన చెల్లబోయిన నాగలక్ష్మి, కుటుంబ సభ్యులు

పశ్చిమ గోదావరి, అత్తిలి: ప్రేమించి పెళ్లిచేసుకుంటానని నమ్మించాడు. పెద్దల సమక్షంలో పెళ్లిచేసుకుంటానని ఒప్పుకున్నాడు. తీరా ముహూర్తం సమయానికి ప్రేమికుడు పత్తా లేకుండా పోవడంతో యువతి ప్రియుడి ఇంటిముందు మౌనదీక్షకు దిగిన ఘటన అత్తిలి మండలం దంతుపల్లి గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. బాధితురాలు చెల్లబోయిన నాగలక్ష్మి తెలిపిన వివరాల ప్రకారం...పెనుమంట్ర మండలం మాముడూరు గ్రామానికి చెందిన నాగలక్ష్మి అదే గ్రామంలో  రొయ్యల కంపెనీలో పనిచేయడానికి వెళుతుంది. అత్తిలి మండలం దంతుపల్లి గ్రామానికి చెందిన కడలి కిషోర్‌ రొయ్యల కంపెనీలో  వ్యాన్‌ డ్రైవర్‌గా పనిచేస్తుండేవాడు. ఐదు నెలల క్రితం కిషోర్‌ తన వెంటపడి ప్రేమిస్తున్నాను అని చెప్పాడని తొలుత అంగీకరించలేదని, తర్వాత అతని నిజాయతీని చూసి తానుకూడా ప్రేమించానని తెలిపింది. అయితే తనకు నమ్మకంలేక పెళ్లిచేసుకోవాలని కోరానని, రెండు నెలలు క్రితం ఫ్యాక్టరీ వద్ద తాళికట్టాడని, ఇంట్లో ఎవరికీ చెప్పవద్దని, రెండేళ్ల తరువాత ఇంటికి తీసుకువెళతానని అప్పటి వరకు ఎవరి ఇంటి వద్ద వాళ్లే ఉందామని చెప్పాడని తెలిపింది.

గత నెల 18వ తేదీ రాత్రి కిషోర్‌ తన ఇంటికి రావడంతో తమ కుటుంబ సభ్యులు అతనిని పట్టుకుని పెనుమంట్ర పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారని చెప్పింది. అక్కడ పోలీసుల సమక్షంలో నాగలక్ష్మిని పెళ్లి చేసుకున్నానని కిషోర్‌ ఒప్పుకున్నాడని, అంగీకార పత్రంపై ఇరు కుటుంబాల పెద్దలు సంతకాలు చేశారని వెల్లడించింది.  దీంతో పెద్దలు వీరికి ఈనెల 5వ తేదీన  సాయంత్రం మాముడూరు వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో వివాహం చేయడానికి నిశ్చయించారు. అయితే వివాహానికి నాగలక్ష్మి సిద్ధమవుతున్న తరుణంలో  5వ తేదీ మధ్యాహ్నం కిషోర్‌ కుటుంబ సభ్యులు తమ పెద్దలకు ఫోన్‌చేసి, తమ అబ్బాయి కనిపించడంలేదని తెలిపారని, దీనిపై పెనుమంట్ర పోలీసులకు సమాచారం ఇచ్చామని చెప్పింది. తనకు న్యాయం చేయాలని కోరుతూ గురువారం  ప్రియుడు కిషోర్‌ ఇంటి ముందు కుటుంబ సభ్యులతో కలిసి నాగలక్ష్మి  మౌనదీక్షకు దిగింది. ప్రియుడి ఇంటికి తాళం వేసిఉండటంతో బాధితురాలు ఇంటి ముందే కూర్చుంది.  తనకు న్యాయం చేయాలని, కిషోర్‌తో పెళ్లి చేసేవరకు ఇక్కడే ఉంటానని  నాగలక్ష్మి పేర్కొంది. ఈసమాచారాన్ని ఆమె 100 నంబర్‌కు తెలపడంతో అత్తిలి పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని  బాధితురాలి నుంచి  వివరాలు సేకరించారు. న్యాయం జరుగుతుందని, అధైర్యపడవద్దని పోలీసులు ఆమెకు భరోసా కల్పించారు.

మరిన్ని వార్తలు