బలపడనున్న అల్పపీడనం

29 Nov, 2014 01:07 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: నైరుతి బంగాళాఖాతానికి ఆనుకుని శ్రీలంక సమీపంలో (గల్ఫ్ ఆఫ్ మన్నార్) ఏర్పడ్డ అల్పపీడనం కొనసాగుతోంది. ఇది రానున్న 24 గంటల్లో మరింత బలపడనుందని భారత వాతావరణవిభాగం (ఐఎండీ) శుక్రవారం రాత్రి విడుదల చేసిన నివేదికలో తెలిపింది. దీనికి తోడు సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కూడా ఏర్పడింది. దీని ప్రభావంతో వచ్చే 48 గంటల్లో తమిళనాడులో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది.

అదే సమయంలో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు గాని, ఉరుములతో కూడిన జల్లులు గాని కురుస్తాయని, ఉత్తర కోస్తా, తెలంగాణల్లో అక్కడక్కడ జల్లులు పడే అవకాశం ఉందని తెలిపింది. గడచిన 24 గంటల్లో అత్యల్పంగా ఆంధ్రప్రదేశ్‌లోని ఆరోగ్యవరంలో 13, తెలంగాణలోని ఆదిలాబాద్‌లో 11 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

మరిన్ని వార్తలు